వికారాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): సీఎం సొంత నియోజకవర్గంలోనే వడ్లు కొనకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ధాన్యం కొనే ధ్యాస సీఎం రేవంత్‌రెడ్డికి లేదని విమర్శించారు. రైతులు రోజుల తరబడి కల్లాల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా కనికరం చూపడం లేదని మండిపడ్డారు.
మంగళవారం వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కల్లాల మీద పడుకొని రైతులు చనిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం లేదని ధ్వజమెత్తారు. గన్నీ బ్యాగుల కొరత, హమాలీలు లేకపోవడంతో రోజుల తరబడి ధాన్యాన్ని అమ్ముకోలేక రైతులు అవస్థలు పడుతున్నారని దుయ్యబట్టారు.
మొన్న సీఎం సొంత నియోజకవర్గానికి వెళ్తే.. తరుగు పేరిట క్వింటాల్‌కు 13 కిలోలను తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. మార్పు మార్పు అంటూ రైతులను నట్టేట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు క్యూకడితే, ప్రస్తుతం కోట్లు ఖర్చు చేస్తున్నా పెట్టుబడులు వచ్చే పరిస్థితులు లేవని ఆరోపించారు.
రెండున్నరేండ్ల క్రితం రియల్ ఎస్టేట్ రంగం ఎట్లుండే, ఇప్పుడెట్లుందో అందరికీ తెలుసని అన్నారు. రెండున్నరేండ్లలోనే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిందని విమర్శించారు. సభ్యత్వ నమోదుతోపాటు ఎస్ఐఆర్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి గట్టు రామచంద్ర రావు, కార్పొరేషన్ మాజీ చైర్మెన్ నాగేందర్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్ పాల్గొన్నారు.