తెలంగాణలో ఇప్పుడు నీడల రాజకీయం నడుస్తున్నది.. పాత కాంగ్రెస్కు పాతరేసి పచ్చ కాంగ్రెస్కు ఊతమివ్వడం!
కుదరని నాడు.. ఉన్న పార్టీని కుమ్ములాటలతో కూల్చిపారేసి, ‘పాత పార్టీ’ జెండాను కొత్తగా భుజానికెత్తుకోవడం!
‘రెండు మూతుల పాము’ రాజకీయమిది!
‘కాండం తొలిచే’ పురుగు కాంగ్రెస్ను తింటున్నది!
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు చివరికి బజారున పడ్డాయి. పరిపాలన గాలికి వదిలి ప్రచ్ఛన్న యుద్ధాల్లో కొట్టుకుంటున్న మంత్రుల మధ్య.. ఇదే అదునుగా ముఖ్యనేత పెట్టిన మంటలు ఆఖరికి ‘అసలు కాంగ్రెస్’ను దహిస్తున్నాయి. మొన్న కొండా సురేఖ!.. నిన్న కోమటిరెడ్డి!!.. నేడు భట్టి విక్రమార్క!!!.. ఒకరి వెనుక ఒకరిని టార్గెట్ చేసి మరీ.. రచ్చకీడుస్తున్నారు. ఉత్తర తెలంగాణకు చెందిన మరో బీసీ మంత్రి రోడ్డున పడకుండా ప్రస్తుతానికి తప్పించుకున్నారు. మంత్రులపై బురదచల్లడాలు, అనుకూల మీడియాతో అవినీతి ఆరోపణలు, అధికారుల వ్యక్తిత్వ హననాలు.. ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నవివే!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనంతరం కాంగ్రెస్ పాతకాపుల మీద ఓ వర్గం మీడియా వ్యూహాత్మకంగా దాడులు చేస్తున్నది. ఇదేదో చెప్పకుండా చేస్తున్న దాడి కాదు! ‘ముఖ్యనేత అనే గౌరవం లేకుండా కొండా సురేఖ కూతురు దారుణంగా దూషించారు. ఒక రాష్ర్టానికి ఒక్కరే ముఖ్యనేత ఉంటారనే వాస్తవాన్ని విస్మరించి మీరంతా ఆడుతున్నారు. ఇక ఆయనకు ఆవేశం కట్టలు తెంచుకున్నది.. ఇక ఒక్కొక్క మంత్రి సంగతి చూస్తారు’ అని అక్టోబర్ చివరి వారంలో యెల్లో మీడియా చిలుక పలుకులు పలికింది. దాంట్లో భాగంగానే ఒక వర్గం మీడియా అసలు కాంగ్రెస్ మంత్రులపై విరుచుకు పడుతున్నదని, వ్యక్తిత్వ హన నానికి పాల్పడుతున్నదని కాంగ్రెస్ శ్రేణుల్లోనే చర్చ నడుస్తున్నది.
ఒకవైపు కుమ్ములాటలు, కీచులాటలతో కాంగ్రెస్ కకావికలమవుతుంటే.. మరోవైపు ఖమ్మం సభలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడిన తీరు కలకలం రేపుతున్నది. ఆయన సభలో టీడీపీ జెండాలు కనిపించడం ఒక ఎత్తయితే.. బీఆర్ఎస్ జెండా గద్దెలను కూల్చాలని, పార్టీని పాతిపెట్టాలని టీడీపీ శ్రేణులను, చంద్రబాబు అభిమానులను కాంగ్రెస్ సీఎం నేరుగా వేడుకోవడం మరో ఎత్తు.
ఎవరు రాయించారో బయటపెడుతా!
