హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 14వేల మంది అక్రెడిటెడ్ జర్నలిస్టుల గుర్తింపును కాంగ్రెస్ సర్కారు రద్దు చేయనున్నది. రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా జర్నలిస్టులకు ఉన్న గుర్తింపు కార్డులను కూడా రద్దు చేయాలని నిర్ణయించడం విమర్శలకు తావిస్తున్నది. కేసీఆర్ హయాంలో సుమారు 23వేల మంది జర్నలిస్టులను గుర్తించి కార్డులు ఇచ్చి వారి గౌరవాన్ని పెంచారు.
కానీ రేవంత్ సర్కా రు కొత్తగా ఎవ్వరికీ గుర్తింపు కార్డులు ఇవ్వకపోగా, ఇప్పటికే ఉన్న 14వేల అక్రెడిటేషన్లను పునరుద్ధరించడం లేదని స్పష్టంచేస్తూ జీవో 252 విడుదల చేసింది. కేసీఆర్ హయాంలో అక్రెడిటేషన్ కార్డుల జీవో 239ను రాష్ట్ర ప్రభు త్వం రద్దు చేసింది. ఫలితంగా జర్నలిస్టులు ఆరోగ్యబీమా, ఆర్టీసీ బస్సుల్లో రాయితీ సౌకర్యాలను కోల్పోతారు.
పత్రికలు, న్యూస్చానెళ్లలోని డెస్కుల్లో పనిచేసే సబ్‌ఎడిటర్లకు మొదటికే మోసం వచ్చేలా రేవంత్ సర్కారు జీవో 252 రూపొందించింది. దీని ప్రకారం డెస్కు జర్నలిస్టులకు అసలు అక్రెడిటేషన్ కార్డులే ఇవ్వరు. వారికి మీడియాకార్డు పేరుతో కొత్త కార్డు సృష్టించారు. మీడియా కార్డు అక్రిడేషన్ కార్డుకు సమానం కాదు. దీన్ని ప్రభుత్వం గుర్తింపు కార్డుగా మాత్రమే పరిగణిస్తుంది. అక్రెడిటేషన్ కార్డు ఉంటే దేశంలోని ఏ మూలకు వెళ్లినా గుర్తింపు ఉంటుంది.
దేశంలోని ఏ ప్ర భుత్వరంగ సంస్థ అయి నా.. అక్రెడిటేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇప్పుడు కొత్త జీవోతో డెస్క్ జర్నలిస్టులు అస్తిత్వాన్ని కో ల్పోనున్నారు. అక్రెడిటేషన్ కార్డుల్లోనూ సర్కార్ భారీగా కోత పెడుతున్నది. ఇప్పుడు ఒక మండలంలో ఒకే రిపోర్టర్‌కు కార్డు ఇస్తామని చెప్తున్నారు. కొన్ని మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒక పత్రిక నుంచి ఒకరికి మించి జ ర్నలిస్టులు పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటా యి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పత్రికపై ప్రభుత్వ నిర్ణయం ప్రభావం ఉండనున్నది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్ కార్డు లు ఇస్తామని నాటి ఉద్యమసారథి కేసీఆర్ ప్రకటించారు. చెప్పినట్టుగానే రాష్ట్రం ఏ ర్పడగానే సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి సహా అనుభవజ్ఞులతో కమిటీ వేశారు. కమిటీ రూపొందించిన పాలసీ మేరకు ప్రభు త్వం రాష్ట్రస్థాయి లో సమాచార, పౌరసంబంధాలశాఖ ఆ ధ్వర్యంలో అక్రెడిటేషన్ కమిటీ ఏర్పాటు చేసి 23వేల మందికిపైగా జర్నలిస్టులను పారదర్శకంగా గుర్తించి కార్డులు జారీ చేసింది.
కానీ తాజాగా రేవంత్ సర్కా రు తీసుకొచ్చిన జీవో 252లో అక్రెడిటేషన్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటన్నది స్పష్టం కావడంలేదు. పాలసీని లేకుం డా, మీడియా ప్రతినిధులతో సంప్రదించ కుండా ఏకపక్షంగా జీవో ఇచ్చేసింది. ప్రభుత్వానికి అనుకూలంగా మీడియా అకాడమీ ఉండడంపై వి మర్శలు వినిపిస్తున్నాయి. జర్నలిస్టుల పక్షాన కొట్లాడాల్సిన మీడియా అకాడమీ స్పందించడంలేదు.
కేసీఆర్ సర్కారు జర్నలిస్టుల సంక్షేమానికి అక్రెడిటేషన్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోలేదు. తెలంగాణ మీడియా అకాడమీని ఏర్పాటు చేసి సుమారు 50 కోట్లకు పైగా నిధులను ఇచ్చారు. వాటితో వేలాది మంది జర్నలిస్టులను ఆదుకున్నారు. కరోనా సమయంలో వ్యాధి బారినపడ్డ జర్నలిస్టుల దవాఖాన ఖర్చులను అకాడమీనే భరించింది. అంతే కాదు.. దురదృష్టవశాత్తు జర్నలిస్టు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం ఇవ్వడంతోపాటు ప్రతినెలా రూ.3వేల పెన్షన్ వచ్చేలా చేసింది. చదువుకునే పిల్లలుంటే విద్య కోసం కూడా ప్రతినెలా రూ.1,000 అదనంగా ఇచ్చేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్న డూ ఈ తరహా పథకాన్ని జర్నలిస్టుల కోసం తీసుకురాలేదు. మహిళా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల్లో 33శాతం కేటాయించారు. ఈమేరకు జీవోలోనే నిబంధన చేర్చారు.
జర్నలిస్టులకు రెండేండ్లలో కాంగ్రెస్ చేసింది గుండు సున్నా. కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహకాలను కూడా కొనసాగించకుండా మీడియా అకాడమీని నిర్జీవం చేసి.. జర్నలిస్టులను మోసం చేస్తున్నదనే వాదనలున్నాయి. వెల్ఫేర్ ఫండ్‌కు 100 కోట్లు ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదు. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ ఇస్తామన్న హామీని అటకెక్కించింది. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వంలో ఎవరూ మాట్లాడింది లేదు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు కేసీఆర్ సర్కారు రూ.లక్ష ఇస్తే.. కాంగ్రెస్ వస్తే 2లక్షలు ఇస్తామని చెప్పింది. అదీ ఇవ్వడంలేదు. ఇక జర్నలిస్టులకు ఆరోగ్య పథకం కింద ప్రత్యేకంగా కార్డులు ఇస్తామని చెప్పి, రెండేం డ్లు గడిచినా హెల్త్ కార్డుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.