BRS | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి బీఆర్ఎస్ది.. ప్రచారం కాంగ్రెస్‌ది.. అన్న చందంగా ఉంది దేవాదాయ శాఖ విడుదల చేసిన వార్షిక ప్రగతి నివేదిక. గత బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ తమ ఖాతాలో వేసుకొని తామే చేసినట్టు చెప్పుకొచ్చారు. యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ ఆలయాలే కాదు.. పల్లెల్లోని చిన్నచిన్న ఆలయాల్లోనూ నిత్యం దీపారాధన జరుగాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధూప దీప నైవేద్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే, గత ఏడాదిగా ఆలయాల అభివృద్ధికి ఏ ఒక్క చెప్పుకోదగ్గ కార్యక్రమాన్ని చేపట్టని కాంగ్రెస్ ప్రభుత్వం.. గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తామే చేసినట్టుగా చెబుతూ డిసెంబర్ 2023-డిసెంబర్ 2024 ప్రగతి నివేదికను విడుదల చేయడం గమనార్హం.
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన సమ్మక్క సారలమ్మ, బోనాల పండుగలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చి ఘనంగా నిర్వహించింది. వీటికోసం ప్రభుత్వం ఏటా ప్రత్యేక నిధులు కేటాయించింది. కార్తీకమాసంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో సామూహిక కార్తీక దీపోత్సవాలను ప్రారంభించింది. స్వరాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల ఒడ్డున పుణ్యస్నానాల కోసం ప్రత్యేక స్నానఘట్టాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని వేలాది ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. వాటిని కాపాడే ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ భూములకు దేవుడినే యజమానిగా చేస్తూ ఆ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. రెవెన్యూ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటుచేసి ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. భూములను ఎవరైనా కబ్జాచేస్తే కఠిన శిక్షలకు చర్యలు చేపట్టింది.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సుమారు రూ.1200కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కింది. దేశంలోని ప్రధాన ఆలయాలకు తీసిపోకుండా ఈ ఆలయాన్ని అధునాతన పద్ధతుల్లో పునరుద్ధరించింది. స్వర్ణ గోపురం నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి స్వయంగా అప్పటి సీఎం కేసీఆర్ తనవంతుగా బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. కురవి వీరన్న ఆలయంతోపాటు పలు ఆలయాలకు కానుకలు సమర్పించిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కింది. భద్రాచలం సీతారామచంద్ర స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయించి అభివృద్ధికి ప్రణాళికలు వేసింది. దైవదర్శనం, ఇతర సేవలకు ఆన్లైన్ విధానం, వెబ్ కెమెరాల సాయంతో పూజలతోపాటు ఇతర సేవలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసింది. వాస్తవాలు ఇలా ఉంటే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆలయాల అభివృద్ధి అంతా తామే చేసినట్టుగా ఏడాది నివేదిక వెల్లడించడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.