ఆంధ్రజ్యోతివి అభూత కల్పనలు. ఈ రాతల విషయంలో రాధాకృష్ణతోనే తేల్చుకుంటా! వెనుక ఎవరుండి రాయించారో త్వరలోనే అన్నీ బయటపెడుతా! ఏ రాజకీయ ఉద్దేశంతో రాశాడో.. ఎవరి ప్రయోజనాల కోసం వండి వార్చాడో వివరాలు వెల్లడిస్తా! 40 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్న. నాది వీక్ క్యారెక్టర్ కాదు. మీ అవసరాల కోసం.. నీచ, నికృష్టపు, దిగజారుడు రాజకీయాల కోసం అల్లే కట్టుకథలు నన్నేం చేయలేవు.
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జనవరి18 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది పీతల పంచాయితీ. ఒకరి కాలుపట్టి ఇంకొకరు గుంజడం,ఒకరి వెనక మరొకరు గోతులు తవ్వుకునే సంసృతి ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నది. కాంగ్రెస్లో ఒకరు ఎకువ కాదు..ఒకరు తకువా కాదు. ఆధిపత్య కుమ్ములాటలో అందరూ అందరే అనే భావన ప్రజల్లో ఉన్నది. అయితే మంత్రుల గొడవల మధ్యలోకి ముఖ్యనేత ఆనుకూల మీడియా దూరడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మీద ఓ మీడియా సంస్థ ప్రసారం చేసిన అనైతిక కథనం వెనుక అన్ని వేళ్లూ ముఖ్యనేత వైపే చూపించాయి. విషయం తెలిసిన రోజున మూడు నిద్ర మాత్రలు మింగినా.. ఆయనకు నిద్రపట్టలేదని కోమటిరెడ్డి సన్నిహితులు చెప్తున్నారు. జరిగిన మోసానికి ఖిన్నుడైన మంత్రి రాజీనామా చేసి ముఖ్యనేతపై గళం విప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదే అంశంపై సదరు మంత్రి భార్య ముఖ్యనేత భార్యకు ఫోన్ చేసి తన భర్తను అనైతిక వ్యక్తిగా చిత్రీకరించారని, ఇక తాము రాజకీయాల్లో ఉండబోమని, రాజీనామా చేసి తమకు ద్రోహం చేసిన వారి సంగతి తేలుస్తామని హెచ్చరించినట్టు సమాచారం.
అనుకూల మీడియాపై తుపాకీ పెట్టి
ఇప్పటికే ‘ఆయన’కు వ్యతిరేకంగా కాంగ్రెస్లో చాలా గ్రూపులున్నాయి.. వారంతా అవకాశం కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్న విషయం ప్రజలకు తెలిసిందే. వీళ్లంతా గతంలోనే ముఖ్యనేత నిర్ణయాలు, వ్యవహారంపై అధిష్ఠానం వద్దకు పంచాయితీకి వెళ్లారు. ఆయన ఏకపక్ష ధోరణితో పాటు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు చేశారు. మరోవైపు ఈ రెండేండ్లలోఅటు పార్టీ మీద, ఇటు ప్రభుత్వం మీద ముఖ్యనేతకు పట్టు రాలేదని ఢిల్లీ బలంగా నమ్ముతున్నది. ఏఐసీసీ ఢిల్లీ దూత కూడా ముఖ్యనేతకు పార్టీపై పట్టు లేదని నివేదికలు ఇచ్చినట్టు సమాచారం.
