హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ఎఫ్ఆర్ఎల్ 618 మీటర్లు! ఇదే పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఎఫ్ఆర్ఎల్ 557 మీటరు! మరి 595 మీటర్ల ఎత్తులో ఉన్న మేడ్చల్ జిల్లాలోని ఘన్పూర్ ప్రాంతానికి గోదావరి జలాలను తరలించాలంటే ఎవరైనా దేనిని ఎంచుకుంటారు!? ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి తరలిస్తే గ్రావిటీ (భూమ్యాకర్షణ శక్తి) మీదనే వస్తున్నందున దాన్నే ఎంచుకోవాలని చిన్న పిల్లాడు కూడా చెబుతాడు. గ్రావిటీ అంటే తమ పేటెంట్గా భావించే కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున కచ్చితంగా కొండపోచమ్మ సాగర్‌కే మొగ్గుచూపాలి.
కానీ హైదరాబాద్ మహానగరానికి రెండోదశ గోదావరిజలాల తరలింపులో కాంగ్రెస్ సర్కారు రూటు మార్చింది. ‘గ్రావిటీ వద్దు.. పంపింగే ముద్దు’ అంటున్నది. కేసీఆర్ హయాంలో గ్రావిటీ ద్వారా గోదావరి జలాల తరలింపుతో మంచినీటి పథకాన్ని డిజైన్ చేస్తే.. తూచ్! అన్న రేవంత్ సర్కారు గ్రావిటీ వదిలి ఏకంగా దాదాపు 108 మీటర్ల ఎత్తిపోతలకు నడుంబిగించింది. అంతేకాదు..23కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపోచమ్మసాగర్‌ను వదిలి 50 కిలోమీటర్ల దూరంలోని మల్లన్నసాగర్‌ను ఎంచుకున్నది. ఓవైపు ఎత్తిపోతల నిర్మాణ భారం, మరోవైపు 27 కిలోమీటర్ల అదనపు పైప్‌లైన్ నిర్మాణ వ్యయం, వీటిన్నింటికీ మించి ఇప్పటికే కృష్ణా, గోదావరిజలాల మంచినీటి పథకాల కరెంటు బిల్లులకు ఏటా రూ.500 కోట్లు చెల్లిస్తున్న జలమండలిపై సంవత్సరానికి మరిన్ని వందల కోట్ల అదనపు భారం పడనున్నది.
హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తులోనూ మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండటంతో పాటు మూసీ ప్రక్షాళన కోసం కాళేశ్వరం పథకం నుంచి గోదావరి జలాలను తరలించాలని గత కేసీఆర్ ప్రభుత్వమే నిర్ణయించింది. ఈ మేరకు కాళేశ్వరం పథకం రూపకల్పనలోనే అన్నిరకాల వెసులుబాట్లు కల్పించింది. హైదరాబాద్ తాగునీటి కోసం ఏటా 30 టీఎంసీల కేటాయింపును కాళేశ్వరం డీపీఆర్‌లోనే పొందుపరిచింది. ఎల్లంపల్లి జలాశయం నుంచి నగరానికి మొదటి దశలో గోదావరి జలాల తరలింపు కొనసాగుతున్నది. ఈ పథకం కింద ఏటా 10 టీఎంసీల జలాలు వాడుకుంటున్నారు.
రెండోదశలో కూడా మరో పది టీఎంసీల గోదావరి జలాలు తరలించి హైదరాబాద్ మహానగరవాసులకు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం డీపీఆర్‌ను కూడా తయారు చేసింది. కాళేశ్వరం పథకంలో 15 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీపైనే ఈ జలాలను మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సమీపంలోని ఘన్పూర్ వద్దకు తరలింపుతో పాటు శుద్ధిచేసిన నీటిని ప్రజలకు అందించే సాంకేతిక అంశాలన్నీ అందులో ఉన్నాయి. ఇదేగాకుండా కొండపోచమ్మసాగర్ నుంచి సాగునీటి కోసం నిర్మించిన 127 కిలోమీటర్ల సంగారెడ్డి కాల్వ డిజైన్లోనే మూసీ ప్రక్షాళన కోసం ముందుచూపుతో నీటి కేటాయింపు చేపట్టారు. వాస్తవంగా సంగారెడ్డి కాల్వ గరిష్ఠ వరద ప్రవాహ సామర్థ్యం 5054 క్యూసెక్కులు ఉండగా ఇందులో సాగునీటికి 4,354 క్యూసెక్కులు, మూసీ ప్రక్షాళన కోసం 700 క్యూసెక్కులను జంట జలాశయాలకు తరలించేందుకు డిజైన్ చేశారు.
