కరీంనగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఇప్పటికే అన్నదాతలకు శాపంలా మారగా, ఇప్పుడు మరో పిడుగు పడింది. కొనుగోలు కేంద్రాల పరిధిలో నేటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు రైతుల పాలిట శరాఘాతంగా మారే ప్రమాదమున్నది. వీటిపై నిర్వాహకులు సైతం విముఖత వ్యక్తం చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. నిబంధనలు అమలు చేయాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం కొనుగోళ్లకు ఒక్కో కేంద్రంలో దాదాపు రెండు నెలల సమయం పడుతుందని నిర్వాహకులు స్పష్టంచేస్తున్నారు.
ఇవి అన్నదాతలకు ఇబ్బందులు తెచ్చిపెడుతాయని అధికారులు కూడా చెప్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయాలని, కేటాయించిన మిల్లులకే పంపాలని కేంద్రం ఆదేశించిం ది. కొనుగోలు సమయంలోనే రైతుల డాటా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. నాణ్యతాప్రమాణాల ప్రకారం ఉన్న ధాన్యాన్నే కొనుగోలు చేయాలి. ధాన్యం రవాణా చేసే లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లకు తప్పనిసరిగా జీపీఎస్ ట్రా కింగ్ సిస్టం ఉండాలి. ఆన్లైన్లో ట్రక్ షీట్ జనరేట్ చేసిన తర్వాత సదరు రైతు ధాన్యం ఏ మిల్లుకు పంపాలో చూపిస్తుందని, ట్రక్ షీట్లో ఏ మిల్లు పేరు వస్తుందో ఆ మిల్లుకే ధాన్యం పం పాల్సి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నిబంధనలను కొన్నిచోట్ల ఇప్పటికే అమలు చేస్తుండగా నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కచ్చితంగా అమలు చేయాలనే ఆదేశాలు వచ్చాయని ఓ కీలక అధికారి తెలిపారు.
సాధారణంగా రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చినప్పుడు గతంలో తూకం వేసిన తర్వాత మాన్యువల్ పద్ధతిలో ట్రక్‌షీట్ పూర్తి చేసేవారు. ఆ తర్వాత ఆన్లైన్లో ఎంట్రీ చేసేవారు. దీని వల్ల రైతులకు ఇబ్బందులు ఉండేవికాదు. కానీ, ప్రస్తుతం కచ్చితంగా ఆన్లైన్ ట్రక్ షీట్లో వివరాలను అప్పటికప్పుడే అప్లోడ్ చేయాలనే నిబంధన వచ్చింది. చాలా చోట్ల ఇంటర్నెట్ సిగ్నల్ రాక సాంకేతిక సమస్యలు ఏర్పడుతాయని నిర్వాహకులు చెప్తున్నారు. సర్వర్‌లో చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని వాపోతున్నారు. ఆన్లైన్ ట్రక్ షీట్ జనరేట్ కావడంలో ఆలస్యం జరిగితే రైతు అప్పటిదాకా అక్కడే వేచి చూడాల్సి వస్తుంది.
గతంలో ఆయా కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని అంచనావేసి అందుకు అనుగుణంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే మిల్లులను ముందుగా అలాట్ చేసేవారు. ధాన్యం కొనుగోలు చేయగానే కేంద్రం నిర్వాహకులు.. అక్కడ ఉన్న సౌలభ్యాన్ని బట్టి ఆయా మిల్లులకు ధాన్యం పంపేవారు. ఇప్పుడు ఆన్లైన్లోనే అలాట్మెంట్ అయిన మిల్లుకే ధాన్యం పంపాలి. అది ఎంతదూరంలో ఉండేది తెలియదు. దీనివల్ల క్షేత్రస్థాయి లో సమస్యలు ఉత్పన్నమవుతాయని నిర్వాహకులు వాపోతున్నారు. సహజంగా కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం రవాణా చేయడానికి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తుంది.
మెజారిటీ ప్రాంతాల్లో దాదాపు 70 నుంచి 80 శాతం మంది రైతులే తూకం వేసిన తర్వాత వారి ట్రాక్టర్లలో కేటాయించిన మిల్లులకు ధాన్యం తీసుకెళ్లి అప్పగిస్తారు. ట్రాన్స్పోర్ట్ కాం ట్రాక్టర్ ట్రాక్టర్ రవాణాకు అయ్యే ఖర్చులు ఇస్తారు. దీని వల్ల ట్రాన్స్పోర్ట్కు ఇబ్బందులుండేవి కాదు. తూకం వేసిన వెంటనే కొనుగోలు కేంద్రాల వద్ద స్టాక్ ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యేది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో చూస్తే ట్రాక్టర్లకు దాదాపుగా జీపీఎస్ సిస్టమ్ లేదు. కానీ, సర్కార్ పెట్టిన తాజా నిబంధనలతో ధాన్యం రవాణాకు వినియోగించే ప్రతి ట్రాక్టర్‌కూ కచ్చితంగా జీపీఎస్ ఉండి తీరాల్సిందే. రైతులు తమ ట్రాక్టర్లను రవాణాకు వినియోగించకపోతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే కుప్పలు తెప్పలుగా నిలిచిపోనుంది.
