జయశంకర్ భూపాలపల్లి, జనవరి 12 (నమస్తే తెలంగాణ)/హన్వాడ: దళితబంధు పథకాన్ని కొనసాగించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. దళితబంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు భూపతి రాజు మాట్లాడుతూ.. దళితులను రాజు చేయడమే లక్ష్యంగా పాలకులు పనిచేయాలే తప్ప దిగజార్చేలా ఉండకూడదని సూచించారు. దళితబంధును కొనసాగించి అర్హులైన లబ్ధిదారులందరికీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల పరిషత్ కార్యాలయం ఎదుట దళిత నాయకులతో కలిసి లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంబులయ్య మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ సర్కారు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. హన్వాడ మండలంలో ఎంపికైనవారికి నిధులు ఇవ్వాలని కోరారు.