ఆర్మూర్‌టౌన్, సెప్టెంబర్ 10: కాంగ్రెస్ పార్టీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం బీసీలంతా పోరాడాలని, కాంగ్రెస్ పార్టీ కళ్లు తెరిపించడానికి మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మంగళవారం నిర్వహించిన ‘బీసీ సదస్సు’లో రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులుతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ల కోసం వెనుకబడిన వర్గాలంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని, పోరాటాలతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా కుల గణన చేయక పోవడం వల్ల బీసీలు భారీగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల జనాభా 50 శాతానికిపైగా ఉన్నా రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. జనాభా ప్రకారం న్యాయమైన వాటా దక్కాలంటే సమగ్ర కుల గణన ఒక్కటే మార్గమని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయడానికి రేవంత్‌రెడ్డికి వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు. మండల్ కమిషన్ రిపోర్టును బుట్టదాఖలు చేశారని, నాటి ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ రిజర్వేషన్లు అడ్డుకోవడంతో ఓబీసీలు భారీగా నష్టపోయారని తెలిపారు. మరోసారి బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని విమర్శించారు.
సమగ్ర కులగణన లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. ఈ సదస్సులో హిందు బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్, సోషల్ జస్టిస్ పార్టీ జాతీయ కన్వీనర్ పిడికిలి రాజు, టీ-జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, తెలంగాణ బీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంమ్మూర్తిగౌడ్, ఓబీసీ జేఏసీ చైర్మన్ అన్వర్ వేణుకుమార్, అంబేద్కర్ ఆజాదీ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు కొంగర నరహరి, కుల సంఘాల నాయకులు దేగాం యాదగౌడ్, కోటగిరి రామగౌడ్ పాల్గొన్నారు.