హైదరాబాద్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా, ఇప్పటికే కుదేలైన రియల్ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడబోతున్నది. రాష్ట్రంలో ఊహించని రీతిలో భూముల మార్కెట్ విలువలు పెరుగబోతున్నాయి. అనాలోచితంగా, వాస్తవాలను బేరీజు వేసుకోకుండా భూముల మార్కెట్ విలువను పెంచాలన్న ప్రభు త్వ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధికి ప్రమాదకారిగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ఖజానాకు ఆదాయ సమీకరణలో భాగంగా రిజిస్ట్రేషన్ శాఖపై అధిక భారం మోపేందుకు సర్కార్ సిద్ధమవుతున్నది.
వ్యవసాయ భూముల మార్కెట్ విలువను అమాంతం మూడింతలు, వ్యవసాయేతర ఆస్తులు, ఇండ్ల మార్కెట్ విలువను మరింతగా పెంచబోతున్నది. దీంతో అవి సామాన్యులకు మరింత ప్రియం కాబోతున్నాయి. తక్షణమే భూముల, ఆస్తుల మార్కెట్ విలువను పెంచుకోవచ్చని సబ్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ, ఇప్పటికిప్పుడు పెంపుదల అమలుకు పలు అవాంతరాలు ఎదురవుతున్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హన్మంతు మే 5న రాష్ర్టానికి తిరిగి వస్తుండగా, మార్కెట్ విలువల పెంపుపై అధ్యయనం చేస్తున్న అరవింద్ సుబ్రహ్మణ్యన్ కమిటీ నివేదిక అదే నెల 10వ తేదీన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది.
అంటే మే 10 తర్వాత ఏ క్షణమైనా పట్టణాలు, నగరాల్లో 300%, గ్రామీణ ప్రాంతాల్లో 100%పైగా మార్కెట్ విలువల పెంపు నిర్ణయం అమలయ్యే అవకాశం ఉన్నది. ఈ అడ్డంకులను పరిశీలించకుండానే ఆదాయ వనరుల పెంపుదలపై ఏర్పాటైన సబ్ కమిటీ రెండ్రోజుల క్రితం మార్కెట్ విలువలను పెంచుకోవాలని రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించింది. సాధ్యాసాధ్యాలు, మంచీ చెడులను సమగ్రంగా అధ్యయనం చేయకుండా, ప్రైవేట్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పెంపుదలను వర్తింపజేస్తే రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం మరింత పతనమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అయినప్పటికీ, మే 10 నుంచి లేదంటే మరో నెల ఆలస్యంగానైనా సరే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తులు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్ల మార్కెట్ విలువను ఒకేసారి భారీగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ మేరకు శుక్రవారం జరిగిన రిసోర్సెస్ మొబిలైజేషన్ సబ్ కమిటీ రిజిస్ట్రేషన్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల ఫలితంగా రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అత్యవసరాల నిమిత్తం వ్యవసాయ భూములు, ఓపెన్‌ప్లాట్లు, ఇండ్లు అమ్ముకొనేవారికి తాజా అనిశ్చిత పరిస్థితులు శరాఘాతంగా పరిణమిస్తున్నాయి. ఇప్పటికే లక్షలాది ప్లాట్లు, ఇండ్లు కొనేనాథుడు లేక మూలనపడినట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజా పెంపు ప్రతిపాదనలను అమలుచేస్తే రాష్ట్ర భవిష్యత్తు, ప్రగతికి అవరోధంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుత మార్కెట్ ధరలే కొనుగోలుదారులకు భారంగా మారిన తరుణంలో వాటి విలువను మరింత పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని రియలర్టర్లు చెప్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొన్న వివాదాస్పద నిర్ణయాలు, హైడ్రా చర్యలతో రియల్ఎస్టేట్ రంగంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిన్నది. రియల్ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయి ఎన్నో ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిల్చిపోయిన దుస్థితి నెలకొన్నది. దీంతో స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలేవీ ముందుకు రావడంలేదు. ఈ పరిస్థితుల్లో భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించి ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది.
ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం మే లేదంటే జూన్‌లో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలు భారీగా పెరుగనున్నాయి. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంచేసిన సర్కార్ సత్వరమే వాటిని అమలుచేసేందుకు సిద్ధమవుతున్నది. ప్రజా సంక్షేమంపై ఏ మాత్రం ముందుచూపులేని సర్కార్ ఆదాయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. తద్వారా అన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువ గరిష్ఠంగా మూడింతల వరకు పెరుగనుండగా, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని నివాస స్థలాల ధరలకు కూడా రెక్కలు రానున్నాయి. ఆయా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విలువను మూడు నాలుగింతల వరకు పెంచాలని ప్రతిపాదించారు. అపార్ట్మెంట్ల ఫ్లాట్ల ధరలను మాత్రం స్వల్పంగా పెంచే అవకాశం ఉన్నదని సమాచారం.
గ్రామీణ ప్రాంతాల్లో ఎకరాకు ప్రస్తుతం రూ.6 లక్షలుగా ఉన్న మార్కెట్ విలువను రూ.18 లక్షలకు పెంచబోతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కోర్ అర్బన్ ఏరియాల్లో రూ. 20 లక్షల వరకు ఉన్న ఎకరా భూమి మార్కెట్ విలువను 300%పైగా పెంచబోతున్నట్టు తెలిసింది. ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో నివాస స్థలాల ధరలను గరిష్ఠంగా మూడు రెట్లు పెంచేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికీ ప్రతిపాదనల దశలోనే ఉన్న రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైలు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటివాటిని చూపెట్టి ఆయా భూముల మార్కెట్ విలువను భారీగా పెంచనున్నారు.
అపార్ట్మెంట్లలో ఎస్ఎఫ్టీకి రూ.2,200 చొప్పున ఉన్న మార్కెట్ విలువ రూ. 2,800కిపైగా పెరుగబోతున్నది. ఈ పెంపు ప్రభావం కోర్ అర్బన్ ప్రాంతాల ప్రజలపై ఎక్కువగా పడనున్నది. నగరాల్లో సగటున చదరపు అడుగు ఫ్లాట్ ధర రూ.3వేల నుంచి 100% పెంపుతో రూ.6వేలకు పెంచనున్నారు. చదరపు అడుగు విలువ రూ.1,800 ఉన్న ప్రాంతాల్లో 300% పెంపుతో రూ.5,400కి చేరనున్నది. కొండాపూర్, గచ్చిబౌలిలో ప్రస్తుతం గజం భూమి మార్కెట్ విలువ రూ.26,700 ఉండగా, వాణిజ్య స్థలమైతే రూ.44,900గా ఉన్నది. ఈ ధరలను 100% పెంచే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. మహేశ్వరం, మోకిలా వంటి ప్రాంతాల్లో చదరపు గజం రూ. 6వేలకు మించనున్నది. నార్సింగి, మణికొండలో రూ.60 వేలకుపైగా చదరపు గజం ధర పెరగనున్నది. మొత్తంగా కోర్ అర్బన్‌లోని 39 రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో భారీగా పెరుగుదలను వర్తింపజేయనున్నారు.
కార్పొరేట్ శక్తులకు మేలు చేసే దిశగా ఆలోచిస్తున్న ప్రభుత్వం… కమర్షియల్ స్పేస్ విలువలను తగ్గించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.7వేలు ఉన్న ధరను రూ.6,500కు తగ్గించే అవకాశం ఉన్నది. ఈ తగ్గింపు వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలకు మేలు చేయనున్నది. గత రెండున్నరేండ్లుగా రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం అథమస్థాయికి చేరింది. ఏనాడూ లేని రీతిలో కనిష్ఠ స్థాయికి ధరలు పడిపోగా, రిజిస్ట్రేషన్ల సంఖ్య క్రమేపీ తగ్గుతున్నది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ రాబడికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న హైదరాబాద్‌లో సైతం హైడ్రా ఎఫెక్ట్‌తో రియల్ఎస్టేట్ రంగం పూర్తిగా మందగించింది.
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌కు క్యూ కట్టిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను తరలిస్తూ తెలంగాణకు వచ్చేందుకు విముఖత చూపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాబడికి కీలకమైన రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ, బడ్జెట్లో భారీ అంచనాలతో లక్ష్యం నిర్దేశించుకొన్న ప్రభుత్వం దానిని రాబట్టుకొనేందుకు భూముల మార్కెట్ విలువ పెంచేందుకు సిద్ధమైంది.
