ఒకవైపు అసమ్మతి కార్చిచ్చు.. మరోవైపు సర్వేల్లో ప్రస్ఫుటిస్తున్న ప్రజావ్యతిరేకత.. వెరసి కాంగ్రెస్ క్యాడర్లో అంతర్మథనం మొదలైంది. కొందరు మంత్రుల అవినీతి, కొందరు ఎమ్మెల్యేల అసంతృప్తి.. క్యాడర్‌ను పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టింది. ప్రభుత్వం తమదేనని చెప్పుకోవడమేగాని పథకాల్లోనూ వారికి దక్కిందేమీ లేదు. కేసీఆర్ హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా తమకు దక్కిన సంక్షేమ ప్రయోజనాలు కూడా కాంగ్రెస్ సర్కారు కోతలు, కొర్రీలతో దక్కకుండా పోతున్నాయన్నది అత్యధికుల అభిప్రాయం. దీనికితోడు ఏండ్ల తరబడి పార్టీ కోసం శ్రమించిన తమను కాదని.. పక్క పార్టీల నుంచి వచ్చి చేరిన వలస ఎమ్మెల్యేలు, నేతలకు పెద్దపీట వేస్తుండటం కూడా వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నది.
Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌లో క్యాడర్ రగిలిపోతున్నది. పార్టీ పెద్దల పనులు క్షణాల్లోనే జరిగిపోతుంటే తమ పనులేమో పాతరబడిపోతున్నాయని ఎమ్మెల్యేల నుంచి చోటామోటా లీడర్లలో ఆవేదన నిండిపోయింది. అటు ఏ పనులూ కాక.. ఇటు ఎలాంటి సంపాదన లేక పార్టీ, ప్రభుత్వ పెద్దలపై కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు కన్నెర్రజేస్తున్నారు. ‘అధికారంలో ఉన్నా ప్రయోజనం లేదు. చిన్నచిన్న పనులు కూడా కావడం లేదు. పనుల కోసం పోతే మమ్ములను కూడా కమీషన్లు అడుగుతున్నరు. కేసీఆర్ సర్కారులోనే మంచిగుండె.. కనీసం అర్నెళ్లకోసారి రైతుబంధు పైసలైనా కచ్చితంగా వచ్చేవి. మా ప్రభుత్వంలో వాటికి కూడా దిక్కులేదు. ఈ జెండా ఎందుకు మోయాలి? వీళ్లకు బానిసత్వం చేయాలా?’ అంటూ తమ ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు.
తమ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషం ఆర్నెళ్లలోనే ఆవిరైపోయిందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు. అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుందని, ఆర్థికంగా స్థి రపడొచ్చని ఆశపడ్డామని, కానీ, ప్రభుత్వం లో ఏ ఒక్కపనీ కావడంలేదని నిట్టూర్చుతున్నారు. కనీసం గౌరవం కూడా దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ ని కాపాడుకున్నామని, అధికారంలోకి వచ్చా క లాభపడతామని భావించామని, కానీ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉన్నదని చెప్తున్నారు.
సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే తమ కా ర్యకర్తలకు ఇందిరమ్మ ఇండ్ల కోసం సీఎంని కలిసి జాబితా ఇచ్చారు. వెంటనే సీఎం రేవంత్ సీఎంవో అధికారిని పిలిచి పనిచేయాలని చెప్పారు. ఇదే విషయాన్ని సదరు ఎమ్మెల్యే తమ జిల్లాలో కీలక అధికారిని కలిసి వివరించి ఆయనకు కూడా జాబితా ఇచ్చారు. ఆ తర్వాత సదరు అధికారి సీఎం వో అధికారికి ఫోన్‌చేసి ఎమ్మెల్యే జాబితా గురించి చెప్పి ‘చెయ్యిమంటరా?’ అని అడిగారు. వెంటనే ‘నీకు ఉద్యోగం కావాలా? లేక ఎమ్మెల్యే కావాలా?’ అని సీఎంవో అ ధికారి నుంచి ప్రశ్న ఎదురైంది. దీంతో ఆ ఎమ్మెల్యే ఇచ్చిన జాబితాను చెత్త బుట్టలో పడేశారు.
మరో ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కుటుంబం కోసం ఓ కొత్త కారు కొనాలని అనుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నాం కదా ఏదైనా పని వస్తే కారు కొనాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యే కు ఒక్కటంటే ఒక్క పని కూడా కాలేదు. దీంతో తన కుటుంబం ఒత్తిడి భరించలేక అప్పు చేసి కారు కొన్నాడు.
మరో ఎమ్మెల్యే ఎన్నికల ముందు ప్రచా రం, ఖర్చుల కోసం రూ.1.5 కోట్ల అప్పు చేశాడు. గెలుస్తాం.. అధికారంలోకి వస్తాం.. పనులు చేసుకొని సంపాదించొచ్చు అనే ధీమాతో 1.5 కోట్లకు 3 కోట్ల రూపాయలు ఇస్తానని మాటిచ్చారు. అధికారంలోకి వ చ్చారు కానీ పనులు కావడం లేదు. సంపాదన పెరగలేదు. 3 కోట్ల సంగతి దేవుడెరుగు.. అసలు కూడా ఇవ్వకుండా తప్పించుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.
