హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ తెలంగాణ భవన్ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కాంగ్రెస్‌కు తనదైన శైలిలో చురకలు అంటించారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులకు జలపాఠాలను బోధించారు. ప్రాజెక్టుపై హస్తం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఆధారాలతో సహా విడమరిచి చెప్పారు. ప్రాజెక్టుపై కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను గులాబీ శ్రేణులకు విడమరచి చెప్పారు. ఈ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, రాష్ట్ర నాయకులు, వివిధ చానళ్లలో చర్చల్లో పాల్గొనే పార్టీ ప్రతినిధులు, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ భారీగా తరలివచ్చారు. ప్రాజెక్టుపై ఇచ్చిన ప్రజెంటేషన్‌ను ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. సీఎంగా కేసీఆర్ కృషిని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాశస్త్యన్ని, సాధించిన ఫలితాలను హరీశ్‌రావు వివరిస్తుంటే కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. వివరాలను నోట్ చేసుకున్నారు. ప్రజెంటేషన్ అనంతరం హరీశ్‌రావును వారంతా ప్రత్యేకంగా అభినందించారు.