యాచారం, ఏప్రిల్ 23: ‘ఫ్యూచర్ సిటీ పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది.. అసలు ఫార్మా భూములను ఫోర్త్‌సిటీకి వాడటం చట్ట వ్యతిరేకం.. ఆ భూములతో రేవంత్‌రెడ్డి సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది..’ అని జాతీయ సంఘాల ప్రతినిధులు, నిజనిర్ధారణ కమిటీ బృందం సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని యాచారం మండలంతోపాటు ఇతర ప్రాంతాల్లోని ఫార్మా భూముల్లో రైతుల పరిస్థితులపై బుధవారం ఈ బృందం అధ్యయనం చేసింది.
ఈ బృందంలో పీపుల్స్ జేఏసీ తెలంగాణ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్, జాయింట్ కన్వీనర్ రవి కన్నెగంటి, విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ వనమాల, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ప్రతినిధి మీరా సంఘమిత్ర, హైకోర్టు ప్రధాన న్యాయవాది సాజీద్, తెలంగాణ పీపుల్స్ జేఏసీ ప్రతినిధి ఉస్మాన్, మానవహక్కుల వేదిక ప్రతినిధి నరసింహ, చైతన్య మహిళా సంఘం ప్రతినిధులు జ్యోతి, శ్రీదేవి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్, న్యాయవాదులు అశోక్, కొండల్‌రెడ్డి, రవీంద్ర తదితరులు ఫార్మా వ్యతిరేక పోరాట కమితి సమన్వయకర్త కవుల సరస్వతి ఆధ్వర్యంలో పర్యటించారు.
అనంతరం పలువురు బృంద సభ్యులు మాట్లాడారు. పచ్చని పొలాల్లో ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ అంటూ ఏవేవో పేర్లు పెట్టి, మరేవో కంపెనీలు ఏర్పాటుచేసి రైతులను రోడ్డున పడేయాలని చూడటం అన్యాయమని ధ్వజమెత్తారు. రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకొని పరిశ్రమలు పెడితే అది అభివృద్ధి ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. ఫార్మాసిటీ రద్దు విషయంలో అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయగా, స్థానిక కాంగ్రెస్ నేతలు మాత్రం ఫార్మాసిటీ రద్దయిందని రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
‘కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలేమిటి? ప్రస్తుతం చేస్తున్నదేమిటి?’ అని పర్యావరణవేత్తలు సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 2013 చట్టం అమలు చేస్తామని, ఫార్మాసిటీని రద్దు చేస్తామని, రైతుల భూముల్ని వారికే తిరిగిస్తామన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు గద్దెనెక్కి పదవులు రాగానే మాటమార్చడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకపక్క రాజ్యాంగాన్ని రక్షిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అంటుంటే.. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ పోలీస్ బలగాలతో భూములకు ఫెన్సింగ్ వేయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రైతులను బెదిరించి భూములను లాక్కునే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. పోలీస్ బలగాలతో బలవంతంగా సర్వే చేయడం, ఫెన్సింగ్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. పరిశ్రమల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. పచ్చని పంటపొలాల్లో విషపూరిత పరిశ్రమలను పెట్టొద్దని డిమాండ్ చేశారు.
రైతులందరూ సంఘటితంగా ఉండి తెలంగాణలో వ్యవసాయ భూములను కాపాడుకునేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతుల పక్షాన పాదయాద్రలు, ధర్నాలు, ఆందోళనలు చేసిన కాంగ్రెస్ నాయకులు నేడు ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. ఫ్యూచర్ సిటీ ప్రతిపాదనను విరమించుకొని భూసేకరణను ఆపాలని, వెంటనే రైతుల భూములను ఆన్లైన్లో ఎక్కించాలని డిమాండ్ చేశారు. ఫార్మా రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని పర్యావరణవేత్తలు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక పోరాట సమితి నాయకులు కానమోని గణేశ్, సందీప్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు.