హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పట్టణ పేదలు ప్రభుత్వం చెప్తున్న ఇన్-సిటూ (ఉంటున్నచోటే ఇల్లు నిర్మించడం) విధానంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వం ఇండ్లు నిర్మించే వరకు వారు అద్దె ఇంటిలో ఉండాల్సి రావడమే. ఏదైనా కారణంతో ప్రభుత్వ ప్రతిపాదిత ఇండ్ల నిర్మాణం ఆలస్యమైతే మాత్రం పేదలు అద్దెలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లను నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా, ఇప్పటివరకు ఇంటి స్థలం ఉన్న 2,03,744 మందికి మాత్రమే ఇండ్లు మంజూరుచేశారు. స్థలంలేని పేదలకు రెండో విడతలో నిర్మించాలని నిర్ణయించారు.
పట్టణాల్లో మురికివాడల్లో నివశిస్తున్న పేదలకు వారు ప్రస్తుతం ఉంటున్న గుడిసెలను తొలగించి అదేచోట మూడు అంతస్తుల అపార్ట్మెంట్లు (ఇన్-సిటూ విధానం) నిర్మించి ఒక్కొక్కరికి కనీసం 550-600 చదరపు అడుగులమేర ఫ్లాట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రభుత్వం తమ ఇండ్లను తొలగించి ఎంతకాలంలోగా అపార్ట్మెంట్లు నిర్మించి ఇస్తుందోననే సందేహాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. అపార్ట్మెంట్లు నిర్మించేవరకు తాము అద్దె ఇంటిలో ఉండాల్సి ఉంటుందని, ఒకవేళ నిర్మాణాల్లో జాప్యం జరిగితే తమపై అద్దెల భారం పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి నిధుల సమస్య ఉన్నదని సాక్షాత్తూ ముఖ్యమంత్రే పదేపదే చెప్తుండటంతో అపార్ట్మెంట్ల నిర్మాణం సజావుగా సాగుతుందా? నిధుల సమస్య ఎదురై మధ్యలో ఆగిపోతే తమ పరిస్థితి ఏమిటి? అని వారు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో ఇంటి అద్దెల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సింగిల్ రూమ్‌కే కనీసం రూ.5,000-8,000 వరకు చెల్లించాల్సి వస్తున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇన్-సిటూ పద్ధతిలో చేపట్టే ఇండ్లను ఏడాదిలోగా పూర్తిచేసి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. లేనిపక్షంలో ఇండ్ల లబ్ధిదారుల కోసం ప్రభుత్వమే అద్దెలు నిర్ణయించి, ఏడాది గడువు పూర్తయ్యాక ఎంతకాలం ఆలస్యమైతే అంతకాలం ప్రభుత్వమే వారికి అద్దెలు చెల్లించాలని కోరుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్-సిటూ పద్ధతిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 40 మురికివాడల్లో దాదాపు 9,837 ఇండ్లను గడువులోగా నిర్మించి పేదలకు పంపిణీచేసింది. ఒక్కో యూనిట్‌పై సుమారు రూ.7.5 లక్షల నుంచి రూ.8.65 లక్షల వరకు ఖర్చుచేసింది. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇండ్ల నిర్మాణానికి గడువు నిర్ధారించి పూర్తిచేయాలని సూచిస్తున్నారు.
ఇండ్ల నిర్మాణం ఒక ఎత్తైతే.. మౌలిక సదుపాయాల కల్పన మరో ఎత్తు. ఒకవైపు ఇండ్ల నిర్మాణం పూర్తవుతుంటే, మరోవైపు మంచినీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు తదితర కనీస సదుపాయాలు కూడా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వివిధ శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరం. శాఖల మధ్య సమన్వయం లేకపోతే చాలా సమస్యలు ఎదురవుతాయని, ఇండ్లు నిర్మించినా వాటిని లబ్ధిదారులకు కేటాయించే పరిస్థితి ఉండదని అధికారవర్గాలు చెప్తున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమ పేర్లు గల్లంతయ్యాయని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో పోచారం కాలనీవాసులు ఆదివారం రాస్తారోకో చేపట్టారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నామని, మొదటి జాబితాలో తమ పేర్లు రాగా అప్పుచేసుకుని మరీ ఇండ్లు కట్టుకున్నట్టు తెలిపారు. ఇటీవల విడుదలైన జాబితాలో తమ పేర్లను గల్లంతు చేశారని ఆరోపించారు.
– నస్రుల్లాబాద్