కేవలం గ్రావిటీ మీద నగరానికి రెండోదశ గోదావరి జలాల తరలింపు పథకాన్ని రేవంత్ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇంతకంటే మెరుగైన డిజైన్, తక్కువ వ్యయంతో పథకం రూపకల్పన చేస్తే బాగుండేది. కానీ గ్రావిటీని కాదని ఎత్తిపోతలను ఎంచుకోవడమే కాకుండా పైప్‌లైన్ దూరం పెంచి, జలమండలిపై అదనంగా కరెంటు ఖర్చును కూడా మోపేలా కొత్త డిజైన్ రూపొందించింది. ఈ మేరకు మంగళవారం రూ.5,560 కోట్లతో రెండోదశ గోదావరిజలాల తరలింపు పథకానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. కేసీఆర్ హయాంలోని డిజైన్‌తో తాజా డిజైన్‌ను బేరీజు వేస్తే పథకం నిర్మాణ వ్యయంతో పాటు నిర్వహణ వ్యయం కూడా కోట్లాది రూపాయల మేర పెరిగిందని స్పష్టమవుతున్నది.
1. కేసీఆర్ ప్రభుత్వ డిజైన్ ప్రకారం: కొండపోచమ్మ సాగర్ నుంచి మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సమీపంలోని ఘన్పూర్ వరకు గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా తరలించవచ్చు. ఎత్తిపోతల భారం ఉండదు. పంపుహౌస్, మోటర్లు అవసరం లేదు.
రేవంత్ ప్రభుత్వ డిజైన్ ప్రకారం : మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్‌కు గోదావరి జలాలను ఏకంగా 108 మీటర్లు ఎత్తిపోయాలి. ఇందుకుగాను భారీ మోటర్లు అవసరం. పంపుహౌస్ నిర్మించాలి. ఇందుకు వందల కోట్లు ఖర్చు చేయాలి. ఏటా నిర్వహణ వ్యయం కూడా కోట్లల్లో ఉంటుంది.
2. కేసీఆర్ ప్రభుత్వ డిజైన్ ప్రకారం: కొండపోచమ్మ సాగర్ నుంచి ఘన్పూర్ వరకు 23 మీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణం సరిపోతుంది.
రేవంత్ ప్రభుత్వ డిజైన్ ప్రకారం: మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్ వరకు 50 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మించాలి. అంటే 27 కిలోమీటర్ల దూరం పైప్‌లైన్ నిర్మాణం పెరిగింది. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ప్రకారం కిలోమీటర్ పైప్‌లైన్ నిర్మాణానికి సుమారు రూ.20 కోట్ల ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. ఈ చొప్పున అదనంగా 27 కిలోమీటర్లకు రూ.540 కోట్ల భారం పెరిగింది. పైప్‌లైన్ నిర్వహణ భారం కూడా ఏటా జలమండలిపై పడుతుంది.
3. కేసీఆర్ ప్రభుత్వ డిజైన్ ప్రకారం : కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా జలాల తరలింపు ఉంటున్నందున ఎత్తిపోతలకు కరెంటు ఖర్చు ఉండదు.
రేవంత్ ప్రభుత్వ డిజైన్ ప్రకారం : మల్లన్నసాగర్ వద్ద సుమారు 108 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయాలి. అంటే కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుంది. ఇప్పటికే జలమండలి కృష్ణా మూడు దశలు, గోదావరి మొదటి దశ జలాల తరలింపునకు ఏటా సుమారు రూ.500 కోట్ల కరెంటు బిల్లులు చెల్లిస్తున్నది. ప్రస్తుతం రూ.4,500 కోట్ల కరెంటు బిల్లుల బకాయి కూడా జలమండలి నెత్తిన ఉన్నది. రెండో దశ గోదావరిజలాల తరలింపునకు మరిన్ని వందల కోట్లు కరెంటు ఖర్చు రూపంలో శాశ్వతంగా జలమండలిపై భారంగా ఉంటుంది.
కొండపోచమ్మ కాకుండా మల్లన్నసాగర్‌ను ఎంచుకోవడంలో అటు నీటిపారుదల శాఖ, ఇటు జలమండలి అధికారులు తలో వాదన వినిపిస్తున్నారు. ఇద్దరి వాదనల్లోనూ డొల్లతనమే ఉండటం గమనార్హం. నీటిపారుదల శాఖ అధికారుల వాదన: కొండపోచమ్మ సాగర్‌కు కాళేశ్వర జలాలు రావాలంటే మల్లన్నసాగర్ తర్వాత రెండు దశల్లో జలాలు ఎత్తిపోయాలి. గోదావరి మంచినీటి పథకంలో మల్లన్నసాగర్‌ను ఎంచుకోవడం వల్ల ఆ రెండు దశల ఎత్తిపోతల భారం తగ్గింది.
