హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తొలి ప్రాధాన్యతగా పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తిచేస్తూనే, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ను పచ్చగా మార్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టామని బీఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. తాము 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టి పాలమూరు రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నదని నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ హయాంలో పాలమూరు ప్రాజెక్ట్‌పై అధికారులు, పార్టీ నాయకులతో మాట్లాడినం.
క్యాబినెట్లో చర్చించినం. 170 టీఎంసీలు తీసుకోవాలన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం స్ట్ట్రాటజీ. ఏపీ నుంచి వచ్చే వ్యతిరేకత, ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని నికరంగా లెక్కలు తెప్పించినం. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మహబూబ్‌నగర్‌లో మైనర్ ఇరిగేషన్ పాత చెరువులెన్ని? ఉన్నవెన్ని? మాయమైనవెన్ని? వాటి సామర్థ్యమెంత? అని లెక్కలు తీసి.. కేంద్రానికి సమర్పించినం. ఇవి 45 టీఎంసీలుగా తేలినయ్. ఆ తర్వాత పాలమూరు – రంగారెడ్డికి 90.81 టీఎంసీలు కేటాయించినం. ట్రిబ్యునల్ వచ్చాక మనకొచ్చే వాటాతో 170 టీఎంసీలు తీసుకుందామన్న ఆలోచనతో ఆరోజు 90.81 టీఎంసీలు కేటాయించినం. బచావత్ ట్రిబ్యునల్‌లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది.
రాజకీయాల్లో గెలుపోటములు.. ప్రభుత్వాలు మారుడు సహజం. ఎంత తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా పాత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌లను కొనసాగించాలె. ప్రాజెక్టులంటే రాష్ట్ర ప్రయోజనాలు. ప్రజలను బతికించేవి. ప్రజలకు నీళ్లిచ్చేవి. కాంగ్రెస్ వచ్చాక పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పట్టించుకోలే. రెండేండ్లు గడిచిపోయినయ్. ఈ ప్రాజెక్టును ఎందుకు ఆపిండ్రో? ఏ కారణంతో పక్కనపెట్టిండ్రో? ఇంత నిష్క్రియాపరత్వమేందో? ఇంత దారుణమేందో తెలుస్తలేదు.
-బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
మేమున్నన్ని రోజులు పాలమూరు డీపీఆర్ వాపసు రాలే. డీపీఆర్ వాపస్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం భూమి. ఆకాశాన్ని ఏకం చెయ్యాలె. లొల్లి, హడావుడి చెయ్యాలె. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీస్కపోవాలె. వడ్లు కొనకపోతేనే మేం ఢిల్లీలో ధర్నాచేసినం. మంత్రులు, ఎమ్మెల్యేలం ఢిల్లీకి పోయి కేంద్రం మెడలు వంచినం. 20 లక్షల టన్నులు కొంటామన్న ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినం. ఎఫ్‌సీఐతో వడ్లు కొనిపిచ్చినం. మూడు జిల్లాలకు సంబంధించిన డీపీఆర్ వాపస్ పంపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుయ్యిలేదు.. కుటుక్కులేదు. ఎవరికీ చెప్పలే.. బయటపెట్టలే. కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపించినా కిమ్మనలే.
‘ఆంధ్రావాళ్లు గోదావరి నుంచి కృష్ణా డెల్టాలకు నీళ్లు తెచ్చుకుంటున్నరు. దీంట్లో భాగంగానే 80 టీఎంసీలు తీసుకున్నరు. కాబట్టి పై రాష్ర్టాలకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నీళ్లిస్తామని డీపీఆర్‌లో స్పష్టంగా చెప్పిండ్రు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు ఈ నీళ్లు ఇస్తారు. అందులో తెలంగాణకు 45, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీలివ్వాలి. కర్ణాటక, మహారాష్ట్ర ఈ మేరకు నీళ్లు వాడుకుంటున్నయ్. ట్రిబ్యునల్ కేటాయించిన 45 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్లో నష్టపోయిన 45 టీఎంసీలు కలిసి 90.81 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డిని ప్రతిపాదించినం. భవిష్యత్తు అవసరాల మేరకు ప్రాజెక్టు చేపట్టినం. రూ.35 వేల కోట్లు కేటాయించి నం. 27 వేల కోట్లు ఖర్చుచేసి, 88-90% పనులు పూర్తిచేసినం.
