హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ బోగస్ అయింది. సన్నాలు సాగు చేస్తే బోనస్ వస్తదని ఆశపడిన రైతులకు సర్కారు సున్నం పెట్టింది. తద్వారా సన్నధాన్యం పండించిన రైతులకు సర్కారు ఎగ్గొట్టిన బోనస్ అక్షరాలా రూ.1,561 కోట్లు! వానకాలం సీజన్లో 50 లక్షల టన్నుల సన్నాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, కొనుగోలు చేసింది కేవలం 18.78 లక్షల టన్నులే. ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా 50 లక్షల టన్నుల సన్నాలు కొనుగోలు చేసి ఉంటే, రైతులకు బోనస్ కింద రూ.2,500 కోట్లు అందేవి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం 18.78 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయడంతో సన్నాలు అమ్మిన రైతులందరికీ ప్రభుత్వం అందించే బోనస్ కింద రూ.939 కోట్లు మాత్రమే అందనున్నాయి. ప్రభు త్వం సన్నాల లక్ష్యంలో 31.22 లక్షల టన్నులు తక్కువగా కొనుగోలు చేసింది. దీంతో రైతులు ప్రభుత్వం నుంచి పొందాల్సిన రూ.1,561 కోట్ల బోనస్‌ను కోల్పోయారు. కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి బోనస్‌గా ఇవ్వాల్సిన రూ.939 కోట్లలో ఇప్పటివరకు రూ.591 కోట్లు చెల్లించిన ప్రభుత్వం మరో రూ.348 కోట్లు బకాయి పెట్టింది.
సన్నాల కొనుగోలులో నిర్లక్ష్యం
రైతుల నుంచి సన్న ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి అక్టోబర్ 1వ తేదీన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో అంతులేని జాప్యం ప్రదర్శించింది. దీంతో చాలామంది రైతులు సన్న ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు సన్నాలన్నీ ప్రైవేట్‌కు వెళ్లిపోయిన తరువాత ప్రభుత్వం కేంద్రాల్లో కొనుగోళ్లలో వేగం పెంచింది. ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచే ప్రాణాళిక ప్రకారం ప్రచారం చేసి సన్నాలు కొనుగోలు చేస్తే రైతులకు ఎంతో మేలు జరిగేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్పత్తి 156 లక్షల టన్నులు.. కొన్నది 47 లక్షలే
ఈ వానకాలం సీజన్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 66.78 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందని, తద్వారా గతంలో ఎప్పుడూ లేని విధంగా 156 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపింది. కానీ, ఈ సీజన్లో ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం 47 లక్షల టన్నులు మాత్రమే. మొత్తం ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం 30 శాతం మాత్రమే కావడం గమనార్హం. ఈ లెక్కన ప్రభుత్వం ఇంకా 109 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా వదిలేసింది. ఇందులో సుమారు 10-15 లక్షల టన్నుల ధాన్యం రైతులు తమ అవసరాలకు ఉంచుకున్నా.. ఇంకా 94 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయని ధాన్యాన్ని రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయించుకున్నారు. మద్దతు ధర దక్కపోయినా క్వింటాల్ ఒక్కంటికి రూ.300-400 నష్టపోయి అమ్ముకున్నారు. ప్రభుత్వం పక్కాగా కొనుగోళ్లు చేసి ఉంటే కనీసం 80-90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అవకాశం ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.