Harsha Bhogle | వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) వైస్ కెప్టెనా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే. సీనియర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తక్కువ అనుభవం ఉన్న జూనియర్‌కు ఈ బాధ్యతలు అప్పగించడం సబబేనా!. దీనికి కారణం తెలియడం లేదని, ఈ ఆలోచన సరైనది కాదని సెలెక్టర్ల నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. 12 ఇన్నింగ్స్‌లలో 17.2 సగటుతో 207 పరుగులు చేసిన సూర్యవంశీకి ఈ బాధ్యతలు ఇవ్వడం సరికాదని అన్నారు. అతి ప్రతి అసాధారణమైనదే, కానీ అతడు నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని, ఇలాంటి బాధ్యతలకు ప్రస్తుతానికి అర్హుడు కాదని వెల్లడించారు.
దులీప్ (Dilip) ట్రోఫీ 2026-27 సీజన్‌కు ఈస్ట్ జోన్ టీమ్‌ను ప్రకటించారు. దీనికి ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా, చిచ్చర పిడుగు, బుడ్డోడు అయిన సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. దీంతో సూర్యవంశీ వైస్ కెప్టెన్సీపై చాలామంది తమకు నచ్చినట్లు స్పందిస్తున్నారు. హర్ష భోగ్లే కూడా పై విధంగా తన ‘X’ ఖాతాలో స్పందించారు.
దులీప్ ట్రోఫీ దేశవాళీ ప్రీమియర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నమెంట్లలో ఒకటి. ఇది రంజీ ట్రోఫీకి, టెస్ట్ టీమ్‌కు వారధిగా పనిచేస్తుంది. దేశ వ్యాప్తంగా వివిధ జోన్లు పాల్గొనే ఈ ట్రోఫీ ద్వారా టెస్ట్ క్రికెట్‌కు సరైన నైపుణ్యం గల క్రికెటర్లను ఎంపిక చేస్తారు. అలాంటి టోర్నీలోని టీమ్‌లకు నాయకత్వ బాధ్యతలకు సరైనవారిని చూసి సెలెక్టర్లు ఎంపిక చేస్తారు.
వైభవ్ సూర్యవంశీ 12 ఏండ్ల వయస్సులో రంజీ ట్రోఫీలో బీహార్ తరఫున అరంగేట్రం చేసి, అత్యంత పిన్నవయసు భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అదేవిధంగా ఆస్ట్రేలియాతో అండర్-19 టెస్ట్ అరంగేట్ర మ్యాచ్‌లో 58 బంతుల్లో సెంచరీ చేశాడు. దీంతో అండర్-19 టెస్టుల్లో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన భారతీయ క్రికెటర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. అండర్-19 వరల్డ్ కప్-2026ను గెలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించాడు.