Assembly Budget Session | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత అసెంబ్లీ సెషన్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు రద్దు చేసిన స్పీకర్.. తాజాగా సోమవారం మరోసారి రద్దుచేస్తున్నట్టు ప్రకటించడంతో ఈ సీజన్లో మూడుసార్లు ప్రశ్నోత్తరాలు రద్దు చేసినట్టయ్యింది. దీనిపై బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తంచేసింది.
ప్రభుత్వం తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోతున్నదని ఆరోపించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తమ నియోజకవర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది. ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తేనే ప్రజాసమస్యలు చర్చకు వస్తాయని పేర్కొంటున్నారు. సోమవారం అసెంబ్లీలో పురపాలక, పట్టణాభివృద్ధి, సోషల్, ట్రైబల్, మైనార్టీ వెల్ఫేర్, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల పద్దులపై చర్చ జరుగనున్నది.