BJP | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : కమలం కకావికలమైనట్టు కనిపిస్తున్నది. రాష్ట్ర అధ్యక్షుడు మొదలు ముఖ్య నేతలంతా సైలెంట్ కావడంతో దిశానిర్దేశనం చేసేవారు కరువైనట్టు తెలుస్తున్నది. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయిన తర్వాత పార్టీపై పెద్దగా దృష్టిసారించడం లేదని పార్టీ నాయకులే చెప్తున్నారు. మొక్కుబడిగా సమీక్షలు తప్ప, కార్యాచరణ రూపొందించి అమలు చేయడంలో విఫలమవుతున్నారని పేర్కొంటున్నారు. సంక్రాంతి తర్వాత పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తాడనే ప్రచారం నేపథ్యంలో నేతలు సైతం ఆయన ఆదేశాలను సీరియస్‌గా తీసుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పేరుకే ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వారి మధ్య సమన్వయం లేదని చెప్పుకుంటున్నారు. తమకే పేరు రావాలని.. ఎవరికి వారే పోటీ పడుత్నుట్టు విమర్శిస్తున్నారు. అందరూ రాష్ట్ర నేతలమని చెప్పుకుంటారని, బండి సంజయ్ మినహా మిగతా నేతలెవరూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదని, అందరూ తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారని చెప్తున్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన విషయం పార్టీ పెద్దలకు తెలియదని సమాచారం.
నవోదయ పాఠశాలల మంజూరు నేపథ్యంలో కలిసినట్టు చెప్తున్నా.. దాని వెనున ఉద్దేశం వేరే ఉందనే ప్రచారం ఉన్నది. అర్వింద్‌ను కొన్నాళ్లుగా పార్టీలో పక్కనబెట్టి నిజామాబాద్‌కే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పెద్దలకు జలక్ ఇచ్చేందుకు సీఎంను కలిశారనే ప్రచారం జరుగుతున్నది. ఇక ఎమ్మెల్యేల్లో రాజాసింగ్ ఎప్పటి నుంచో దూరంగా ఉంటుండగా.. మిగతా ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు మినహా మిగతా వాళ్లంతా ‘ఎవరికి వారే’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో ఇక నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా.. ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి ఏ ఒక్క కార్యక్రమాన్ని చేపట్టలేదని గుర్తుచేస్తున్నారు. నేతలు ప్రెస్మీట్లకే పరిమితమవుతున్నారని విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు ఎలా సన్నద్ధమవుతారని ప్రశ్నిస్తున్నారు.