Telangana | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి పడకేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గత ఏడాది ఆగస్టు నుంచి కేంద్ర గ్రాంట్స్ నిలిచిపోయాయి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (ఎస్ఎఫ్సీ) గ్రాంట్స్ కూడా సుమారు ఏడాదిన్నరాగా రావడం లేదు. దీంతో గ్రామాల్లో తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్మికులకు రెండు మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. గత కొన్ని నెలలుగా పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి, సొంత డబ్బులు వెచ్చించి గ్రామాల్లో నిర్వహణ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు, ఏడాది కాలంగా జాతీయ ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులను పెండింగ్లో పెట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో 40 నుంచి 50 రకాల పనులు కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఇంకుడు గుంతలు, వైకుంఠధామాలు, ఫిష్పాండ్స్, మొకలు నాటడం, నీరు చల్లించడం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు తదితర పనులు చేపడుతుంటారు. వీటికి సంబంధించిన పనులు మెటీరియల్ కాంపోనెంట్ కింద గ్రామాల్లో సర్పంచ్లు, కాంట్రాక్టర్లు నిర్వహించారు. కానీ, సంవత్సరకాలంగా చేసిన పనులకు నిధులు విడుదల కావడం లేదు. గత సంవత్సరం మార్చి వరకే బిల్లులు క్లియర్ అయ్యాయి. అప్పటి నుంచి చేసిన పనులకు పైసా రాలేదు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద 40% నిధులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఏటా గ్రామసభలు నిర్వహిస్తూ అవసరమయ్యే పనులు, దాని ఖర్చును ముందుగానే అంచనా వేస్తారు. ఈ సారి డిసెంబర్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని అనేక గ్రామాల్లో నిర్ణయించారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉనాయి. ఒకో గ్రామంలో సుమారు రూ.10 లక్షల నుంచి రూ.50 వరకు ఖర్చుతో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మేనేజ్మెంట్ బుక్ (ఎంబీ) రికార్డులు కూడా పూర్తయ్యాయి. కానీ, ఆన్లైన్లో ఆయా పనుల వివరాలు నమోదు చేద్దామంటే ఈ నెల 29 నుంచి వెబ్సైట్ మెరాయిస్తున్నదని సీసీరోడ్లు నిర్మించినవారు చెప్తున్నారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున చేసిన పనులకు బిల్లులు అందవేమోనని ఉపాధి హామీ పథకం కూలీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.