హనుమకొండ, నమస్తే తెలంగాణ ప్రతినిధి : చారిత్రక వరంగల్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా ఉండే భద్రకాళి చెరువును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది. వందల ఏండ్లుగా పర్యాటకులను ఆకర్షించిన ఈ చెరువు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక లేకుండా చేస్తున్న పనులతో అస్తవ్యస్తంగా మారింది. హడావుడిగా చేపట్టిన చెరువు సుందరీకరణ ప్రాజెక్టు అయోమయంలో పడింది. కాంగ్రెస్ సర్కారు తీరుతో భద్రకాళి చెరువు సుందరీకరణ పనులు మొదలు కాకుండానే నిలిచిపోయాయి.
ఏడాది క్రితం మొదలైన ఈ ప్రాజెక్టు.. ఎంతకీ ముందుకు సాగడంలేదు. 382 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు పూడికతీత పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్‌లో నిర్ణయించింది. చెరువులోని మత్స్య సంపదపై ఆధారపడిన మత్స్యకారుల కుటుంబాల ఆవేదనను పట్టించుకోకుండా హడావుడిగా చెరువులోని నీటిని మొత్తం ఖాళీ చేయించింది.

మానకొండూర్ రూరల్, డిసెంబర్ 25 : పీహెచ్సీలో 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్య సిబ్బంది విధులకు డుమ్మా కొట్టారు. వచ్చిన రోగులను చూసేందుకు ఎవరూ లేకపోవడంతో గ్రామస్థులు దవాఖానకు తాళం వేసి నిరసనకు దిగారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (లక్ష్మీపూర్)లో గురువా రం చికిత్స కోసం కొందరు రోగులు రాగా, డాక్టర్‌తోపాటు సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. దీంతో సర్పంచ్ ఎడ్ల సత్యనారాయణ, ఉప సర్పంచ్ రాపాక ప్రవీణ్‌కు సమాచారం ఇ వ్వగా, వారు అక్కడికి చేరుకుని వార్డు సభ్యులు, గ్రామస్థులతో కలిసి దవాఖానకు తాళం వేసి నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకొని స్థానికులు, వైద్య సిబ్బందితో మాట్లాడారు. విషయం డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రాజగోపాల్‌కు దృష్టికి వెళ్లగా వెంటనే లీవ్‌లో ఉన్న డాక్టర్ సాయిప్రసాద్‌ను దవాఖానకు పంపించారు. డాక్టర్ అక్కడికి చేరుకుని స్థానికులతో మాట్లాడి, దవాఖాన తాళం తెరిపించి రోగులకు చికిత్స అందించారు.

నెలరోజుల కిందట కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు తీసుకెళ్లడం లేదంటూ రైతులు రోడ్డెక్కారు. గురువారం వనపర్తి జిల్లా అంకూరు సమీపంలో ప్రధాన రహదారిపై కంప వేసి నిరసన తెలిపారు. దాదాపు 5 లారీలకు చెందిన ధాన్యం తరలించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ధాన్యం విక్రయించినప్పటికీ చాలామందికి డబ్బులు అందలేదని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదని ఆవేదన చెందారు. వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్‌రెడ్డి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
-వనపర్తి

పాల బిల్లుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిలోని పాలశీతలీకరణ కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలో బస్వాపురం, గంగసానిపల్లి, దత్తాయిపల్లి, ముత్తిరెడ్డిగూడెం, హుస్నాబాద్ రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నార్ముల్ డైరెక్టర్ కస్తూరి పాండు మాట్లాడుతూ.. పాడి రైతుల పెండింగ్ బిల్లులను 48 గంటల్లో చెల్లించాలని, లేనిపక్షంలో వెయ్యిమంది పాడి రైతులతో యాదాద్రి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
-భువనగిరి అర్బన్