హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను గాలికి వదిలేసింది. ‘ఆరోగ్యశ్రీ’ సేవలు అందిస్తున్న నెట్వర్క్ దవాఖానలకు ప్రభుత్వం రూ.1,400 కోట్ల బకాయిలను చెల్లించకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆ సేవలు నిలిచిపోయాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వైద్యసేవల మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ)కు సైతం ప్రభుత్వం భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. అందులో భాగంగా ప్రతి నెలా టీజీఎంఎస్ఐడీసీకి రూ.50 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఏప్రిల్ నుంచి ఆ డబ్బులు కూడా చెల్లించడం లేదు. దీంతో మందులు, సర్జికల్స్, మెడికల్ ఎక్విప్మెంట్, హాస్పిటల్స్‌కు సంబంధించిన బకాయిలు కలిపి టీజీఎంఎస్ఐడీసీకి మొత్తం రూ.1,019 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.
పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, లేకుంటే ఔషధ సరఫరాలను ఆపేస్తామని మెడికల్ ఏజెన్సీలు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. వైద్యం కోసం సర్కారు దవాఖానలకు వెళ్లే పేదలకు ఎలాంటి సమస్యలు తలెత్తకూడదన్న మానవతా దృక్పథంతో ఇన్ని రోజులు సరఫరాలను కొనసాగించామని బకాయిలను చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు. మందుల స్టాక్ మరో 3 నెలల్లో అయిపోనుందని తెలుస్తున్నది. ఆ తర్వాత పరికరాలు, మందుల కొరతతో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో బడ్జెట్ పెట్టి మరీ టీజీఎంఎస్ఐడీసీకి ప్రతి నెలా నిధులు కేటాయించడంతోపాటు ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని సమర్థంగా అమలు చేశారు. కానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు బాసటగా నిలుస్తున్న ‘ఆరోగ్యశ్రీ’ పథకానికి మొండిచెయ్యి చూపుతున్నది. నెట్వర్క్ దవాఖానలకు బకాయిలు చెల్లించకుండా ‘ఆరోగ్యశ్రీ’ సేవలకు గండి కొట్టింది. దీంతో రేవంత్‌రెడ్డి సర్కారు తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.