మబ్బుల్ని చూసి కుండలోని నీళ్లు ఒలకబోసుకుంటారా?! అవును, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అదే చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, పెన్నా బేసిన్లలో గోదావరి జలాలను పారించి, తద్వారా తన ప్రయోజనాల్ని కూడా నెరవేర్చుకునేందుకు తెలంగాణకు హక్తుభుక్తంగా దక్కిన కుండలోని నీళ్లను ఒలకబోసేందుకు సిద్ధపడుతున్నది. తమిళనాడుకు గోదావరి జలాల్ని తన్నుకుపోయేందుకు చంద్రబాబుతో కలిసి ఎగువన తెలంగాణను ఎండబెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నది. చివరకు అంతర్జాతీయ జల ప్రమాణాలకు సైతం పాతర వేయడంతో పాటు దేశ సాగునీటి చరిత్రలో ఎన్నడూలేని రీతిలో కొత్త జలనాటకానికి తెర లేపుతున్నది. సముద్రంలో కలిసే వృథా జలాలను బూచిగా చూపిస్తూ రూ. 80వేల కోట్ల బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో పాటు నిధులకు సైతం ఎలాంటి అడ్డంకులు లేకుండా మార్గం సుగమం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 24 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కేవలం నికరజలాల ఆధారంగా రూపొందించిన ప్రాజెక్టులకే కేంద్రం అనుమతులు ఇస్తున్నది. అదే శాస్త్రీయత. కానీ బనకచర్ల విషయంలో మాత్రం చంద్రబాబు సూత్రీకరిస్తున్న వృథాజలాల ఆధారంగా కేంద్రం ముందుకుపోవడంపై తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా వందల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. అందులో 200 టీఎంసీలు వాడుకుంటానంటూ ఒక ట్రిబ్యునల్ తరహాలో చంద్రబాబు చెప్తున్న వృథాజలాలకు శాస్త్రీయత ఎక్కడిది? కేంద్రం దానిని ఎలా ప్రామాణికంగా తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో హస్తినలో ఇంత భారీ కుట్ర జరుగుతున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తుండటంపైనా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
మేడిగడ్డను ఎండబెట్టి తెలంగాణలో గోదావరిజలాల వినియోగాన్ని తగ్గించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జరుగుతున్న చారిత్రక అన్యాయంపై ఎందుకు నోరు మెదపడంలేదని మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో ప్రవహిస్తున్న నదుల్లో ప్రతి ఏటా ప్రవహించే నీటి పరిమాణాన్ని లెక్కించి ఆయా నదుల్లో ఎంత నీటి లభ్యత ఉన్నదో తేల్చి ఆయా రాష్ర్టాలకు నీటి కేటాయింపులు చేపట్టేందుకు నదీ ట్రిబ్యునళ్లు ఏర్పాటయ్యాయి. ఇలా దేశంలో దాదాపు ఎనిమిది ట్రిబ్యునళ్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ఐదు మనుగడలో ఉన్నాయి. దశాబ్దాల నీటి లెక్కలు తీసుకొని శాస్త్రీయ మథనం చేసిన తర్వాతనే నదీ పరీవాహకంలోని రాష్ర్టాలకు 75 శాతం డిపెండబులిటీ, 65 శాతం డిపెండబులిటీపై ట్రిబ్యునల్స్ నీటి కేటాయింపులు చేపట్టాయి.
అందులో భాగంగానే గోదావరి నదిలో పరీవాహక రాష్ర్టాల వినియోగం, అవసరాలను పరిగణలోనికి తీసుకొని ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాతనే ఉమ్మడి ఏపీకి 1,486 టీఎంసీల కేటాయింపులు జరిగాయి. దానికి బచావత్ ట్రిబ్యునల్ ఆమోద ముద్ర వేసింది. మరో ట్రిబ్యునల్ ఏర్పాటై ఇంకో లెక్క తేల్చేవరకు బచావత్ ఆమోదించిన వివరాలే కేంద్రంతో పాటు అన్ని రాష్ర్టాలకు ప్రామాణికం. కానీ కృష్ణాజలాల్లో దశాబ్దాలపాటు అన్యాయానికి గురైన తెలంగాణకు గోదావరిలోనూ అదే తరహా అన్యాయం చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు తాజాగా కొత్త సూత్రాన్ని తెరపైకి తెచ్చారు.
