హైదరాబాద్, ఫిబ్రవరి 3(నమస్తేతెలంగాణ): ‘ప్రభుత్వం ప్రకటించిన కులగణన సర్వే నివేదికలో కులాలవారీగా లెక్కలు ఏవి? లక్షలాది కుటుంబాలను విస్మరించిన ఈ సర్వేకు శాస్త్రీయత ఎక్కడిది? అసలు ఈ సర్వే నివేదిక ఒక తప్పుల తడక’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే బీసీల సంఖ్యను తక్కువగా చూపారని విమర్శించారు. ముస్లింల సంఖ్యను 2011 జనాభా లెక్కల కంటే ఈసారి తక్కువగా చూపారని ఆక్షేపించారు. నివేదికలోని వివరాలను పరిశీలిస్తే ప్రభుత్వం బీసీలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేరకు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ నుంచే బీసీ ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. 1,500 పేజీలున్న సర్వే నివేదికపై అసెంబ్లీలో చర్చించేందుకు సర్కారు ఒకరోజే సమావేశాలు నిర్వహిం చాలనుకోవడం విడ్డూరమని పేర్కొన్నారు.
ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది తర్వాత మేల్కొని సర్వే నిర్వహించి, ఇప్పుడు హడావుడిగా చర్చ చేపట్టడంలోని అంతర్యమేమిటని ప్రశ్నించారు. తూతూమంత్రంగా చర్చపెట్టి కేంద్రానికి పంపి చేతులు దులుపుకొనేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. కోర్టు కేసులను సాకుగా చూపి బీసీ రిజర్వేషన్లను ఎగ్గొట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వం తిరిగి సర్వే నిర్వహించి శాస్త్రీయ పద్ధతిలో వివరాలు సేకరించాలన్నారు. చేతగాదని చెబితే బీఆర్ఎస్కు సర్వే నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, నాయకులు గట్టు హన్మంతు, యాదయ్య పాల్గొన్నారు.