హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది పత్తి రైతులపై కాలంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పగపట్టినట్టే కనిపిస్తున్నది. అధిక వర్షాలకు ఒకవైపు పత్తి పాడైపోతుండగా, మిగిలిన పత్తినైనా అమ్ముకుందామంటే కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతున్నది. నిన్న మొన్నటి వరకు జిన్నింగ్ మిల్లులతో పంచాయితీ కారణంగా కొనుగోళ్లను ఆలస్యం చేసింది. తాజాగా పత్తి కొనుగోళ్లలో కొత్త యాప్‌ను ప్రవేశపెట్టి మరో ఇబ్బందికి తెరతీసింది. ఈ యాప్ గండం దాటితేనే రైతులు తమ పత్తిని అమ్ముకోగలరు. ఈ సీజన్లో పత్తి కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘కపాస్ కిసాన్’ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పత్తి పంట సాగు చేసిన రైతులు ఈ యాప్‌లో ఎన్రోల్, స్లాట్ బుకింగ్‌ను తప్పనిసరి చేసింది. ఆ విధంగా చేసుకున్న రైతుల పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ కొత్త విధానంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కేంద్రం పెట్టిన ఈ నిబంధనతో చదువురాని, స్మార్ట్ఫోన్లేని రైతుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా పత్తి కొనుగోళ్లలో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కపాస్ కిసాన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు అదే యాప్‌లో పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రోజు, ఏ సమయంలో, ఏ జిన్నింగ్ మిల్లుకు పత్తి తీసుకొస్తారనే అంశాలను పొందుపరిచి స్లాట్ బుక్ చేసుకోవాలి. అలా చేస్తేనే ఆ రైతు నుంచి పత్తిని కొనుగోలు చేస్తారు. స్లాట్ బుక్ చేసుకున్న రైతులు ఆ సమయానికి అక్కడికి చేరుకోవాలి. లేనిపక్షంలో పత్తి కొనుగోలు చేయరు. లేదంటే మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
పత్తి అమ్మకాల్లో కపాస్ యాప్‌ను ప్రవేశపెట్టడం, రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ విధానంపై పత్తి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతుల్లో చాలా మంది నిరక్షరాస్యులుంటారు. చాలామంది రైతులకు ఫోన్లు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ఉండవు, దీంతో ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్ నంబర్‌తోనే యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏ విధంగా సాధ్యమవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకసారి స్లాట్‌బుక్ చేసుకున్న తర్వాత వివిధ కారణాలతో ఆలస్యంగానో లేక మొత్తానికి వెళ్లలేకపోతే, రైతులు మళ్లీ స్లాట్ బుక్ చేసుకొని వేచి చూడాలి. ఇదిలా ఉంటే సాధారణంగా రైతులు తమకు దగ్గర్లోని కొనుగోలు కేంద్రాలకు వారికి వీలైన సమయంలో పత్తి తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత యాప్‌లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుక్ చేస్తేనే కొనుగోలు చేస్తానంటే రైతులు తిరగబడే ప్రమాదం ఉన్నదని అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. యాప్‌ను ప్రవేశపెట్టిన సీసీఐ ఇప్పటివరకూ దీనిపై రైతులకు కనీస అవగాహన కల్పించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాష్టరంలో పత్తి రైతులు తమ పత్తి అమ్ముకునేందుకు నానా కష్టాలు పడాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పత్తి సాగు చేసిన రైతులు మొదటగా తమ స్మార్ట్‌ఫోన్‌లో ‘కపాస్ కిసాన్ యాప్’ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్ నంబర్ తప్పనిసరి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం రైతులు తమకు సంబంధించిన 24 అంశాలపై వివరాలను యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. రైతు పేరు, తండ్రి పేరు, జెండర్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, నివాస అడ్రస్, భూమి వివరాలు, రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం, దగ్గర్లోని మార్కెట్ పేరు, కౌలు రైతా, సొంత రైతా, పాస్‌బుక్ నంబర్, ఆ రైతుకు మొత్తం ఎంత భూమి ఉన్నది? అందులో ఎన్ని ఎకరాల్లో పత్తి సాగుచేశారు? ఏ రకమైన పత్తి సాగు చేశారు? తదితర వివరాలు నింపాలి. ఆధార్‌కార్డు, రైతు ఫొటో అప్లోడ్ చేయాలి. పైన పేర్కొన్న వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను అప్లోడ్ చేయాలి. ఇన్ని వివరాలతో రైతులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.