హైదరాబాద్, జూలై11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నీటిపారుదల పితామహుడిగా పేరొందిన సుప్రసిద్ధ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ఇంజినీర్లు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాం కాలంలో చీఫ్ ఇంజినీర్‌గా నవాబ్ అలీ విశేషమైన సేవలను అందించారు. నిజాంసాగర్, పోచారం, వైరా రిజర్వాయర్, పాలేరు, ఎగువ మానేరు డ్యామ్, రాయపల్లి, డిండి, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, మూసీ, నాగార్జునసాగర్, పూర్ణ, ఘనపూర్ ప్రాజెక్టుతో పాటు ఇంజినీరింగ్ అద్భుతమైన కోయిల్‌సాగర్ ప్రాజెక్టును కూడా అలీ నవాజ్ జంగ్ బహదూర్ రూపకల్పన చేశారు. అంతేకాదు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల, హాస్టల్ భవనాలు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, పబ్లిక్ గార్డెన్స్ జూబ్లీహజ్, అబ్దూల్గంజ్లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, మహబూబియా బాలికల పాఠశాల, నాందేడ్ సివిల్ హాస్పిటల్, యునాని వైద్యశాల, ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ తదితర భవనాల నిర్మాణం ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి.
హైదరాబాద్ సంస్థానం ప్రగతిలో నవాబ్ అలీ కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నవాబ్ అలీ పుట్టిన రోజైన జూలై11ను తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఏటా ఇర్రంమంజిల్‌లోని జలసౌధలో వేడుకలను నిర్వహించింది. కానీ ఈ ఏడాది కాంగ్రెస్ సర్కారు వేడుకల నిర్వహణను విస్మరించింది. దీనిపై రాష్ట్ర ఇంజినీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి వేడుకలను నిర్వహించిన ప్రభుత్వం.. తెలంగాణ ఇంజినీర్ జయంతిని నిర్వహించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.