హైదరాబాద్, ఏప్రిల్14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు (రిజర్వేషన్ల హేతుబద్దీకరణ) చట్టం-2025 పేరిట గెజిట్ విడుదల చేసింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చినట్టు స్పష్టంచేసింది. ఎస్సీలకు ఇప్పటివరకు ఉమ్మడిగా అమలైన రిజర్వేషన్లు, ఇకపై గ్రూపులవారీగా అమలు కానున్నాయని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 59 షెడ్యూల్డ్ కులాలు ఉండగా ఇప్పటివరకు ఆ కులాలకు 15శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నది.
ప్రస్తుతం మొత్తం షెడ్యూల్డ్ కులాలను వాటి జనాభా, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా 3 గ్రూపులుగా ప్రభుత్వం విభజించింది. విద్యా, ఉద్యోగ నియామకాల్లో, స్థానిక సంస్థల్లో ఇతర వాటిల్లో సవరించిన రిజర్వేషన్లను మాత్రమే పాటించాలని గెజిట్‌లో వెల్లడించింది. గెజిట్‌తో పాటుగా రిజర్వేషన్ల అమలుకు మార్గదర్శకాలను, ప్రభుత్వ సర్వీస్ నియమకాల కోసం రోస్టర్ పాయింట్లను కూడా సవరిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు విడుదల చేసింది.
ఎస్సీ రిజర్వేషన్ ఉప వర్గీకరణ చట్టం గెజిట్ కాపీపై మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సోమవారం చర్చించింది. గెజిట్ తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేసింది. అనంతరం ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 2026 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రంలో ఎస్సీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్ శాతాన్ని పెంచుతామని తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి విద్యా, ఉద్యోగ అవకాశాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించామని, ప్రభుత్వం చేపట్టిన వర్గీకరణ ఏ కులానికీ వ్యతిరేకంకాదని చెప్పారు. వర్గీకరణ కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరులకు నివాళి అర్పించారు.