హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ పెద్దలకు మున్సిపోల్స్ ఫలితాలపై ముందే బెంగ పట్టుకున్నదా? పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే మరింత దిగజారుతామనే ఫోబియా వెంటాడుతున్నదా? ప్రతిపక్ష బీఆర్ఎస్ మరింత పుంజుకుంటుందనే భయం పట్టుకున్నదా? అంటే.. వారి విచిత్ర విన్యాసాలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఆధిక్యత సాధించేందుకు ఆ పార్టీ చెమటోడుస్తున్నది. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో మరింత వ్యతిరేక ఫలితాలు వస్తాయేమోనన్న ఆందోళన వారిని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నది.
అందుకే ఏం చేసైనా సరే ఈ ఎన్నికల్లో పరువు నిలుపుకొనేందుకు అన్ని అడ్డదారులు తొక్కుతున్నది. అంగ, అర్ధ, అధికార బలాన్ని ప్రయోగిస్తున్నది. మున్సిపల్ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా భావిస్తున్న కాంగ్రెస్.. క్షేత్రస్థాయిలో మందీమార్బలాన్ని మోహరించింది. సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,నేతలంతా కాలికి బలపం కట్టుకున్నట్టుగా గల్లీ గల్లీ తిరుగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొన్నది. ఓవైపు అవినీతి, 30 శాతం కమీషన్లు, అరాచకరాలతో పేట్రేగుతుంటే.. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు, వృద్ధులు కాంగ్రెస్‌పై పీకల్లోతు కోపంతో ఊగిపోతున్నారు. రైతుభరోసా పెట్టుబడి సాయం ఎగ్గొట్టడం, కోతలు, కొర్రీలతో రుణమాఫీ చేయకపోవడం, యూరియా కొరత కారణంగా ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులకు హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వారికి మొండిచెయ్యి చూపింది.
బీఆర్ఎస్ పూర్తిచేసిన నియామకాలకు పత్రాలు జారీచేసి ఆ ఉద్యోగాలన్నీ తామే ఇచ్చినట్టు పోజులు కొట్టింది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని గాలికొదిలేసింది. దీంతో నిరుద్యోగులు సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్ సొమ్మును రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా కాంగ్రెస్ సర్కార్ పింఛన్ల పెంపు ఊసే ఎత్తలేదు. దీంతో తమ పింఛన్లు ఎప్పుడు పెంచుతారంటూ కాంగ్రెస్‌ను నిలదీస్తున్నారు. ఇలా అన్ని వర్గాల్లోనూ కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. కాంగ్రెస్ సర్కార్‌పై ఉన్న ప్రజా వ్యతిరేకత ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా బయటపడింది.
సాధారణంగా ఎప్పుడైన సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీదే హవా కొనసాగుతున్నది. 90-95 శాతం సర్పంచ్ స్థానాలు అధికార పార్టీ మద్దతుదారులే గెలుస్తారు. కానీ ఇక్కడ అధికార కాంగ్రెస్ 60 శాతంతో సరిపెట్టుకొన్నది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజాదరణతో 40 శాతం సర్పంచ్ స్థానాలు గెలుచుకొన్నది. దీంతో ఊహించని ఫలితాలతో కాంగ్రెస్ పెద్దల్లో అప్పడే వణుకు మొదలైంది. ఇవే ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతమైతే పార్టీకి, ప్రభుత్వానికి మరింత గడ్డుకాలం, కౌంట్‌డౌన్ మొదలవుతుందనే ఆందోళన వారిలో నెలకొన్నట్లుగా తెలిసింది.
‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందంగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొని ఓట్లు అడగలేని దుస్థితిలో ఆ పార్టీ ఉన్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎక్కడైనా, ఎప్పుడైనా అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీ విమర్శలు గుప్పిస్తూ ఓట్లు అడుగుతుంది. అదే సమయంలో అధికార పార్టీ తాము ప్రజలకు ఏం మంచి చేశామో చెప్పి ఒప్పించి ఓట్లు అడుగుతుంది. కానీ ఇక్కడ పూర్తి భిన్నంగా ఉన్నది. అధికార కాంగ్రెస్ పార్టీ రెండేండ్ల కాలంలో ప్రజలకు తాము ఏం చేశామో చెప్పకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్పై, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై, మాజీ మంత్రులు కేటీఆర్‌పై, హరీశ్‌రావు టార్గెట్‌గా విమర్శలు చేస్తూ ఓట్లు పొందవచ్చనే కుటిల ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హామీల అమల్లో, పాలనా వైఫల్యాలు చర్చకు రాకుండా ఉండేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపింది.
క్షేత్రస్థాయిలో ప్రజావ్యతిరేకతను పసిగట్టిన కాంగ్రెస్.. గెలుపు కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడ్డదారులు తొక్కుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓట్ల కోసం బరితెగింపు, బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అరాచకాలు సైతం ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నది. కొన్నిచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, నామినేషన్లు విత్‌డ్రా చేసుకొనేలా బెదిరించడం, మాట వినని, దారికి రాని వారిపై విచక్షణారహితంగా దాడులు చేయడం వంటి అరాచకాలకు పాల్పడుతున్నది.
కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేయ డం కలకలం రేపింది. చెన్నూర్ నియోజకవర్గం క్యాతన్‌పల్లి 16వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి బీఆర్ఎస్ నాయకుడు గండమాల కృపానందంను తన నామినేషన్ విత్‌డ్రా చేసుకొనేందుకు మంత్రి అనుచరులు తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. నిన్నటికి నిన్న లాల్‌గడీ మలక్‌పేటలో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ దళిత నాయకుడిపై, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. ఇలా ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ దౌర్జన్యకాండ చేస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.