ఈనేపథ్యంలో ఒకవేళ అధిష్ఠానం బలహీన సమయంలో ముఖ్యనేతను మార్చాల్సి వస్తే.. నెక్ట్స్ ఎవరు? ఈ ప్రశ్నకు మూడు పేర్లు సమాధానంగా వినబడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమైన పదవి కోసం పోటీపడ్డ భట్టి విక్రమార, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు సామాజికవర్గ బలం పరంగా, అసలు కాంగ్రెస్ నేతలుగా ఎకువ అవకాశాలుంటాయి. వారిలో ఎవరో ఒకరికి ముఖ్య పదవి దక్కినా పెద్దగా వ్యతిరేకత ఉండదు. ఈ నేపథ్యంలోనే తన అనుకూల మీడియా భుజాల మీద తుపాకీ పెట్టి అసలు కాంగ్రెస్ మంత్రుల మీద ఎటాక్ చేయాలని ముఖ్యనేత సన్నిహిత వర్గం వ్యూహరచన చేసినట్టుగా ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగానే ఇలాంటి కథనాలు వండి వారుస్తున్నారని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
అప్పుడు మేడారం..ఇప్పుడు బొగ్గు వ్యాపారం
మేడారం అభివృద్ధి పనుల టెండర్లకు సంబంధించి రూ.100 కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనుల విషయంలో మంత్రులు పొంగులేటి, సురేఖ మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. మేడారం జాతర దేవాదాయ శాఖ పరిధిలోనిదని, పైగా తన జిల్లాకు చెందినదని, ఇందులో పొంగులేటి చొరబడి కాంట్రాక్టులు తన అనుచరులకు ఇప్పించుకున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, సీఎంకు సురేఖ ఫిర్యాదు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కణతకు మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ గన్ను గురిపెట్టిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బొగ్గుగని కోసం ఇద్దరు మంత్రులు కోట్లాడుకుంటున్నారని చెప్తూనే.. పరోక్షంగా తమ ముఖ్యనేత నిరాపరాధి అనే సంకేతాలను ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేసింది. కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు దక్కించుకోవడానికి కోమటిరెడ్డి, భట్టి ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. కానీ, ఇందులో ముఖ్యనేతకు ప్రమేయం లేదని స దరు మీడియా నేరుగానే చెప్పిన తీరు కాంగ్రెస్ మంత్రుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నది.
రాజీనామాకు సిద్ధపడిన కోమటిరెడ్డి

కోమటిరెడ్డి, ఆయన కుటుంబీకుల హెచ్చరికల నేపథ్యంలోనే ముఖ్యనేత కొంత ఆందోళనకు గురైనట్టు సమాచారం. అర్ధరాత్రి వేళ ఆయన ఎవరి వద్దకో పోయాడని సోషల్ మీడియా రాసిందని ఇటీవల మీడియా సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఓ హెచ్చరిక విసిరారు. సహజంగా పెద్ద నోరున్న కోమటిరెడ్డితో ఎదురుపడి నెగ్గుకు రావడం కష్టమని, తాను మరింత పంతానికి పోతే నష్టపోతానని కలవరపడిన ముఖ్యనేత సమర్థంగా మరో డైవర్షన్ రాజకీయం చేశారని ప్రచారం జరుగుతున్నది. తన సీటుకు పక్కలో బల్లెంలా ఉన్న భట్టి విక్రమార్కను వ్యూహాత్మకంగానే వెంకటరెడ్డి వివాదంలోకి లాగినట్టు కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ కొనసాగుతున్నది.అప్పటికే ఇద్దరు మంత్రులు లాభదాయకమైన బొగ్గుగని కాంట్రాక్టు కోసం తగవులాడుకోవడం ముఖ్యనేత తనకు అనుకూలంగా మలుచుకున్నట్టు సమాచారం.
వెంటనే తన జేబులోని మరో మీడియా అస్ర్తాన్ని బయటకు తీసి ప్రయోగించినట్టు కాంగ్రెస్ శ్రేణులే చెప్పుకొంటున్నాయి. లాభదాయకమైన వ్యాపారం కోసం ఇద్దరు మంత్రులు తగువు పడుతున్నది అబద్ధం కాదు..కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ప్రసారమైన అనైతిక కథనం అందరికీ తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్యన లొల్లి పెట్టినట్టు సమాచారం. ఇక్కడ ఇంకో తిరకాసు కూడా ఉన్నది. మంత్రుల మధ్యలోకి దూరిన సదరు మీడియా సంస్థ యజమానిని పొరుగు రాష్ట్రం యువరాజు పక్కన పెట్టేశారని సమాచారం. కానీ మన ముఖ్యనేత అక్కున చేర్చుకొని ఫ్యూచర్ సిటీలో 25 ఎకరాల స్థలాన్ని కట్టబెట్టినట్టు సమాచారం. ఈ ఉపకారానికి ప్రత్యుపకారంగానే భక్తి చాటుకున్నారని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు.