‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుకు 45 టీఎంసీల తగ్గింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన జీవో ప్రకారమేనంటూ కొన్నాళ్లుగా ప్రచారం చేసిన సర్కార్ ఇప్పుడు నాలుక మడతేసింది. ట్రిబ్యునల్ విచారణ, కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలోనే నిర్ణయం తీసుకుంటున్నట్టు బుకాయిస్తున్నది. కానీ ఇది పచ్చి అబద్ధం.
న్యాయవివాదాల్లో ఉన్న అనేక ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన చరిత్ర కేంద్ర సంస్థలకు ఉన్నది. పలు ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ షరతులకు కట్టుబడి ఉండాలని చెప్తూ కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఇందుకు పొరుగున ఏపీ చేపట్టిన నల్లమలసాగర్ తాజా ఉదాహరణ.
మరి అనుభవజ్ఞుడైన ఆదిత్యానాథ్‌దాస్ ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పలేదా? ఇదే తరహాలో పాలమూరు ప్రాజెక్టుకు కూడా అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోరలేదు? కనీసం ఒక్క లేఖనైనా ఎందుకు రాయలేదు?.. ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు సుస్పష్టం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏపీ సర్కారుతో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగానే 45 టీఎంసీలకు కుదించింది.
హైదరాబాద్, జనవరి1 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో శ్రీకారం చుట్టింది. పోలవరం డైవర్షన్ ద్వారా అందుబాటులోకి వచ్చే 45టీఎంసీలను, మైనర్ ఇరిగేషన్ కింద ట్రిబ్యునల్ కేటాయించిన 89 టీఎంసీల్లో వినియోగించకుండా ఉన్న మరో 45 టీంఎసీలను మొత్తం కలిపి 90టీఎంసీల నికర జలాలను పీఆర్ఎల్ఐఎస్కు కేటాయించింది. ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంటూ జీవో 246ను జారీ చేసింది.
ఆ ప్రతిపాదనలతో డీపీఆర్‌ను సమర్పించడమేగాక, పలు అనుమతులను సాధించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియ నిలిచిపోయింది. 2024డిసెంబర్లో ఏకంగా డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపింది. ప్రభుత్వం తాజాగా పీఆర్ఎల్ఐఎస్కు 90టీఎంసీలకు బదులుగా కేవలం 45టీఎంసీలకే అనుమతులను అడుగుతూ కేంద్రానికి లేఖ రాసింది. మొత్తంగా ప్రాజెక్టు జలాల్లో 45టీఎంసీలను కోత విధించింది. నీటివాటాను ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? అని ప్రశ్నిస్తే రోజుకో మాట చెప్తున్నది. తాజాగా న్యాయవివాదాన్ని సాకుగా చూపుతున్నది. పోలవరం డైవర్షన్ వాటాపై ట్రిబ్యునల్‌లో విచారణ కొనసాగుతున్నదని, ఈ నేపథ్యంలో తొలిదశగా మైనర్ ఇరిగేషన్వాటా 45 టీఎంసీలకు అనుమతివ్వాలని కోరినట్టు బుకాయిస్తున్నది. ఇది ప్రభుత్వం చెప్తున్న కుంటిసాకు అని సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు.

River Map
ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఎలా ఇచ్చారు?
ట్రిబ్యునల్‌లో కొనసాగుతున్న విచారణను సాకుగా చూపుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్రం అనుమతులను తిరస్కరిస్తున్నట్టు ప్రభుత్వం చెప్తున్నది. ఒకవేళ అదే నిజమైతే ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి రాకముందే, న్యాయ వివాదం కొనసాగుతుండగానే కర్నాటక, మహారాష్ట్ర చేపట్టిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు గతంలో కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. అప్పర్‌భద్ర, అప్పర్ కృష్ణ స్టేజీ 3 (ఆల్మట్టి), అప్పర్తుంగతోపాటు, మహారాష్ట్రకు చెందిన పదుల సంఖ్యలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. అప్పర్‌భద్ర, అప్పర్‌తుంగ ప్రాజెక్టులది మరీ దారుణం. ఆ ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలంటూ కర్ణాటక రాష్ట్రం బచావత్ ట్రిబ్యునల్-1 ఎదుట ప్రతిపాదించింది. అయితే కృష్ణాబేసిన్ తీవ్ర నీటి లోటు ఉన్న బేసిన్ అని, కృష్ణాకు తుంగభద్ర బేసిన్ నుంచే నిరంతరాయంగా నీరు రావాల్సి ఉందని, తుంగభద్రపై ప్రాజెక్టులను నిర్మిస్తే ఆ బేసిన్ నుంచి కృష్ణాకు నీటి రాక తగ్గిపోతుందని, ఫలితంగా దిగువనున్న ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. అప్పర్‌భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు ట్రిబ్యునల్-1 ఎలాంటి నీటిని కేటాయింపులు చేయలేదు. ట్రిబ్యునల్ కానీ, దాని అనుమతితో ఏర్పాటయిన అథారిటీ కానీ తుంగభద్ర సబ్ బేసిన్లో మొత్తం నీటి లభ్యతపై అధ్యయనం చేసి అంచనా వేసిన తర్వాతే నీటిని కేటాయించాలని నిర్దేశించింది.
