వేములవాడ, నవంబర్ 20: వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రహదారిలో బహుజన సమాజ్ పార్టీ సోమవారం నిర్వహించిన ఎన్నికల సభ వద్ద అపశ్రుతి చేటుచేసుకున్నది. సభకు దాదాపు 2,500 మంది తరలివచ్చారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికి అభ్యర్థి గోలిమోహన్ మాట్లాడుతుండగా గాలి అతివేగంగా రావడంతో ఒకసారిగా టెంట్ మొత్తం కూలిపోయింది. ఇనుపబొంగులతో వేసిన షామియానా, టెంట్.. గాలికి పైకిఎగిరి సభకు వచ్చిన మహిళలపై పడ్డాయి. దీంతో మహిళలు అరుపులు, కేకలతో పరుగులు తీశారు. అయితే ప్రమాదంలో దాదాపు 15 మందికి గాయాలయ్యాయి.
ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ దవాఖానకు తరలించారు. రుద్రంగికి చెందిన లక్ష్మికి ఎడమ చేతి ఎముక విరిగి తీవ్ర గాయం కాగా ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నది. మరో 10 మంది వరకు ఏరియా దవాఖానలో ప్రాథమిక చికిత్సపొంది ఇంటికెళ్లారు. సభ కవరేజీకి వచ్చిన ఇద్దరు మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. కాగా, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. తర్వాత ఆయన బాధితులను పరామర్శించారు.