కాంగ్రెస్ రాకతో రైతులకు ఎరువుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. యూరియా కోసం సొసైటీల ఎదుట బారులు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, జగిత్యాల జిల్లా కథలాపూర్, ములుగు జిల్లా బయ్యారం మండలాల్లో యూరియా కోసం రైతులు అవస్థలు పడ్డారు.
నీరు లేక ఎండుతున్న నారు
ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు నారును కాపాడుకోవడం కోసం నానా కష్టాలు పడుతున్నారు. పోచారం ప్రాజెక్టు నుంచి నీటిని సర్కారు విడుదల చేయకపోవడంతో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో ప్రధాన కాలువ కిందనే ట్యాంకర్లతో నీటిని తెచ్చి తుకం తడుపుతున్నారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని రైతులదీ ఇలాంటి పరిస్థితే. కాళేశ్వరం నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు బిందెలతో నీళ్లు తెచ్చి పొలాలు తడుపుకొంటున్నారు.
టమాట మంటలు
దళారీకే ధర దక్కుతుండగా, టమాట పండించిన రైతుకు మాత్రం నష్టమే మిగులుతున్నది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాబ్‌పేటలో శుక్రవారం ఐదెకరాల టమాట పంటను రైతులు దహనం చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే కనీసం కిరాయిలు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు నల్ల హరిగౌడ్, నల్ల రవిగౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్కో క్రేట్ బాక్స్ మీద కేవలం 10 రూపాయలే మిగులుతున్నాయని వారు వాపోయారు.