వాస్తవానికి హైదరాబాద్ మంచినీటి కోసమే మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు గోదావరి జలాలను తరలించడం లేదు. బృహత్తర కాళేశ్వరం పథకంలో భాగంగా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, మేడ్చల్ జిల్లా పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. అందులో భాగంగానే కొండపోచమ్మ సాగర్‌లో నీటిని నింపుతారు. హైదరాబాద్ మంచినీటి పథకం కోసమే నింపడం అనేది జరగదు. పైగా ఇప్పుడు మంచినీటి పథకాన్ని మల్లన్నసాగర్‌కు మార్చినందున కొండపోచమ్మసాగర్‌ను నింపకుండా ఉండరు కదా!
జలమండలి అధికారుల వాదన: కొండపోచమ్మసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 15 టీఎంసీలు. అదే మల్లన్నసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 50 టీఎంసీలు. అక్కడ నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది.ఎన్ని టీఎంసీలున్నా గోదావరి మంచినీటి పథకంలో భాగంగా సుమారు 500-600 క్యూసెక్కుల కంటే ఎక్కువ తీసుకోరు. నీటి నిల్వ సామర్థ్యమే ప్రామాణికం అనుకుంటే.
ప్రస్తుతం నగరానికి మూడు దశల కృష్ణాజలాల తరలింపు కింద రోజుకు 270 ఎంజీడీల నీళ్లు వస్తున్నాయి. ఇందుకోసం ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ముడినీటిని సేకరిస్తున్నారు. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కేవలం 1.5 టీఎంసీలు. అంటే అక్కంపల్లి కంటే కొండపోచమ్మ సాగర్ పదిరెట్లు ఎక్కువ సామర్థ్యంతో ఉన్నది. అలాంటప్పుడు నీటి నిల్వ సామర్థ్యం అనేది అసలు ప్రామాణికమే కాదు.
సిద్దిపేట, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ధర్మారం/రామడుగు/బోయినపల్లి/ఇల్లంతకుంట: గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పదిరోజులుగా ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు పరిగెడుతున్న జలాలు, మంగళవారం నుంచి సిద్దిపేట జిల్లాలోని రంగనాయనాయక సాగర్ జలాశయం వైపు సాగాయి. దిగువన కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-2లోని నంది, గాయత్రీ పంప్‌హౌస్‌లలో ఎత్తిపోతలు కొనసాగుతున్నా యి.
మధ్యమానేరు నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా తిప్పాపూర్‌లోని సర్జ్పూల్కు జలాలు చేరుతుండగా, ఇక్కడి పంప్‌హౌస్‌లో రెండు బాహుబలి మోటర్ల ద్వారా 6,440 క్యూసెక్కులు అన్నఫూర్ణ జలాశయానికి తరలిస్తున్నారు. ఇక్కడ గేట్లు తెరిచి అంతే మొత్తంలో రంగనాయకసాగర్‌కు వదులుతున్నారు. రంగనాయక్సాగర్కు నీళ్లు రావడంతో సిద్దిపేట రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం లేఖ రాసిన మాజీ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రంగనాయకసాగర్ నుంచి మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను నింపనున్నట్టు అధికారులు తెలిపారు.
వాస్తవానికి మంచినీటి పథకాల్లో వాటర్ సోర్స్ (నీటిని సేకరించే వనరు) సమీపంలోనే మంచినీటి శుద్ధికేంద్రం (డబ్ల్యూటీపీ) నిర్మించాలని నిపుణులు తెలిపారు. దీని ద్వారా అక్కడే నీటిని శుద్ధి చేయడం వల్ల సరఫరా భారం తగ్గుతుంది. వంద లీటర్ల మంచినీటి కోసం అంతకంటే కనీసంగా 20 శాతం ఎక్కువ ముడినీటిని అంటే సుమారు 120 లీటర్లు తీసుకోవాలి. అందులో టర్బిడిటీ, ఇతరత్రా అన్నింటినీ తొలగించడం ద్వారా శుద్ధినీరు వస్తుంది. అందుకే నీటి వనరు సమీపంలోనే ఈ కేంద్రాలు నిర్మించడం వల్ల 20 శాతం మేర సరఫరా భారం తగ్గుతుంది.
అంతేకాకుండా మార్గమధ్యలో ఉన్న గ్రామాలకు సైతం శుద్ధినీరు అందించే అవకాశం ఉంటుంది. కానీ తాజా మంచినీటి పథకంలో 50 కిలోమీటర్ల దూరం ముడినీటిని తరలించిన తర్వాత ఘన్పూర్ వద్ద శుద్ధి చేస్తున్నారు. కేసీఆర్ హయాంలోనూ ఇదేరీతిన డిజైన్ ఉందనుకున్నా గత డిజైన్‌లో దూరం 23 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఇప్పుడు రెట్టింపునకు పైగా పెరిగింది. తద్వారా ఈ రూపంలోనూ భారం పెరగనుంది.