బచావత్ ట్రిబ్యునల్-1 మార్గదర్శకాల మేరకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్-2 ఈ మేరకు కే 8 సబ్బేసిన్లోని నీటి లభ్యతను అంచనా వేసి, 65శాతం డిపెండబులిటీ కింద అప్పర్‌భద్రకు 9, అప్పర్ తుంగ11 టీఎంసీలను కేటాయించింది. అయితే ఆ ప్రాజెక్టులకు నీటిని కేటాయించడంపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకాగా, ఇప్పటికీ దాని మీద విచారణ కొనసాగుతున్నది. ట్రిబ్యునల్-2 అవార్డు సైతం అమల్లోకి రాలేదు. అయినా ట్రిబ్యునల్-1 అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు టీఏసీ అనుమతులను కేంద్రం మంజూరు చేసింది. అక్కడితో ఆగకుండా ఏకంగా జాతీయహోదానే ప్రకటించింది. ఇలా న్యాయవివాదంలో ఉండగానే అనేక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. కానీ పాలమూరు-రంగారెడ్డికి మాత్రం ససేమిరా అంటున్నది.
బేసిన్ అవతలి ప్రాజెక్టులకు కూడా..
కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్-1 అవార్డు గడువు ముగిసిపోవడం, ఆపై అవార్డులో నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు కృష్ణా జలాల పంపిణీ కోసం 2004 ఏప్రిల్‌లోనే ట్రిబ్యునల్-2 ఏర్పాటయింది. జస్టిస్ బ్రిజేష్‌కుమార్ చైర్మన్‌గా ట్రిబ్యునల్ విచారణను చేపట్టింది. కానీ 2005లో ఉమ్మడి ఏపీ సర్కారు చేపట్టిన, అదీ బేసిన్ అవతలికి ప్రాజెక్టులకు సైతం కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞంలో భాగంగా అనేక ప్రాజెక్టులను చేపట్టారు. కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్‌కు జలాలను మళ్లించే హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్), గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్), వెలిగొండ, మల్యాల, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ విస్తరణ పనులను చేపట్టారు.
ఆయా ప్రాజెక్టులపై బేసిన్‌లోని కర్ణాటక, మహారాష్ట్ర సర్కార్లు ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశాయి. నీటి కేటాయింపులు తేలకుండా, విచారణ కొనసాగుతున్న తరుణంలో ఎలా ఇస్తారని నిలదీశాయి. అయినా ప్రాజెక్టులను నిర్మించుకున్నా ట్రిబ్యునల్ అవార్డుకు కట్టుబడి ఉండాలని షరతు విధిస్తూ ఆయా ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులను మంజూరు చేసింది. ఇలా కేంద్రం అప్పుడప్పుడు షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేస్తున్నది. ఆ అవకాశం ఉన్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్రం అనుతులివ్వకుండా నాన్చుతున్నది. అదీగాక పీఆర్ఎల్ఎస్ఐ ప్రాజెక్టు పూర్తిగా కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టు. అత్యంత కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించే ఇన్ బేసిన్ ప్రాజెక్టు. ఏ ప్రమాణాలను తీసుకున్న కృష్ణా జలాల కేటాయింపులో తొలి ప్రాధాన్యత దక్కే ప్రాజెక్టు. అయినా కేంద్రం అనుమతులు ఇవ్వకుండా, కుంటిసాకులు చూపుతున్నది. అవే మాటలను రేవంత్‌రెడ్డి సర్కారు వల్లెవేస్తున్నది.
ఆదిత్యనాథ్‌దాస్ ఎందుకు చెప్పలేదు
రేవంత్‌రెడ్డి తాజాగా మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ అపార అనుభవజ్ఞుడని కితాబిచ్చారు. ప్రభుత్వ సలహాదారుగా ఆయన నియామకాన్ని తప్పుబట్టడాన్ని ఖండించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు సుదీర్ఘకాలంగా పనిచేశారని వివరించారు. ఆయన పనిచేసిన కాలంలోనే అనేక ప్రాజెక్టులకు కేంద్రం షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేసినట్టుగా చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే, సరైన మార్గంలో ఒత్తిడి తెస్తే షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేస్తుందని అనుభవజ్ఞుడికి తెలిసినా ఎందుకు చెప్పలేదు? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అదే తరహాలో అనుమతులను సాధించేందుకు ఎందుకు కృషి చేయలేదని నిలదీస్తున్నారు.
