హైదరాబాద్ : రైతులు కష్టపడి పండించిన వరి పంట ను కేంద్రం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా.. చేవెళ్ల నియోజకవర్గం పరిధి అంబేడ్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి రైతు ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ..14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ నాశనం కాకుండా సీఎం కేసీఆర్ ఎంతో ఇష్టంగా బాగు చేస్తూ, బంగారు తెలంగాణ చేస్తున్నారని తెలిపారు. సమృద్ధిగా సాగు నీరు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల పాటు నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తూ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నారని తెలిపారు.
ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని అత్యంత దారుణంగా, నిరంకుశంగా ప్రవర్తిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ రైతాంగంపై కండ్ల మంట, కుల్లు బుద్ధితో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన కేంద్రం, ఇప్పుడు తెలంగాణ రైతుల పంటలను కొనబోమని, రాష్ట్రం కొనకూడదని ఆదేశించిందన్నారు.
ఈ నిరంకుశ అన్యాయ విధానాల్ని ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాక నిరసనలు కొనసాగుతాయన్నారు. కేంద్రం చేస్తున్న ఈ గందరగోళాన్ని తొలగించి ప్రజలకు, రైతులకు నిజాల్ని స్పష్టంగా తెలియజేయాలనే ఈ రైతు ధర్నాలు నిర్వహిస్తున్నామన్నారు.
తెలంగాణ నేతలకు తెలంగాణ రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ నేతలు సైతం తెలంగాణ రైతాంగానికి మేలు చేసే విధంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు.
రైతులంతా సంఘటితమై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.