మంత్రులు పార్టీ కార్యకర్తలను, లీడర్లను పూర్తిగా దూరం పెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏవైనా చిన్నాచితకా పనుల కోసం అడిగితే అప్పుడు ‘చూద్దాంలే’ అంటూ చెప్తున్న మంత్రులు, ఆ తర్వాత వారి ని పూర్తిగా దూరం పెడుతున్నారు. కనీసం అ పాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని కిందిస్థాయి లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓ మంత్రికి చెందిన వందల కోట్ల బిల్లులు చకాచకా రిలీజ్ అవుతున్నాయి. కోట్లకు కోట్ల బిల్లులు ఇప్పించినందుకు మరో కీలక నేతకు 8-10 శాతం కమీషన్ ముడుతున్నది. ఇలా పెద్దల పనులేమో క్షణాల్లో జరిగిపోతుంటే ఎ మ్మెల్యేలు, చోటామోటా లీడర్ల పనులు పెం డింగ్లోనే ఉంటున్నాయి. అటు పనులు కాక, ఇటు సంపాదన లేక క్యాడర్ మొత్తం పార్టీ, ప్రభుత్వ పెద్దలపై గుస్సా అవుతున్నది. ఓ కీలక మంత్రికి గత ప్రభుత్వంలో, ఇప్పుడు కూడా ఆయనకు కోట్లకు కోట్ల బిల్లులు మంజూరవుతున్నాయని చెప్తున్నారు. ఆయనతో పాటు ఆంధ్రా కాంట్రాక్టర్ల బిల్లులు ఆగమేఘాలపై విడుదలవుతున్నాయని, బిల్లులు చెల్లించినందుకు ఓ మంత్రి 8-10 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
తమ పార్టీ పాలనతో పోల్చితే కేసీఆర్ పాల నే బాగుందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బాహాటంగానే చెప్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఓ రెడ్డి సామాజిక వర్గం లీడర్ మాట్లాడుతూ ‘కేసీఆర్ సారే నయం ఉండె. కనీసం అప్పుడు సమయానికి రైతుబంధు పైసలైనా వచ్చేవి. ఇప్పుడు మాకు పనులు అయితలేవు.. రైతుబంధు పైసలు కూడా దిక్కులేవు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ‘ఫాంహౌస్ పాలన బాగుందా? ప్రజాపాలన బాగుందా’ అంటూ సర్వే చేసింది. ఈ సర్వేలో 70 శాతానికి పైగా ఫౌంహౌస్ పాలనే బాగున్నదంటూ నెటిజన్లు ఓట్లు వేశారు. దీనిపై స్పందించిన ఓ కాంగ్రెస్ నేత ‘అవును.. ఆ సర్వే వెయ్యి శాతం వాస్తవం. కేసీఆర్ పాలనే బాగుంది. కేసీఆర్‌కు మద్దతుగా మా పార్టీ కార్యకర్తలు కూడా ఓటు వేశారు. కాంగ్రెస్ పాలనను వ్యతిరేకించారు’ అని కుండబద్దలు కొట్టారు.
సాధారణంగా ఏ ప్రభుత్వంలో అయినా చిన్నచిన్న పనులను కింది స్థాయి లీడర్లకు, కేడర్‌కు అప్పగిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ స్థాయి పనులను కార్యకర్తలకు అప్పగించేవారు. కానీ కాంగ్రెస్ పాలనలో ఇందుకు పూర్తి విరుద్ధంగా ఎంత చిన్న పనైనా సీఎం, మంత్రులు, వాళ్ల బంధువులు, ముఖ్యనేతలే చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
పనుల కోసం మంత్రులు, ముఖ్యనేతల వ ద్దకు వెళ్లిన లీడర్లను సాధారణ వ్యక్తుల్లానే పరిగణిస్తున్నారు. అందరి మాదిరిగానే తమ వద్ద కూడా పనుల కోసం అధికారులు లంచాలు అడుగుతుంటే కీలక నేతలు కమీషన్లు అడుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీలోనే ఉంటూ కప్పం కట్టాలా?, లంచాలు, కమీషన్లు ఇవ్వాలా? అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు సీఎం, మం త్రులు, కీలక నేతలపై అభిమానంతో చాలా మంది పార్టీ కార్యకర్తలు, లీడర్లు వారితో దిగిన ఫొటోలను వాట్సాప్, ఫేస్బుక్ డీపీలుగా పెట్టుకున్నారు. కొన్ని రోజులుగా ఈ డీపీలను తొలగించుకుంటున్నారు.
కాంగ్రెస్ పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్నా చాలా మంది పార్టీని అంటిపెట్టుకొనే ఉన్నారు. ఆస్తులను అమ్మి, అప్పులు చేసి పార్టీని నడిపించారు. అధికారంలోకి వచ్చాక మంచి రోజులు రాకపోతాయా? అనే నమ్మకంతో ఈ పని చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మళ్లీ అవే అప్పులు చేస్తున్నట్టు వాపోతున్నారు. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ అప్పు చేయాల్సి వస్తున్నదని ఓ రెండోస్థాయి నేత తన ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రయోజనం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో లీడర్లు, కార్యకర్తలు మండిపోతున్నారు. పార్టీపై, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎందుకు వీళ్లను గెలిపించామా?’ అంటూ మధన పడుతున్నారు. ‘వాళ్ల లాభం కోసం మా జీవితాలను నాశనం చేసుకోవాలా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీ జెండా మోసినందుకు కష్టాలే మిగిలాయని, ఇప్పుడు కూడా కష్టాలు తప్పడం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘ఇలాంటి వారి కోసం జెండా ఎందుకు మోయాలి? మేమేమైనా బానిసలమా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.