నిలదీయని కాంగ్రెస్ సర్కారు
కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నా, కుంటిసాకులు చెప్తూ అనుమతులను నిరాకరిస్తున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు నిలదీసిన పాపాన పోలేదు. ప్రాధాన్యత ప్రాజెక్టు అని మాటల్లో చెప్తూ, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదనేది బహిరంగ రహస్యం. వాస్తవంగా అధికారంలోకి వచ్చిన కొత్తలో 2024 జనవరి4న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆర్భాటంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రిని కలిశారు. పాలమూరు రంగారెడ్డికి నిధులు సాయం చేయాలని కోరారు. అంతే.. మొత్తం అనుమతులు, నిధులు వచ్చినంతగా ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. మళ్లీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుపై దృష్టిసారించిన దాఖలాల్లేవు. అదే నెలలో జనవరి 29వ తేదీనే కేంద్రం తెలంగాణ సర్కారుకు స్పష్టమైన జవాబు చెప్పింది.
ట్రిబ్యునల్ వివాదం నేపథ్యంలో అనుమతులివ్వడం కుదరదని, మరేవిధంగానైనా ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టంగా తేల్చిచెప్పింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని బయటపెట్టలేదు. అనుమతుల సాధనకు కృషి చేయలేదు. ప్రాజెక్టుకు అనుమతులెలా ఇవ్వబోరంటూ కేంద్రాన్ని నిలదీయలేదు. ఒక్క లేఖ కూడా రాయలేదు. తెలంగాణ ప్రభుత్వ వ్యవహార తీరుతోనే ప్రాజెక్టు డీపీఆర్‌ను సైతం కేంద్రం 2024డిసెంబర్లోనే వెనక్కి పంపింది. కానీ ఇప్పటివరకు ఈ విషయంపైనా కేంద్రాన్ని ప్రశ్నించలేదు. పల్లెత్తుమాట అనలేదు. కానీ కేంద్రం చెప్పిన న్యాయవివాదాన్నే కుంటిసాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నీటికోటాను 45టీఎంసీలకు కోత పెట్టింది. పొరుగున చంద్రబాబుతో చేసుకున్న చీకిటి ఒప్పందంలో భాగంగానే రేవంత్ సర్కార్ కోటా కుదింపు నిర్ణయం తీసుకున్నదని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు.
చనాకా కొరటా అనుమతులు సాధించిన కేసీఆర్
కేంద్రం అనేక కుంటిసాకులు పెట్టినా కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా, ఒప్పించి, మెప్పించి అనేక ప్రాజెక్టులకు అనుమతులను సాధించింది. ఇందుకు చనాకా కొరటా ప్రాజెక్టు (లోయర్ పెన్‌గంగ) నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. పెన్‌గంగా నదిపై మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా ఘటాంజీ తాలుకాలోని తడనవాలి గ్రామం వద్ద 42.67 టీఎంసీల సామర్థ్యంతో లోయర్ పెన్‌గంగ డ్యామ్ నిర్మాణం చేపట్టాలి. దాని నుంచి వచ్చే కుడి కాలువ ద్వారా మహారాష్ట్ర, ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు సాగు నీరందించాల్సి ఉంటుంది.
దశాబ్దాలుగా ఆ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత మాజీ సీఎం కేసీఆర్ పెన్‌గంగపై ప్రతిపాదించిన పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ చనాకా కొరటా బరాజ్ నుంచి నీటిని వినియోగించుకునేందుకు మహారాష్ట్రను ఒప్పించారు. ఒప్పందం చేసుకున్నారు. ఉమ్మడి పాలకులు నాలుగుదశాబ్దాలుగా పూర్తిచేయలేని కలను సీఎం కేసీఆర్ ఆరేళ్లలో సాకారం చేశారు. అయితే చనాకా కొరటా బరాజ్ ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో ఉమ్మడిగానే పర్యావరణ అనుమతులు తీసుకోవాలని కేంద్రం షరతులు విధిస్తూ వచ్చింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం బరాజ్ నిర్మాణం పూర్తి చేసినా, అటువైపు మహారాష్ట్ర మాత్రం ఒప్పందంలో భాగంగా తన పోర్షన్‌కు సంబంధించిన పనులకు కనీసం పరిపాలన అనుమతులనూ మంజూరు చేయలేదు.