ఆంధ్రాతో పంచాయితీ ఉంటదని వీలైనంత తొందరగా నీళ్లు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 145 మెగావాట్ల పంప్‌లు పెట్టినం. ఇలాంటి పంప్‌లు దేశంలో ఎక్కడా లేవు. ఈ పంప్‌లను బీహెచ్ఈఎల్ ప్రత్యేకంగా తయారుచేసిచ్చింది. స్వయంగా నేను ఒక పంప్ స్టార్ట్ చేయగానే కాల్వల్లో నీళ్లు పారినయి. మిగిలిన పంప్లన్నీ ఇన్స్టాల్ చేసిం డ్రు. ఆ తర్వాత అనుమతులపై అనేక మెలికలు పెట్టిండ్రు. భూ సేకరణలో ఇబ్బందులు తెచ్చిండ్రు. అయినా 27 వేల ఎకరాలు సమీకరించినం. గ్రీన్ ట్రిబ్యునల్‌కు పోతే స్టేను రద్దుచేయించినం. అడ్డంకులు తెస్తే అధిగమించినం’ అని కేసీఆర్ గుర్తుచేశారు.
రాజకీయాల్లో గెలుపోటములు.. ప్రభుత్వాలు మారుడు సహజం. ఎంత తెలివి తక్కువ, దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా పాత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగించాలె. ప్రాజెక్టులంటే రాష్ట్ర ప్రయోజనాలు. కాంగ్రెస్ వచ్చాక పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి తీయలే. రెండేండ్లు గడిచినయ్. ఈ ప్రాజెక్టును ఎందుకు ఆపిండ్రో? ఏ కారణంతో పక్కనపెట్టిండ్రో? ఇంత నిష్క్రియాపర్వమేందో? ఇంత దారుణమేందో? తెలియడం లేదు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదో తమాషా. మొదటి నుంచీ తెలంగాణకు బీజేపీ శని. ప్రతిదాన్ని వ్యతిరేకించడమే దాని పని. చంద్రబాబు ఎన్డీఏలో చేరాక ఆయన మాటలు పట్టుకుని అడ్డంగా వ్యతిరేకించడమే బీజేపీ వ్యవహారంగా మారింది. మేమున్నన్ని రోజులు కేంద్రంపై కొట్లాడినం. అనేక పోరాటాలు చేసినం. పాలమూరుకు మొత్తం తొమ్మిది, పది అనుమతులు అవసరమైతే ఆరు అనుమతులు సాధించినం. అతి ముఖ్యమైన పర్యావరణ అనుమతులు పొందినం. మిగిలిన అనుమతులన్నీ లాంఛనమే. అతి ముఖ్యమైన అనుమతులొచ్చాక కేంద్రం మొన్న కొత్త మెలికపెట్టింది. బీజేపీకి చంద్రబాబు, నితీశ్ అవసరమున్నది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ఎంతకైనా దిగజారుతది. చంద్రబాబు మాటలు పట్టుకుని పాలమూరు ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను వాపస్ పంపింది.
దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే కొన్ని సంక్రమణలుంటయ్. నీళ్లు, వాటాలు సంక్రమిస్తయ్. ఇది ఎస్సార్సీ యాక్ట్. దేశంలో మొదట్లో 14 రాష్ర్టాలుంటే, కొత్తగా 15 రాష్ర్టాలు ఏర్పాటైనయ్. ఓ పద్ధతి ప్రకారం హైకోర్టు వనరుల పంపిణీ విషయంలో లెక్కున్నది. ఏడాది లోపు అయితే రెండు రాష్ర్టాలు పరిష్కరించుకోవాలి. ఏడాది దాటితే కేంద్ర ప్రభుత్వం ఆర్బిట్రేషన్ చేయాలి. లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ఏడాది వరకు చూసి మేం సెక్షన్-3 అమలు చేయాలని, కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని కేంద్రానికి అప్పీల్ చేసినా, ఖాతరు చేయలేదు. మేం సుప్రీంకోర్టుకు వెళ్తే కేంద్రాన్ని చీవాట్లు పెట్టిం ది. ఆ తర్వాత గజేంద్రసింగ్ షెకావత్ స్పం దించి సెక్షన్-3 వేస్తాం.. కేసు విత్‌డ్రా చేసుకోవాలని కోరితే విత్‌డ్రా చేసుకున్నం. విత్‌డ్రా చేసుకున్నట్టు లేఖరాస్తే సెక్షన్ -3 వేసిండ్రు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసిండ్రు. నీళ్ల పంపిణీపై వాదనలు నడుస్తున్నయ్.
