Telangana | హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి కులగణన సర్వే ప్రారంభం కానున్నది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు ఇండ్ల జాబితా నమోదు (హౌస్లిస్టింగ్) కార్యక్రమం చేపడతారు. గ్రామ పంచాయతీ/ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామం (ఆవాసం) పేర్లను కోడ్రూపంలో, వార్డు నంబర్, ఇంటి నంబర్, వీధి పేరు కూడా నమోదు చేస్తారు. ఈ నెల 9 నుంచి ప్రభుత్వం ముద్రించిన ఫార్మాట్లో కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించి నమోదు చేస్తారు. 56 ప్రధాన ప్రశ్నలు, 19 అనుబంధ ప్రశ్నలు కలిపి మొత్తం 75 ప్రశ్నలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. పార్ట్-1, పార్ట్-2 కింద 8 పేజీల్లో ఆయా వివరాలు పొందుపరుస్తారు.
ఆధార్, ధరణి పాస్బుక్, సెల్ఫోన్ నంబర్లు కూడా నమోదు చేసుకుంటారు. మొత్తం వివరాలు పూర్తి అయ్యాక, తాను చెప్పిన వివరాలన్నీ నిజమేనని ప్రకటిస్తున్నట్టుగా కుటుంబ యజమాని సంతకం తీసుకుంటారు. ఒక్కో కుటుంబం వివరాల నమోదుకు 10-20 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నది. ఆ ధార్కార్డులు, ధరణి పాస్బుక్లు దగ్గరపెట్టుకుంటే ఎన్యూమరేటర్లు వచ్చినప్పు డు వివరాలు చెప్పడం సులభమవుతుం ది. ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించేందుకు ఎన్యూమరేటర్లకు 30 రోజుల గడువు కేటాయించారు. ఒక్కో ఎన్యూమరేటర్ 150 ఇండ్లను సందర్శించాలి.
రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు 80 వేల మంది ఎన్యూమరేటర్లను ప్రభుత్వం నియమించింది. వీరిలో సగానికిపైగా టీచర్లు, కార్యదర్శులు, గ్రామస్థాయి సిబ్బంది ఉన్నారు. మండలస్థాయిలో సర్వే పర్యవేక్షణకు సుమారు ఎనిమిది వేల మందిని సూపర్వైజర్లుగా నియమించారు. నోడల్ ఆఫీసర్లుగా మరో 620 మందిని నియమించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో అదన పు కలెక్టర్ల పర్యవేక్షణలో సమగ్ర ఇంటిం టి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రణాళిక, గణాంకశాఖ డైరెక్టర్ పీ రూఫస్దత్తమ్ తెలిపారు. వివరాలను మండలాల వారీగా కంప్యూటర్లో నమోదు చేస్తామని పేర్కొన్నారు.