హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు శాఖలో సమ్మె చేస్తున్న ఆర్జిజన్ కార్మికులపై కాంగ్రెస్ సర్కార్ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు విద్యుత్తు ఉద్యోగులకు అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తర్వాత వారిని దగా చేస్తున్నదని ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హామీలు నెరవేర్చాలని సమ్మెకు దిగిన 20 వేల మంది ఆర్జిజన్ కార్మికులను డిస్మిస్ చేస్తామని బెదిరించడం దుర్మార్గమని ఖండించారు.
భూపాలపల్లి నియోజకవర్గంలోని థర్మల్ పవర్‌స్టేషన్ వద్ద సమ్మెకు దిగిన కార్మికులకు కనీసం టెంట్ వేసుకొనే అవకాశం ఇవ్వకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికుల పక్షాన చిలుకపలుకులు పలికిన భట్టి విక్రమార్క.. నేడు తన మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడమే లేదని విమర్శించారు. కార్మికులతో చర్చలు జరిపి డిమాండ్లు నెరవేర్చాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్తు శాఖలోని పనిచేస్తున్న కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. మండుటెండల్లో, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే వారి శ్రమను గుర్తించి రూ.6 వేలు ఉన్న వేతనాన్ని రూ.40 వేల వరకు పెంచారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకుండా వేధిస్తున్నదని దుయ్యబట్టారు. ఉద్యోగులను గ్రేడ్ల వారీగా గుర్తించాలని, ఏపీఎస్ఈబీ నిబంధనలు వర్తింపజేయాలని అడిగిన పాపానికి వారిపై కత్తిగడుతున్నదని నిప్పులు చెరిగారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అద్భుతాలు చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ పెద్దలు.. అధికారంలోకి వచ్చాక హామీలను మరచి దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులను వేధించడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పా? ఇందిరమ్మ రాజ్యమంటే ప్రశ్నించే వారి గొంతు నొక్కడమేనా? అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా విద్యుత్తు కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే వారికి అండగా బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు.