Dairy Farmers | హైదరాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): విజయ డెయిరీ అధికారుల నిర్లక్ష్య వైఖరి.. పాడి రైతుల ఆగ్రహానికి దారితీస్తున్నది. కనీస మర్యాద లేకుండా ప్రవర్తించటంపై మండిపడుతున్నారు. ఆఫీసుకు వెళ్లినా.. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఫైర్ అవుతున్నారు. ఇటీవల ఓ పాడి రైతు పాల బిల్లుల కోసం విజయ డెయిరీ ద్వితీయ శ్రేణి ఉన్నతాధికారికి చాలామార్లు ఫోన్లు చేసినా.. ఆ అధికారి లిఫ్ట్ చేయలేదు. దీంతో విసుగు చెందిన రైతు తన గోడును తోటి రైతులతో పంచుకున్నారు. ఇప్పుడీ కాల్ రికార్డు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యింది. రైతు మాట్లాడిన మాటలు…‘ఆ సారు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. ఆఫీసుకు వెళ్లినా కలవటం లేదు. ఇంకో నంబర్ నుంచి ఫోన్ చేస్తే కహానీలు చెప్పి తప్పించుకుంటున్నడు. కనీసం ఫోన్ లేబట్టి… ‘పాల బిల్లులు ఫలాన రోజు వరకు వస్తాయి. అప్పటి వరకు మీకేమైన ఆర్థిక సర్దుబాట్లు ఉంటే చూసుకోండి’ అని చెబితే బాగుండేది. సమాధానం చెప్పేందుకూ ఇష్టపడటం లేదు. అందుకే ఉన్నతాధికారులతోపాటు జిల్లా అధికారులంతా పొద్దుందాక(పగటిపూట) ఫోన్లు ఎత్తడం లేదు కాబట్టి రాత్రిపూట ఫోన్లు చేసి వారిని లేపండి. పాల బిల్లులపై సమాధానం చెప్పే వరకు ఫోన్లు చేయండి’ అంటూ తోటి రైతులకు పిలుపునిచ్చాడు.
విజయ డెయిరీలోని కొందరు అధికారులు పాడి రైతులను చిన్నచూపు చూస్తూ అవహేళను గురి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాల బిల్లులు, ఇతర సమస్యలపై ఆఫీసుకు వచ్చిన రైతులను గంటల తరబడి కూర్చోబెట్టి తిప్పి పంపేస్తున్నట్టుగా సమాచారం. ఓ ద్వితీయ స్థాయి అధికారైతే.. మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. ‘మా వల్లే వాళ్లకు జీతాలు వస్తున్నాయనే విషయం మర్చిపోయి మమ్మల్నే నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్లంతా అక్కడ ఎవరి కోసం ఉన్నారు. మాకు సమాధానం చెప్పుకుండా ఇంకేం చేస్తరు’ అంటూ రైతులు మండిపడుతున్నారు.
గతంలో 15 రోజులకోసారి పాల బిల్లులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యేవి. ఇప్పుడు నెలలు గడుస్తున్నా.. బిల్లులు పడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రైతులు ధర్నా చేస్తే ఒక బిల్లు చెల్లించారు. ఇటీవల మరో బిల్లు చెల్లించారు. అయినప్పటికీ ఇంకా మూడు బిల్లులు, సుమారు రూ.70 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నట్టుగా తెలిసింది. దీంతో దానా, బ్యాంకు రుణాలు ఇతరత్రా అవసరాలకు డబ్బుల్లేక పాడిరైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.