వైభవోపేత తెలంగాణ ఘనచరితకు ప్రతీకగా ఉన్న ‘తెలంగాణ తల్లి’ రూపాన్ని మార్చేసింది రేవంత్ ప్రభుత్వం. బదులుగా ‘కాంగ్రెస్ తల్లి’ని బలవంతంగా ప్రజలపై రుద్దింది. అసలు రూపాన్ని అవమానపరిచింది. పోనీ ఆ కాంగ్రెస్ తల్లినైనా ప్రభుత్వం గౌరవించిందా అంటే అదీ లేదు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కోసం తీసుకొచ్చిన విగ్రహాన్ని, అవసరం తీరాక.. ఇలా నిర్దాక్షిణ్యంగా పారేసింది. గౌరవించలేని వాళ్లకు ఏ తల్లి అయినా ఒక్కటే! అధికారం తలకెక్కితే అనునిత్యం రాష్ర్టానికి అవమానమే! కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ పరిస్థితికి అద్దం పడుతున్నదీ చిత్రం.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): అవి ప్రస్తుతం బర్లు, గొర్లు గడ్డి మేసే భూములు.. అక్కడ ‘ఫోర్త్ సిటీ’ (Fourth City) అంటూ గాలిమేడలు కడుతున్న కాంగ్రెస్ సర్కారు.. గ్లోబల్ సమ్మిట్ (Global Summit) పేరిట గారడీ చేసింది. ఎక్కడికక్కడ విప్పుకొని పోయే డేరాలు వేసి తెలంగాణ సొమ్ము వంద కోట్లను ‘ఫోర్త్ సిటీ’ మట్టిలో కలిపింది. గ్యారెంటీలకు పైసల్లేవంటూనే.. రైతులు, చివరికి రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలను కూడా గాలికి వదిలి ప్రజల డబ్బును ‘మాయా.. సభ’కు ఖర్చుచేసింది. రేవంత్ సర్కారు ఇంతగా బిల్డప్ ఇస్తూ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణాన్ని పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 1953లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలులో సొంత భవనాలు లేక బురద నేలల్లో ఎలాగైతే గుడారాలు వేసుకొని ఆఫీసులు నడిపారో ఇప్పుడు అచ్చంగా తెలంగాణ ప్రభుత్వం కూడా పశువులు మేసే ప్రాంతంలో డేరాలు వేసి కథ నడిపింది.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ కోసం అత్యాధునిక వసతులున్న హెచ్ఐసీసీ (హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్) లాంటివి వదిలి ఏమాత్రం సౌకర్యాలు లేని.. అసలు ‘ఫోర్త్ సిటీ’ ఎక్కడున్నదో కూడా తెలియని ప్రదేశంలో డేరాలు వేసి ఇంద్రజాలం చేసింది. సమ్మిట్ కోసం వేసిన అతిపెద్ద ‘సినిమా సెట్’ను ఎక్కడికక్కడ కూలీలు విప్పుకొని పోవడం కనిపించింది. అతిథులకు ఆహ్లాదం పంచేందుకు వేసిన గడ్డి, నాటిన మొక్కలు, చివరికి కుర్చీలు కూడా టెంపరరీవి కావడం గమనార్హం. భారీ షెడ్లు, ఫ్లెక్సీలు, బోర్డులు, కటౌట్లు వేసి హంగామా చేసింది.

కూలీలు అన్నింటినీ ప్యాకప్ చేస్తుంటే కింద పడేసి వదిలేసి పోయిన గాంధీజీ అతిపెద్ద చిత్రపటం కనిపించింది.‘కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని కించపరిచినట్టుగా వ్యవహరిస్తే కేసులు పెడతాం’ అని గతంలో హెచ్చరించిన ఇదే కాంగ్రెస్ ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ విగ్రహాన్ని అవమానించింది. కాంగ్రెస్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సమ్మిట్ ప్రాంగణంలోనే అనాథగా కిందపడేసి విమర్శలకు తావిచ్చింది.

