హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల సందడి ముగింపు దశకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మే యర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రి య మూడు మున్సిపాలిటీలు మినహా అన్ని చోట్ల పూర్తయింది. ఎన్నికలు నిర్వహించిన 116 పురపాలికలు, ఏడు నగరపాలికలు కలి పి మొత్తం 123 స్థానాలకుగాను 120 స్థానా ల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసింది.
ఈ మేరకు ఎస్ఈసీ కార్యదర్శి లింగ్యానాయక్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. సోమవారం వాయిదా పడిన 11 ము న్సిపాలిటీల్లో మంగళవారం ఎన్నికలు నిర్వహించగా ఇల్లందు, సుల్తానాబాద్, కాగజ్‌నగర్, జహీరాబాద్, డోర్నకల్, తొర్రూర్, జనగామ(ఎనిమిది చోట్ల)లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇల్లందు, సుల్తానాబాద్, జహీరాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీల్లో ఇతర పార్టీ మద్దతుతో చైర్పర్సన్ పీఠాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇంద్రేశం పురపాలికలో చైర్పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌గా బీ ఆర్ఎస్ అభ్యర్థులు కుశాంగల ప్రమీల, పట్లోళ్ల హరీశ్‌రెడ్డి ఎన్నికయ్యారు. తొర్రూర్, జనగామ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు రాగా, లాటరీ తీశారు. ఈ రెండు చోట్ల కాంగ్రెస్‌నే అదృష్టం వరించింది. మిగిలిన మూడు చోట్ల ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్‌లో అనివార్య కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.
ఆ మూడు చోట్ల 20న ఎన్నికలు
వాయిదా పడిన ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో త్వరలో నే జరుగనున్నది. ఆయాచోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియపై ఆయా జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరణాత్మక లేఖ రాయనున్నారు. ఈ మూడు చోట్ల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశాన్ని ఎస్ఈసీ డిసైడ్ చేయనున్నది. ఈ నెల 21న ఎస్ఈసీ కమిషనర్ రాణికుముదిని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున 20వ తేదీన ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి.