హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): బనకచర్ల అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు. నమ్మించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి రహస్య ఎజెండాతో, సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని బలిపెడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బనకచర్ల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ఎంత మాట్లాడినా, ఆయనకు మద్దతుగా పార్టీ నేతలు గాని, మంత్రులు గాని మాట్లాడకపోవడానికి కారణం ఇదేనని సమాచారం. తద్వారా సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని వారు పరోక్షంగా చెప్తున్నట్టేనని అంటున్నారు. ఉదాహరణకు, గతంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బనకచర్లపై పదేపదే మాట్లాడేవారని, కానీ ఢిల్లీలో సమావేశం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన బనకచర్లపై నోరెత్తడం లేదని గుర్తుచేస్తున్నారు.
బనకచర్లను ఒప్పుకొనేది లేదని, ఆ అంశంపై చర్చించే ప్రసక్తే లేదంటూ ఇక్కడ బీరాలు పలికిన సీఎం.. తీరా 16న ఢిల్లీకి వెళ్లి తెలంగాణ గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పనంగా అప్పగించారని పలువురు కాంగ్రెస్ నేతలే విమర్శిస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టారని, తమను నమ్మించి మోసం చేశారని సీనియర్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. గురుశిష్యులైన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కలిసి ఆడిన నాటకంలో కాంగ్రెస్ పార్టీ అడ్డంగా బుక్కయిందా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. భేటీ సందర్భంగా ఇద్దరి ముఖాలు వెలిగిపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా చెప్పుకొంటున్నారు.
ఎజెండాలో బనచర్ల అంశం ఉంటే సమావేశానికి హాజరు కానని, ఒకవేళ ప్రస్తావన తెస్తే బాయ్‌కాట్ చేస్తానని హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. తీరా ఢిల్లీకి వెళ్లిన తర్వాత సమావేశ ఎజెండాలో బనకచర్ల అంశం ఉందని తెలిసీ ఎందుకు హాజరయ్యారని ప్రశ్నిస్తున్నారు. అక్కడితో ఆగకుండా కమిటీ ఏర్పాటుకు అంగీకరించడం రేవంత్‌రెడ్డి చేసిన పెద్ద తప్పిదమని మండిపడుతున్నారు. అంతే కాకుండా కమిటీ ఏది చెప్తే దానికి అంగీకరిస్తామంటూ సంతకం చేయడం మరో అతి పెద్ద తప్పని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను ఆంధ్రాకు ధారాదత్తం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బనకచర్ల ద్వారా తెలంగాణ జలాలను ఏపీ ఎత్తుకెళ్లిపోతుందంటూ బీఆర్ఎస్ గొంతెత్తి అరిచింది. ‘నమస్తే తెలంగాణ’లో అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఏపీ చేస్తున్న ద్రోహాన్ని తెలంగాణ నీటిపారుదలశాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు ఎండగట్టారు. దీంతో అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడం, కాంగ్రెస్ ఇరాకటంలో పడడంతో సీఎం రేవంత్‌రెడ్డి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే బనకచర్లతో తెలంగాణకు జరిగే నష్టంపై అన్ని పార్టీల ఎంపీలకు తొలుత సచివాలయంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులందరికీ ప్రజాభవన్‌లో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ విధంగా పలుసార్లు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి చంద్రబాబు సమక్షంలో సంతకాలు చేసొచ్చారని మండిపడుతున్నారు. అంటే బనకచర్లను వ్యతిరేకిస్తూ ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లన్నీ ఉత్తవేనా?, ఇవన్నీ తమను మభ్యపెట్టేందుకేనా? అని మండిపడుతున్నారు.