తమిళనాట రాజకీయ ప్రయోజనాలు పొందాలనే లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. మంచు కరిగి హిమనీ నదీజలాలు వృథాగా పోతుండటం, రుతుపవనాలు గతి తప్పడంతో దక్షిణాది నదులు ఒట్టిపోతున్నందున వాజ్‌పేయి హయాంలో నదుల అనుసంధానం అనే ప్రక్రియను తెచ్చారు. కానీ అందుకు తిలోదకాలిస్తున్న మోదీ సర్కారు ఉత్తరాది నుంచి దక్షిణాదికి అనుసంధానాన్ని అటకెక్కించి గోదావరి-కావేరీ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. దీనిపై కేంద్రంలోని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) కేసీఆర్ హయాంలోనూ అనేక సమావేశాలు నిర్వహించింది. అయితే గోదావరిలో ఆయా రాష్ర్టాలు వాడుకోగా మిగులు జలాలు ఉంటే శాస్త్రీయంగా లెక్క తేల్చి అప్పుడు కావేరీకి తరలించాలని కేసీఆర్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
కానీ ఆ శాస్త్రీయ లెక్కలను తేల్చి అన్ని రాష్ర్టాల గత, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను బేరీజు వేస్తే మిగులు అనేది ఉంటుందా? లేదా? అనేది సందేహాస్పదమే. అందుకే తేల్చలేని ఆ లెక్కలను ముందు వేసుకోవడం వృథా ప్రయాస అనుకునే మోదీ ప్రభుత్వం చంద్రబాబును రంగంలోకి దింపింది. ఆ మేరకు చంద్రబాబు వృథా జలాలు అంటూ బనకచర్ల ప్రాజెక్టును రూపొందించి గోదావరిని తరలించుకుపోవాలని స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది. అయితే కచ్చితంగా ఏటా 2వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తాయనేది తేల్చాల్సింది ట్రిబ్యునల్. అది నిజమేనని తేలితే ఆ మేరకు ఎగువ రాష్ర్టాలకు కూడా అందులో వాటా ఉంటుంది. కానీ 2 వేల టీఎంసీలు కలుస్తున్నందున అందులో 200 టీఎంసీలు (10 శాతం) తాను మలుపుకుపోతానని చంద్రబాబు అనడం ఎంత వరకు శాస్త్రీయం? మరి ఏపీ వాటా 10 శాతమైతే తెలంగాణ, ఎగువన ఉన్న మిగిలిన రాష్ర్టాల వాటా తేల్చాల్సింది ఎవరు? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
దేశ సాగునీటి రంగ చరిత్రలో ఒక జాతీయ ప్రాజెక్టు చేపట్టాలన్నా, ఆయా రాష్ర్టాలు కేంద్ర జల సంఘం అనుమతితో ప్రాజెక్టులను నిర్మించాలన్నా అన్నింటికంటే ముందుగా రేకెత్తే ప్రశ్న నీటి కేటాయింపులు ఉన్నాయా అని? మరి ఈ కేటాయింపులు అనేవి ట్రిబ్యునల్ ఆధారంగానే జరుగుతాయి. అందుకే ఇప్పటివరకు కేంద్రం అనుమతులు ఇచ్చిన ప్రతి ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ నీటి కేటాయింపులే ప్రామాణికం. అలాంటప్పుడు చరిత్రలో ఎన్నడూలేని విధంగా, జాతీయ నీటి ప్రమాణాలకు భిన్నంగా మోదీ ప్రభుత్వం చంద్రబాబు చెప్తున్న వృథాజలాల ఆధారిత బనకచర్లకు అనుమతులు ఎలా ఇస్తుంది? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కానుంది.
సముద్రంలో కలిసే వృథా జలాలకు కేంద్రం అనుమతులు ఇచ్చి, నిధులు సమకూరిస్తే భవిష్యత్తులో మిగిలిన రాష్ర్టాలు కూడా సముద్రంలో కలిసే జలాల ఆధారంగానే ప్రాజెక్టుల్ని రూపొందించుకుంటాయి. తద్వారా ఎగువ రాష్ర్టాల హక్కుల్ని కాపాడేది ఎవరు? అని సందేహం వ్యక్తమవుతున్నది. ప్రధానంగా కృష్ణాలో కూడా ఈ ఏడాది (2024-25 ) 858 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. 2023-24 నీటి సంవత్సరంలో 72 టీఎంసీలు, 2022-23 నీటి సంవత్సరంలో 765 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. మరి వీటి ఆధారంగా తెలంగాణగానీ, ఇతర రాష్ర్టాలుగానీ ప్రాజెక్టుల రూపకల్పన చేస్తే కేంద్రం అనుమతి ఇస్తుందా? కావేరీకి గోదావరి జలాలను తరలించాలనే రాజకీయ తాపత్రయంలో కేంద్రం బనకచర్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి కావేరీతో ముందుకుపోతే దక్షిణాది రాష్ర్టాల జలాల పంపిణీల్లో మరిన్ని చిక్కుముళ్లు, వివాదాలు రాజుకుంటాయి.