20 రోజుల క్రితమే వరి కోసి, ధాన్యం కుప్ప పోసినా చాలా చోట్ల కొనుగోలు కేంద్రా లు ప్రారంభం కాక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంతోపాటు రామంచలో వారం క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్టు కొబ్బరి కాయలు కొట్టారు. కానీ, నేటికీ కొనుగోలు ప్రారంభం కాలేదు. ధాన్యం కుప్పలు పోసి రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఓవైపు వర్ష సూచన, మరోవైపు ధాన్యం కొనుగోలు కాక కూలీలకు, హార్వెస్టర్లకు డబ్బులు చెల్లించలేక రైతులు ఆందోళన చెందుతున్నారు.
కమలాపూర్, ఏప్రిల్ 27 : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆన్లైన్ ట్రక్‌షీట్, జీపీఎస్ విధానం ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కమలాపూర్-హనుమకొండ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై వారం రోజులు దాటినా కొనుగోలు కేంద్రం నుంచి వంద బస్తాలు కూడా రైస్‌మిల్లులకు పోలేదని చెప్పారు. ఆన్లైన్ ట్రక్‌షీట్ పెట్టడంతో లోడ్ పూర్తయిన తర్వాతనే రైస్‌మిల్లు కేటాయింపు జరుగుతుందని, జీపీఎస్ అమలైన వాహనం మాత్రమే ధాన్యం తరలింపునకు వాడాలనే నిబంధన ఉండటంతో ట్రాక్టర్లు పెట్టడంలేదని తెలిపారు.
40 కిలోల బస్తాకు రైస్‌మిల్లర్లు 3 కిలోల తరుగు తీస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఆన్లైన్ ట్రక్‌షీట్, వాహనాలకు జీపీఎస్ విధానం ఎత్తేసి పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ చైర్పర్సన్ ఝాన్సీరాణి అదనపు కలెక్టర్ రవి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో సాయంత్రంలోపు సెంటర్లను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

ఈ ఫొటోలో కనిపిసున్నది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం. ఇక్కడ వారం క్రితమే కొనుగోలు చేస్తామంటూ కొబ్బరికాయ కొట్టి సెంటర్‌ను ప్రారంభించారు. కానీ ఇప్పటికీ కాంటా పెట్టలేదు. క్వింటాలు ధాన్యం కూడా కొనలేదు.

ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రంలో దుస్థితి. మార్కెట్‌యార్డులో స్థలం లేక రైతులు బయటనే వడ్లు ఆరబోశారు. కొనుగోళ్లు ఇంకా మొదలు కాకపోవడంతో మొగులు ముఖం చూస్తూ అన్నదాతలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ మాత్రం వర్షం పడినా మొత్తం ధాన్యం ఎందుకూ పనికి రాకుండా పోతుందని భయపడుతున్నారు.
కొంటం కొంటమంటే వడ్లు తెచ్చి నం. వారమైంది. అగో ఇగో అనుడే తప్ప కొన్నోళ్లు లేరు. మొగులుజూస్తే భయమైతాంది. తడిస్తే గిట్ట మళ్ల వారం పది రోజులు ఎండబోయాల్సి వస్తది. నేనేగాదు మా రామంచలో అనేక మంది రైతులం బాధపడుతున్నం.
– కూతురు వెంకటమ్మ, రైతు, నర్సింహులపల్లె, రామంచ (చిగురుమామిడి మండలం)
నేను పదెకరాలు వరి సాగు చేసిన. ఆరెకరాలు కోసి కొ నుగోలు కేంద్రానికి తెచ్చి వారం రోజు లు దాటింది. రేపు మాపు అనుకుంట నిర్వాహకులు దాటవేస్తున్నారు. ధాన్యం కుప్పలపై రూ.4 వేలు పెట్టి టార్పాలిన్ కవర్లు కొని కప్పిన. ఎండకు కవర్లు తూట్లు పడి చినిగిపోతున్నయ్. ఇంకా నాలుగు ఎకరాల వడ్లను రోడ్లపై పోసి ఎదురు చూడాల్సి వస్తున్నది. రోజంతా ఎండల పడిగాపులు కాస్తున్నం. మబ్బులు పడుతున్నయ్. మొగులు దిక్కుచూస్తే భయమైతాంది.
– రాయిరెడ్డి శేఖర్ రెడ్డి, రైతు, రామంచ (చిగురుమామిడి మండలం)
కేంద్రాల నుంచి మిల్లులకు ట్రాన్స్‌పోర్టు చేసే వాహనాలకు జీపీఎస్ విధానం ఏర్పాటు చేయాలనే నిబంధనను వెంటనే ఎత్తివేయాలి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద వివిధ కారణాల వల్ల కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త నిబంధనలు పెట్టడం వల్ల రైతులకు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. కేంద్రాల నిర్వాహకులకు సమస్యలు వస్తాయి. వర్షాలు రాకముందే కొనుగోళ్ల పక్రియ వేగవంతమైతే ప్రభుత్వానికి, రైతులకు, మిల్లర్లకు అందరికీ మంచిది.
– సుధాకర్‌రావు, రైస్‌మిల్లు అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు