Election Commission | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరంతా 2024 జూన్ వరకు పోటీ చేయడానికి అనర్హులని వెల్లడించింది. దేశంలో అత్యధిక అనర్హులు బీహార్‌లో ఉన్నట్టు ఎన్నికల సంఘం జాబితా ద్వారా వెల్లడైంది. బీహార్‌లో 204 మంది అనర్హులుగా ఉండగా, తెలంగాణలో 107 మంది ఉన్నట్టు ప్రకటించింది.
అనర్హుల జాబితాలో రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులెవ్వరూ లేకపోవడం విశేషం. అనర్హుల్లో నిజామాబాద్ జిల్లావాసులే 67 మంది ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు డిమాండ్‌తో పోటీ చేసినవారు ఎన్నికల నిబంధనల ప్రక్రియ పూర్తి చేయకపోగా, నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో అనర్హత వేటు పడ్డట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో 51, కేరళలో 52, ఉత్తరప్రదేశ్‌లో 49, రాజస్థాన్‌లో 47, మధ్యప్రదేశ్‌లో 83, కర్ణాటకలో 91, ఛత్తీస్‌గఢ్‌లో 85, హర్యానాలో 55 మంది అనర్హుల జాబితాలో ఉన్నారు.