‘ఒర్లి ఒర్లి వీడు పోతడు.. వండుక తిని వాడుపోతడు’.. తెలంగాణలోని ఈ సామెత ఇప్పుడు గోదావరిలో రాష్ట్ర దుస్థితికి అద్దం పడుతున్నది. కేసీఆర్ మీద కోపంతో రేవంత్ ప్రభుత్వం మేడిగడ్డను పునరుద్ధరించకుండా రాజకీయ విమర్శ లు చేసుకుంటూ పబ్బం గడుపుతున్నది. తెల్లారింది మొదలు గోదావరిజలాల వినియోగాన్ని ఎలా పెంచాలనే ధ్యాస మరిచి, కేసీఆర్‌ను బద నాం చేయడంపైనే దృష్టి పెడుతున్నది. ఇదే అ దునుగా చంద్రబాబు బనకచర్ల, మోదీ సర్కారు కావేరీ ప్రాజెక్టుల్ని చకాచకా పట్టా లెక్కించేందుకు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు రెండు రోజుల కిందట ఢిల్లీ మీడి యా సమావేశంలో బనకచర్లకు వాడుకునే జలా లు సముద్రంలో కలిసే వృథా జలాలేనని, ఇందులో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు.
సరిగ్గా వైఎస్ హయాంలో కూడా పోతిరెడ్డిపాడు విషయంలో వరద జలా ల ఆధారంగా పోతిరెడ్డిపాడు విస్తరణ చేస్తున్నందున నీటి హక్కుల్ని అడగబోమని లిఖితపూర్వకంగా ట్రిబ్యునల్‌కు రాసి ఇచ్చినట్టు రిటైర్డ్ ఇంజినీర్ ఒకరు తెలిపారు. ఇప్పుడు కృష్ణా బోర్డు ముందు ఏపీ అదేదో హక్తుభుక్తంగా పోతిరెడ్డిపాడుకు నీటి కేటాయింపులు ఉన్నట్టు గిరిగీసి మరీ ఏటా వందల టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలిస్తున్నది. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేస్తే కూడా పోతిరెడ్డిపాడుకు నీళ్లు అందడం లేదని, వెంటనే నిలిపివేయాలంటూ బోర్డుకు ఫిర్యాదు చేస్తున్నది. ఇట్లనే భవిష్యత్తులో బనకచర్ల, కావేరీకి నీళ్లు సరిపోవడంలేదని, వెంటనే కాళేశ్వరం, దేవాదుల ఎత్తిపోతల నిలిపివేయాలంటూ ఫిర్యాదులు చేసే పరిస్థితులు కూడా దాపురించే ప్రమాదం ఉందని పలువురు విశ్రాంత ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సముద్రంలో కలిసే వృథాజలాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపడతామని చెప్తున్నది. ఆ మేరకు పోలవరంలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు మేరకు ఎగువ రాష్ర్టాలకు కృష్ణాజలాల్లో వాటా పెంచినట్లుగా ఇందులోనూ వాటా ఇస్తారా? అసలు గోదావరిలో శాస్త్రీయంగా ఎంత నీటి లభ్యత ఉన్నది? ఎగువ రాష్ర్టాల ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు ఏందనే లెక్కలు తీయాలి. అవన్నీపోగా మిగులు ఉన్నాయని తేలితే బనకచర్లకు కేంద్రం అనుమతి ఇవ్వాలి. తద్వారా ఆ ప్రాజెక్టుకు ఎంత కేటాయిస్తారో, అంతమేర కృష్ణా జలాల్లో తెలంగాణకు అదనపు వాటా ఇవ్వాలి.
– ఎం శ్యాంప్రసాద్‌రెడ్డి, ట్రీ ప్రధాన కార్యదర్శి