హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారులు రాజ్యమేలుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేండ్లలో 14 మంది సలహాదారులుగా నియమితులయ్యారు. అంటే సగటున ప్రతి రెండు నెలలకూ ఒక సలహాదారున్ని నియమిస్తూ సర్కార్ జీవోలు విడుదలవుతున్నాయి. వీరంతా క్యాబినెట్ హోదా ఉన్నవారే కావడం గమనార్హం.
ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రుల సంఖ్యకు దాదాపు సమానంగా సలహాదారులు ఉన్నారు. మరీ విడ్డూరం ఏమిటంటే! కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పేరుతో ఇప్పటికే ఇద్దరు సలహాదారులను ప్రభుత్వం నియమించగా, మరో ముగ్గు రు సలహాదారుల నియామకం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఇలా కొన్ని శాఖలకు క్యాటగిరీలవారీగా సలహాదారుల నియామకం జరిగింది. వీరిచ్చేవి ‘ఉచిత’ సలహాలు కాదు!
లక్షలకు లక్షల జీతాలు, భ త్యాలూ అందుకుంటున్నారు. మరి వీరేం పనిచేస్తున్నారు? ఎలాంటి సలహాలు ఇస్తున్నారనేది మాత్రం అంతుచిక్కని రహస్యం! ‘వారిలో సీఎం రేవంత్‌కు ఎవరైనా సలహాలు ఇస్తు న్నారా? ఇస్తున్నా.. ఆయన వినడం లేదా? హైడ్రాను పంపి ఇండ్లు కూలగొట్టమని ఎవరు చెప్తున్నారు?’.. ఇదీ పలు సందర్భాల్లో రాజకీ య విశ్లేషకులు వ్యక్తంచేసిన సందేహాలు.
మరోవైపు ప్రభుత్వంలో పీఆర్వోలు గుంపులు గుంపులుగా ఉన్నారు. ఒక్కో మంత్రి ముగ్గు రు, నలుగురు చొప్పున పీఆర్వోలను నియమించుకున్నారు. మంత్రివర్గం అంతటికీ కలిపి 59 మంది పీఆర్వోలు ఉన్నట్టు సమాచారం. వీరిలో అత్యధిక శాతం మందికి మెయిన్‌స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులతో సంబంధాలే ఉండ వు. మరి రాసేవాళ్లు ఎందరు? మోసేవాళ్లు ఎందరు? అనేది ఇప్పటికీ భేతాళ ప్రశ్నే.
2023 డిసెంబర్ 7న సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత మూడు రోజులకే ఏడుగురు సలహాదారులను తొలగించారు. ‘రాష్ట్ర ఖజానాకు తీవ్ర ఆర్థికనష్టం కలిగించడంలో సలహాదారుల పాత్ర ఉన్నది. మా ప్రభుత్వానికి సలహాదారుల అవసరమే లేదు’ అని చెప్పుకొన్నారు. కానీ, జనవరి 20న అంటే అధికారంలోకి వచ్చిన నెలన్నరకు సీఎం తనకు నమ్మకస్తుడైన వేం నరేందర్‌రెడ్డిని ప్రధాన సలహాదారుగా నియమించారు. క్యాబినెట్ హోదా కల్పించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ష బ్బీర్ అలీకి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ శాఖ ల ప్రధాన సలహాదారుగా, మరో సీనియర్ నేత హరర వేణుగోపాల్‌ను ప్రొటోకాల్, ప్రజాసంబంధాల సలహాదారుగా నియమించి క్యాబినెట్ హోదా ఇచ్చారు. సలహాదారుల పోస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పునరావాసం కోసం వాడుకొంటున్నది.
పార్లమెంటు ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఏపీ జితేందర్‌రెడ్డిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా, బీఆర్ఎస్ నుంచి గోడ దూకిన పోచారం శ్రీనివాసరెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన కేశవరావును పబ్లిక్ ఎఫైర్స్ సలహాదారుగా నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనులు ప్రారంభించిన రెండు రోజుల్లోనే సొరంగం కూలి, 8 మంది కూరుకుపోయారు.
