హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యానికి కేంద్ర సర్కారు గండికొట్టింది. పని దినాలకు భారీగా కోతపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.5 కోట్ల పని దినాలనే మంజూరు చేసింది. గత సంవత్సరం కంటే కోటిన్నర పని దినాలను తగ్గించింది. 12 కోట్ల పనిదినాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు చేస్తే, 6.5 కోట్ల పని దినాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. గత సంవత్సరం 8 కోట్ల పనిదినాలు కల్పించగా, ఈసారి అందులో 1.5 కోట్ల పనిదినాలకు కోతపెట్టింది. పైగా డిమాండ్ ఆధారంగా కాకుండా అవసరాల ప్రాతిపదికన పనులుచేపట్టాలని ఆదేశాలిచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలు 1.10 కోట్ల మందికిపైగా ఉన్నారు. వీరిలో యాక్టివ్ కూలీలు 54.85 లక్షల మంది ఉన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో పెద్దమొత్తంలో ఉపాధి హామీ పనులు చేపట్టడంతో చాలామందికి వంద రోజులపైగా పనిదినాలు లభించాయి. కేంద్రం మంజూరు చేసిన పనిదినాల కంటే మించి పనులు జరిగేవి. గడిచిన ఐదేండ్లలో ఏటా పదికోట్లకు పైగా పనిదినాలను కేంద్ర సర్కారు మంజూరుచేసింది. ఈ ఏడాది ఒకేసారి సగం పనిదినాలకు గండికొట్టింది. గత ఏడాది మాదిరిగానే 12 కోట్ల పనిదినాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు చేస్తే.. 6.5 కోట్ల పనిదినాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది రూ.2,708.3 కోట్ల నిధులు కేటాయించింది. వేతనాలకు రూ.1,625 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.1,083 కోట్లు కేటాయిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు. ఈ ఏడాది మహిళాశక్తి ఉపాధి భరోసా, వన మహోత్సవం, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనకు నిర్ణయించారు. పనిదినాలు పెంచాలని కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గత నాలుగేండ్లలో కూలీలకు వేతనాల రూపంలో రూ.2 వేల కోట్లకు పైగా వెచ్చించారు. కానీ, ఈ ఏడాది ఆ బడ్జెట్ను రూ.1,625 కోట్లకే పరిమితం చేశారు.