HYDRAA | హైదరాబాద్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): హైడ్రా బుల్డోజర్లు పేద బతుకులను చిదిమేస్తున్నాయి. వీటి బారినపడినప్పటికీ పెద్దోళ్లు ఏదోలా బయటపడుతున్నా, పేదల జీవితాలే అతలాకుతలమైపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసున్నట్టు హైడ్రా ప్రకటించింది. ఇందులో 90 శాతం ఇండ్లు దిగవ మధ్య తరగతి, నిరుపేదలవే. పొద్దంతా కాయకష్టం చేసి రూపాయి, రూపాయి కూడ బెట్టుకొని కట్టుకున్న ఇండ్లు అవి. నోటీసులు లేకుండా పిడుగు వచ్చి మీద పడ్డట్టు కండ్ల ముందే కూలగొడుతుంటే కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా కనికరించకపోగా, పైపెచ్చు అధికారుల పనులకు ఆటంకం కలిగించారంటూ క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.
అదే సమయంలో ఎదురు తిరిగిన పెద్దలకు మాత్రం ప్రైవేటుగా నష్టపరిహారాలతో హైడ్రా మోకరిల్లుతున్నది. హైడ్రా చేతిలో ఇటీవలే ఇంటిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సమస్యను ఢిల్లీలోని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తే నష్టపరిహారం కింద రూ. 30 కోట్లు ముట్టజెప్పినట్టు తెలిసింది. అంతేకాదు, గండిపేట చెరువు కిందనే ఉన్న మరో ఇంటిని కూలగొట్టబోమనే హామీ ఇచ్చి బయటపడినట్టు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది.
విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పనితీరు ముఖ్యనేత మెడకు చుట్టుకున్నది. గండిపేట చెరువు కింద పొరుగు రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు 9 ఏండ్ల క్రితం ఏడెకరాల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఆ తర్వాత ఇంటి నిర్మాణ అనుమతులు తీసుకుని విలాసవంతమైన విల్లా కట్టుకున్నారు. హైడ్రా తొలిదశ కూల్చివేతల్లో సదరు నాయకుడి ఇల్లు నేలమట్టం చేశారు. విల్లాను కూల్చివేయడానికి వచ్చినప్పడే ఆ నేత ఓ ప్రముఖ మంత్రిని సంప్రదించే ప్రయత్నం చేశారు. ఆయనకు పదేపదే ఫోన్లు చేసినప్పటికీ లిఫ్ట్ చేయలేదు. దీంతో మరో కీలక మంత్రికి ఫోన్ చేస్తే.. ఆయన తానేమీ చేయలేనని చేతులు ఎత్తేసినట్టు తెలిసింది.
హైడ్రా మీద విమర్శలు వెల్లువెత్తడంతో ‘ఇది కురుక్షేత్ర యుద్ధంతో సమానం. మా పార్టీ నేతల నుంచి కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి. ఒత్తిళ్లు వస్తున్నాయి. వెనక్కి తగ్గేది లేదు. తప్పును సరి చేసుకునే సమయం ఇది.. సరిచేసుకోండి’ అని సర్కారు ఒకింత గట్టిగానే హెచ్చరించినట్టు సమాచారం. ఈ హెచ్చరికలతో కంగుతిన్న సీనియర్ నాయకుడు నేరుగా ఢిల్లీ వెళి ్ల కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ఖర్గేను కలిసి మొరపెట్టుకున్నారు. అన్ని అనుమతులు ఉన్న తన ఇంటిని అక్రమంగా కూల్చడమే కాకుండా తానో కబ్జాకోరును అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటి వరకు తనది మచ్చలేని రాజకీయ జీవితమని, జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశానని, సొంత ప్రభుత్వమే ఈ వయసులో తనపై కబ్జా ముద్ర వేసి సమాజం ముందు నిలబెట్టిందని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఫిర్యాదు నేపథ్యంలో వాస్తవ పరిస్థితులపై ఆరా తీసి, పంచాయితీ పరిష్కరించాలని పార్టీలో ఇటువంటి వ్యవహారాలు చూసే నాయకుడిని హైకమాండ్ పురమాయించినట్టు సమాచారం. రంగంలోకి దిగిన ఢిల్లీ నేత పార్టీ నాయకుల మీద ప్రతాపం సరికాదని, హైకమాండ్ సీరియస్‌గా ఉందని, మరోసారి పార్టీ నేతల నుంచి ఫిర్యాదులు వస్తే, పరిణామాలు తన చేతిలో ఉండవని గట్టిగానే హెచ్చరించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఆంధ్రా కాంగ్రెస్ నాయకుడిని బుజ్జగించడానికి, తెలంగాణకు చెందిన ఒక సీనియర్ నాయకుడిని రాయబారానికి పంపగా ప్రభుత్వ చర్యల మీద ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. సదరు నేత వినకపోవడంతో రూ. 30 కోట్ల నష్టపరిహారంతోపాటు ఇప్పుడు కూలగొట్టిన ఫాంహౌస్‌ను ఆనుకొని ఉన్న ఆయన బంధువు విల్లా జోలికి ప్రభుత్వం పోదని హామీనివ్వడంతో సదరు నేత శాంతించినట్టు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.