కనీసం వారి మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపెట్టలేని ప్రభుత్వం.. ఇటీవల ఆ టన్నెల్ కోసమే ఇద్దరిని సలహాదారులుగా నియమించింది. మరో ముగ్గురు సలహాదారులను పెట్టుకోవడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని సమాచారం. తాజాగా డీజీపీగా ఉద్యోగ విరమణ పొందిన శివధర్‌రెడ్డికి రాష్ట్ర భద్రతా సలహాదారు అనే పోస్టు సృష్టించి మరీ నియమించారు. శాసనసభ చరిత్రలోనే తొలిసారిగా రేవంత్ ప్రభుత్వం శాసనసభా వ్యవహారాల సలహాదారు పోస్టును సృష్టించింది. సూర్యదేవర ప్రసన్నకుమార్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది.
రాష్ట్రంలో 15 మంది మంత్రులు ఉన్నారు. ప్రతి మంత్రికీ ఒక పీఆర్వో ఉండటం అవసరమే. కానీ తుమ్మల మినహా ప్రతి మంత్రికి ముగ్గురు, నలుగురు చొప్పున పీఆర్వోలు ఉ న్నట్టు సమాచారం. సీఎం రేవంత్‌కు సీపీఆర్వో, ఐఅండ్ పీఆర్ అధికారులు కాకుండా మరో నలుగురు పీఆర్వోలు ఉన్నారు. డిప్యూ టీ సీఎం భట్టికి ముగ్గురు పీఆర్వోలు ఉన్నట్టు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 59 మంది ఉన్నట్టు సచివాలయ వర్గాలే తెలిపాయి. వీరేకాకుండా కార్పొరేషన్లకు కన్సల్టెంట్లు అదనం. వీళ్లలో ఎక్కువ మందికి కనీసం మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులతో ప్రత్యక్ష పరిచయాలే లేవని అంటున్నారు.
వీళ్లు ఒక అసిస్టెంట్‌ను పెట్టుకొని వాట్సాప్ గ్రూప్ తయారు చేసి, మంత్రులకు సంబంధించిన రోజువారీ కార్యక్రమాలు, సభలు, సమావేశాల సమాచారం ఆ గ్రూప్‌లో పోస్టు చేస్తున్నారని చెప్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీపీఆర్వో మధుసూదన్ మరణం నేపథ్యంలో మంత్రుల పీఆర్వోలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు సమాచారం. రెండున్నరేండ్ల నుంచి వారు ఏం పని చేస్తున్నారో నివేదికతో రావాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్టు తెలిసింది.
సలహాదారులు రాష్ట్ర ఖజానాకు తీవ్ర ఆర్థికనష్టం కలిగిస్తున్నారని చెప్పిన రేవంత్.. ఇ ప్పుడు అప్పులు తెచ్చి మరీ సలహాదారులకు జీతభత్యాలు ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇంతమంది సలహాదారులను ఎందుకు నియమిస్తున్నారు? వారు ఏం చేస్తున్నారనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఉద్యోగ విరమణ పొందిన అధికారులకు పోస్టులు సృష్టించిమరీ ఎందుకు నియమిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను ఆగమేఘాల పై ఢిల్లీ నుంచి తీసుకొచ్చి బాధ్యతలు అప్పజెప్పడం వెనుక ఎవరి హస్తం ఉన్నదనేది ప్ర శ్నార్థకంగా మారింది. కొందరు సలహాదారులు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా సీఎంను ఒకసారి కూడా కలువలేదట. అలాంటివారు ఏం సలహా ఇచ్చారనే చర్చ జరుగుతున్నది. కేవలం పునరావాస కల్పన కోసమే సలహాదారుల పదవులు కట్టబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.