Hyderabad | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరాన్ని ఒక్కసారిగా కుంభవృష్టి ముంచెత్తింది. నిన్నటిదాకా ఉక్కపోతతో అల్లాడిన జనం గురువారం కుండపోత వానకు విలవిలలాడారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు రెండున్నర గంటలు వాన దంచికొట్టింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరద నీరు రహదారులను ముంచెత్తింది. నగర ట్రాఫిక్ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడినా అదృష్టవశాత్తు గ్రేటర్‌వ్యాప్తంగా ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
నగరానికి భారీ వర్ష సూచన అంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా అధికార యంత్రాంగం అప్రమత్తత లేకపోవడంతో వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ప్రత్యక్ష నరకాన్ని చూశారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లే ఓ వైపు వరద నీటిని తొలిగిస్తూ, మరో వైపు ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ నగరంలో కనిపించారు. అత్యధికంగా బంజారాహిల్స్‌లో 8.75 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నగరవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ 5 సెం.మీ. అంతకుమించి వర్షపాతం నమోదు కాగా, శివారు ప్రాంతాల్లో 1-3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
నగరంలో భారీ వర్షానికి 63 చోట్ల వరద నీరు నిలిచి జనం ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా హోరున కురిసిన వర్షంతో డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెంటనే అక్కడికి చేరుకోలేకపోయాయి. దీంతో నిజాం కాలేజీ, మలక్‌పేట రైల్వే అండర్ బ్రిడ్జి, మలక్‌పేట మార్కెట్, చంపాపేట డీమార్ట్, బేగంపేట, తిరుమలగిరి, సికింద్రాబాద్, మాసబ్‌ట్యాంక్, మూసరాంబాగ్ బ్రిడ్జి… ఇలా అనేకచోట్ల భారీ ఎత్తున రోడ్లపై వరద నీరు నిలిచింది. దీంతో కొన్నిచోట్ల దాదాపు 30-45 నిమిషాల పాటు వాహనాలు రోడ్డు దాటే పరిస్థితి లేకుండాపోయింది. మలక్‌పేట రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర రోడ్డుపై ప్రవహిస్తున్న వరదతో రాకపోకలు నిలిచిపోయి..ఐదారు కిలోమీటర్లు ట్రాఫిక్ జాం నెలకొంది. సా.5 గంటల వరకు నగరం లో ఎక్కడా వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొన్నది. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు వరద నీరు నిలిచే ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. అయినప్పటికీ రాత్రి 8 గంటల వరకు చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య అదేవిధంగా కొనసాగింది.
భారీ వర్షానికి బంజారాహిల్స్ పరిధిలోని ఉదయ్‌నగర్‌లో నాలాపై ఉన్న రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయింది. దీంతో అక్కడ రోడ్డు కుంగిపోయింది. డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే అప్రమత్తమై చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్‌రాస్ సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. అంబర్‌పేట, ముషీరాబాద్, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీల్లో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. రాత్రి 8 గం వరకు జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీ నెంబరుకు 82 ఫిర్యాదులు వచ్చాయి. లోతట్టు ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.