బెంగళూరు, ఆగస్టు 8: కలిసి జీవించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు నేపాలీ యువతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వేరే యువకులను పెళ్లి చేసుకోలేక.. బెంగళూరులోని బళ్లారి రోడ్డు జక్కూరు సమీపాన ఒక హోటల్లోని చెట్టుకు ఉరేసున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బెంగళూరు యలహంక పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నేపాల్ యువతులు సిర్జనా (22), రీటా (23) ఇద్దరూ బంధువులు. చిన్నప్పటి నుంచే కలిసే పెరిగారు. ఒకేచోట చదువుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, ఒకరికొరు ఇష్టపడ్డారని పోలీసులు తెలిపారు. అయితే వీరి సన్నిహిత సంబంధంపై వారి గ్రామంలో అభ్యంతరాలు వ్యక్తమైనట్లు సమాచారం. వారిని ఎలాగైనా విడదీయాలనే ఉద్దేశంతో కుటుంబసభ్యులు వారిని నెల రోజుల కిందట బెంగళూరుకు తీసుకొచ్చి, ఇద్దరిని వేర్వేరు ప్రాంతాల్లో ఉంచినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. రీటాను ఫ్రేజర్ టౌన్లో, సిర్జనాను జక్కూర్లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ వారిద్దరూ వారానికి మూడు, నాలుగుసార్లు కలుసుకునేవారని పోలీసుల విచారణ తెలిసింది.
వారిని ఎలాగైనా విడగొట్టి, వేర్వేరు పురుషులతో పెళ్లి చేయాలని ఇద్దరు యువతుల కుటుంబసభ్యులు ప్రయత్నించారు. ఈ క్రమంలో తమను సమాజం కలిసి జీవించేందుకు అంగీకరించడం లేదని, మనస్తాపానికి గురై ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇవి ప్రాథమిక దర్యాప్తులో తెలిసిన వివరాలు మాత్రమేనని.. పూర్తి విచారణ తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.