హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తేతెలంగాణ) : కంచ గచ్చిబౌలి భూముల అమ్మకం ముసుగులో రేవంత్ సర్కారు సాగిస్తున్న ఆర్థిక అక్రమాలపై విచారణకు ఆదేశించాలని ప్రధాని మోదీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణపై ప్రధానిగా తన బాధ్యతలపై చిత్తశుద్ధి ఉంటే మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపాలని శుక్రవారం ఎక్స్ వేదికగా కోరారు. వెంటనే హెచ్‌సీయూ భూముల్లో విధ్వంసాన్ని ఆపివేయించి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదనే విషయాన్ని నిరూపించుకోవాలని సూ చించారు. వందల ఎకరాల అమ్మకం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ విధ్వసంతో పాటు రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసానికి తెరలేపిందని విమర్శించారు. ఆధారాలతో సీవీసీ, సీబీఐ, సీఎఫ్ఐవో, ఆర్బీఐకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. సుప్రీంకోర్టు పంపిన సాధికార కమిటీ సైతం రేవంత్ ప్రభుత్వ అక్రమాలను నిర్ధారించిందని పేర్కొన్నారు. స్వతంత్ర సంస్థలతో విచారణ చేయించాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో నిస్సిగ్గుగా, అక్రమంగా వ్యవస్థలను మోసం చేస్తూ పర్యావరణ, ఆర్థిక విధ్వంసం సాగిస్తున్న రేవంత్‌రెడ్డి లాంటి నాయకులను ప్రజల ఎదుట నిలబెట్టాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు.
ఒక ప్రాంతం ఆత్మ.. చరిత్ర, సంస్కృతి, వారసత్వంలో ప్రతిబింబిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. దీన్ని గుర్తించే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వారసత్వ సంస్కృతి పరిరక్షణకు నడుం బిగించిందని గుర్తుచేశారు. ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకొని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మన రాష్ట్ర చారిత్రక చిహ్నాలు, వారసత్వ సంపదను పునరుద్ధరించి తెలంగాణ సాంస్కృతిక గౌరవాన్ని కాపాడినట్టు వెల్లడించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిన ఆంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మౌనం వెనుక మర్మమేంటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నా సీఎం స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. దీని వెనుక ఆయనకు వేరే ఆలోచనలేమైనా ఉన్నాయా? అని అనుమానం వ్యక్తంచేశారు.