హైదరాబాద్ నగరంలో రూ.పది కోట్లు వెచ్చిస్తే అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే అవకాశమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం లేని ఫోర్త్ సిటీని వేదికగా చేసుకొని వందల కోట్లు దుబారా చేసింది. ఒక ముంబై బేస్డ్ కంపెనీకి లబ్ధి కలిగించేందుకు ‘సమ్మిట్ సెట్టింగ్’ బాధ్యతలు అప్పగించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న హెచ్ఐసీసీ సౌకర్యాలను వదిలేసి రోడ్లు సరిగాలేని చోట వందల కోట్లు ఖర్చు చేసి డేరాల్లో సదస్సు నిర్వహించింది.
కేవలం ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ ప్రమోషన్ కోసం వంద కోట్లు వెచ్చించి డేరాల్లో సదస్సు నిర్వహించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ‘ఫోర్త్ సిటీలో చూపడానికి ఏమీ లేదు.. ఎలాంటి స్ట్రక్చర్ లేదు.. అయినా ఏపీ రాజధాని అమరావతి గ్రాఫిక్స్‌లా ఇక్కడా గ్లో బల్ సమ్మిట్ కోసం గ్రాఫిక్స్‌ను చూపించారు. అంతా టెంపరరీ తప్ప రియాలిటీ లేదు. అస లు ఫోర్త్ సిటీ ఎక్కడుందని వెతికినా అడ్రస్ దొరకని ప్రదేశంలో సమ్మిట్ పెట్టి ప్రజల సొమ్మును వృథా చేశారు’ అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సమ్మిట్‌కు వచ్చేవారికి ఆహ్లాదం పంచేందుకు నాటిన మొక్కలు, వేసిన గడ్డి కూడా టెంపరరీ.. చివరికి కుర్చీలు కూడా ఢిల్లీ నుంచి తెప్పించారట. మన హైదరాబాద్‌లో కుర్చీలు కూడా దిక్కులేవా? లైట్లు, డేరా బట్టలు కూడా ప్రభుత్వానివి కావు.. అన్నీ రెడీమేడ్.. అంతా ప్యాకప్’ అని విశ్లేషకులు, మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు. ఓవైపు గ్యారెంటీలకు డబ్బులు లేవంటూనే..వందల కోట్లు దుబారా చేయడం ఏమిటని రాజకీయవేత్తలు మండిపడుతున్నారు.
గ్లోబల్ సమ్మిట్‌లో కాంగ్రెస్ రూపొందించి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూ డా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ప్రాంగణంలో కిందపడేసి ఉన్న కాంగ్రెస్ తల్లి విగ్రహం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయి నెటిజన్లు సర్కారు తీరు ఎండగడితే చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. విగ్రహాన్ని తరలించే సమయంలో మాత్రమే కింద పడిందంటూ పోలీసులు వివరణ కూడా ఇవ్వడం గమనార్హం. కాగా కూలీలు అక్కడి టెంట్ సామాన్లను తరలించుకుపోతున్నప్పుడు నేలపై పడి ఉన్న అతిపెద్ద గాంధీ చిత్రపటం చినిగిపోయి కనిపించింది.
హైదరాబాద్ నగరం ఆరేడు దశాబ్దాల క్రితమే ఒక మహానగరానికి కావాల్సిన అన్ని హంగులూ ఉన్న నగరమనేది నిర్వివాదాంశం. అందుకు సకల సాక్ష్యాలూ ఉన్నాయి. 1953లో ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలు దుస్థితి ఇప్పటి తరంలో చాలా మందికి తెలియదు. ఎలాంటి మౌలిక వసతులు లేని చిన్న టౌన్లో ముఖ్య ఆఫీసులను గుడారాల్లోనే నడిపారు. అప్పటి రోజుల్లో కర్నూలు ‘డేరానగర్’గా గుర్తింపు పొందింది. అప్పటికే అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం కర్నూలులో భవంతులు, వసతులు సమకూర్చుకునే పరిస్థితిలో లేక చివరికి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌తో తెలంగాణను బలవంతంగా విలీనం చేసుకున్నది. అప్పటికే సర్వ హంగులతో సిద్ధంగా ఉన్న హైదరాబాద్‌ను చేజిక్కించుకున్నది. ఇప్పుడు హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ కోసం అత్యాధునిక వసతులున్నా వాటిని వదిలేసి ఏమాత్రం సౌకర్యాలు లేని.. ఇప్పటికీ రూపం అంటూ లేని ‘ఫోర్త్ సిటీ’ పేరిట కాంగ్రెస్ సర్కారు ‘రియల్’ మాయాజాలం చేసింది.

గ్లోబల్ సమ్మిట్ ముగిశాక ఆ ప్రాంతం ఎలా ఉన్నదని పరిశీలిస్తే చిరిగిన డేరాలతో కళావిహీనంగా మారింది. కోట్ల రూపాయల ప్రజాధనంతో చేసిన ఏర్పాట్లన్నీ నేలపాలయ్యాయి. ఒకవైపు గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కాకపోగా వంద కోట్లు బూడిదలో పోసిన సర్కారు తీరుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. హెచ్ఐసీసీలాంటి వేదికలపై ఈ సదస్సు నిర్వహించడం వల్ల హైదరాబాద్ అభివృద్ధిని సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు చూపించే అవకాశం ఉండేది. కానీ కించిత్తు సౌకర్యాల్లేని ఫార్మాసిటీ భూముల్లో తాత్కాలిక డేరాలు వేసి సమ్మిట్ నిర్వహించి రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చినట్టయిందని నెటిజన్లు మండిపడుతున్నారు.