గతంలో చట్ట ప్రకారం 75% డిపెండబిలిటీని బట్టి నీళ్లను కేటాయించేవారు. కానీ 65% డిపెండబిలిటీ బట్టి నీళ్లు కేటాయిద్దామని బ్రిజేష్‌కుమార్ నిబంధనలు పెట్టారు. దీని ద్వారా కృష్ణాలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకు వచ్చిన ఒరిజినల్ అలాట్మెంట్ 811 టీఎంసీలే. బ్రిజేష్ ట్రిబ్యునల్ తర్వాత ఇది 1,005 టీఎంసీలకు పెరిగింది. 10% కలపడంతో 195 టీఎంసీలు పెరిగినయ్. పెరిగిన వాటా మనకు వస్తది. ఒరిజినల్‌గా పెట్టిన 90 టీఎంసీలు, అదనంగా వచ్చేవి కలిపితే 160-170 టీఎంసీలు తీసుకోవచ్చు. పాలమూరును సుభిక్షం చేద్దామనుకున్నం. గతంలోని ఆరున్నర లక్షల ఎకరాల ఆయకట్టు, పాలమూరు ఎత్తిపోతలతో 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు మొత్తం కలిపితే 13.5 లక్షల ఆయకట్టుకు నీళ్లందించాలనుకున్నం.
కృషించి, కునారిల్లి ఆరవై ఏండ్లు ఏడ్చి గోసపడ్డ పాలమూరుకు ఎత్తిపోతల పథకంతో ఉపశమనం కల్పించాలనుకున్నం. పాలమూరు జిల్లాలో నియోజకవర్గానికి లక్ష ఎకరాలు పారాలన్నది మా సంకల్పం. గ్రావిటీ ద్వారా కొంత.. లిఫ్ట్‌ల ద్వారా మరికొంత నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున పారాలన్నది మా లక్ష్యం. తెలంగాణ వచ్చాక నాలుగైదేండ్లకు పాలమూరు అద్భుతంగా తయారైంది. చెక్‌డ్యామ్‌లతో భూగర్భజలాలు పెరుగుతయ్. ఉచిత విద్యుత్తుతో సాగు బాగుపడ్డది. నేనోసారి పోయినప్పుడు చూసి అబ్బురపడ్డ. అంతకు ముందు పాడువడ్డ ఇండ్లు ఉండేవి. తర్వాత కల్లాలు, వరికోత మిషన్లు, గ్రామాల్లో వచ్చిన మార్పును నా కండ్లతో స్వయంగా చూసిన. అనుకున్నట్టు 15 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయనుకొని సంతోషపడ్డ’ అని కేసీఆర్ వివరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదో తమాషా. మొదటి నుంచీ తెలంగాణకు బీజేపీ శని. మేమున్నన్ని రోజులు కేంద్రంపై కొట్లాడినం. ప్రాజెక్టుకు మొత్తం తొమ్మిది, పది అనుమతులు అవసరమైతే. ఆరు సాధించినం. అతి ముఖ్యమైన పర్యావరణ అనుమతులు పొందినం. అతి ముఖ్యమైన అనుమతులొచ్చాక కేంద్రం మొన్న కొత్త మెలికపెట్టింది. కేంద్రానికి చంద్రబాబు అవసరం ఉన్నది కాబట్టి ఆయన మాటలు పట్టుకుని పాలమూరు డీపీఆర్‌ను వాపస్ పంపింది.
-బీఆర్ఎస్ అధినేత కేసీఆర్