అదీగాక 0.5 హెక్టార్ల అటవీ భూమికి అనుమతులనూ తీసుకోలేదు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులకు అది అడ్డంకిగా మారింది. దీంతో మహారాష్ట్రతో సంబంధం లేకుండా తెలంగాణ చేపట్టిన పనులకు పర్యావరణ అనుమతులివ్వాలని కేంద్రంపై నాటి సీఎం కేసీఆర్ ఒత్తిడి తెచ్చారు. కేసీఆర్ మార్గదర్శకాల మేరకు ఇంజినీర్లు దాదాపు రెండేళ్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ చుట్టూ ప్రదక్షణలు చేశారు. మహారాష్ట్రతో సంబంధం లేకుండా వేర్వేరుగా అనుమతులు ఇవ్వవచ్చని కేంద్రాన్ని ఒప్పించారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించారు. ఆ తరువాత టీఏసీ కూడా సాధించారు. కానీ అలాంటి స్ఫూర్తి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నేడు కాంగ్రెస్ సర్కారు చూపించడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు.
సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు!
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మంత్రి ఉత్తమ్ మాటలతోనే స్పష్టమవుతున్నది ఉత్తమ్ మాటలు మాత్రమే చెప్పుతుండు .. పాలమూరు ప్రాజెక్టు పర్యటనకు వచ్చి వెళ్లిన తర్వాత కూడా ఉన్న కొద్ది పనులు పూర్తి కాలేదు. అంతేకాదు నాలుగు బాహుబలి మోటర్లు కృష్ణానీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నా.. మంత్రి కృష్ణానీటిని చూసి మాత్రమే వెళ్లారు. పవర్ ప్రజెంటేషన్‌లో సైతం మోటర్లు సిద్ధంగా ఉన్నా మొదటి రిజర్వాయర్‌లోకి నీళ్లను ఎందుకు ఎత్తిపోయలేదో సామాధానం చెప్పి ఉంటే బాగుండేది. పాలమూరు బిడ్డ సీఎంగా ఉన్నాడని ఉమ్మడి జిల్లా ప్రజలు సంబురపడితే ఆచరణలో మాత్రం ప్రాజెక్టును పనులు పూర్తి చేయకుండా అడ్డుపడుతున్నాడు. పాలమూరుపై ప్రేమ ఉంటే ఒట్టి మాటలు కట్టిపెట్టి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి.
-బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే
ఉత్తమ్‌వి ఉత్త మాటలే
కేసీఆర్ హయాంలో 90 శాతం పనులు పూర్తయ్యాయి. తీర్నాంపల్లి గ్రామ సమీపంలో కాంగ్రెస్ మిగిలిన 15 లక్షల క్యూబిక్ మీటర్ల పెండింగ్ పనులు పూర్తి చేసి ఉంటే వట్టెం రిజర్వాయర్‌కు నీళ్లు వచ్చేవి. ఇక్కడికి నీళ్లు రాకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ వైఫల్యం.. చేతకానితనం. మొదటి రిజర్వాయర్‌లో కేసీఆర్ 2 టీఎంసీల నీళ్లను నింపడంతో అక్కడ భూగర్భ జలాలు పెరిగాయి. కాంగ్రెస్ ఉత్త మాటలు చెప్పకుండా వట్టెం నీళ్లను తెచ్చి ఉంటే ఇక్కడ కూడా గ్రౌండ్ వాటర్ పెరగడంతోపాటు బీడుబారిన పొలాలకు కృష్ణా జలాలు అందేవి.
పాలమూరు పచ్చపడటం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. అందుకే తట్టెడు మట్టి ఎత్తకుండా పనులను పెండింగ్‌లో పెట్టింది. రోజు తట్టెడు మట్టి ఎత్తిపోసిన తీర్నంపల్లి గ్రామం వద్ద పెండింగ్ పనులు పూర్తయ్యేవి. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం మాత్రమే కాదు ఉమ్మడి పాలమూరు పచ్చగా ఉండేది. కాంగ్రెస్ ఎన్ని పవర్ ప్రజెంటేషన్లు పెట్టినా లాభం లేదు. కేసీఆర్ ఎత్తిపోసినా నీళ్లు ఇప్పటికే మొదటి రిజర్వాయర్‌లో పదిలంగా ఉన్నాయి. కాంగ్రెస్ నదీ జలాలను ఎత్తిపోయలేక.. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నదీ జలాలను ఆంధ్రాకు తాకట్టు పెట్టింది.
– మర్రి జనార్దన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే