హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. వైద్యుల పాలిట శాపంగా మారింది. కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల సేవలను వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. వారి కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచింగ్ దవాఖానల్లో 1,200 మంది వైద్యులు కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ ర్యాంక్‌తో పని చేస్తున్నారు. 2023, 2024, 2025 బ్యాచ్‌లకు చెందిన వైద్యులు, ఆయా దవాఖానల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధుల నిర్వహిస్తున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతినెలా రూ.1.25 లక్షల నుంచి రూ.1.90 లక్షల వరకు వేతనాలు ఇస్తున్నది. అయితే, తమ కాంట్రాక్ట్ గడువును పొడిగించడం లేదని ఆందోళనలో ఉన్న వీరిపై జిల్లాల్లోని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్ల నోటీసులు మరింత గందరగోళాన్ని పెంచాయి.
ఈ నెల 31 మధ్యాహ్నంతో కాంట్రాక్ట్ వైద్యుల సేవలు టెర్మినేట్ అవుతాయని కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల నోటీసులు జారీ చేయడం దుమారం రేపింది. మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్యకళాశాల సైతం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వైద్యుల కాంట్రాక్ట్ పొడిగింపు ఈ నెల 31తో ముగుస్తున్నట్టు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం నుంచి కంటిన్యూయేషన్ ఆర్డర్ వస్తేనే సేవలు వినియోగించుకుంటామని స్పష్టం చేసింది. తమ కాంట్రాక్ట్ విషయమై సూపరింటెండెంట్లను సంప్రదిస్తే.. కంటిన్యూ ఆర్డర్లు వస్తేనే కొనసాగిస్తామని చెబుతున్నట్టు వైద్యులు వాపోతున్నారు.