హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పర్యావరణంలో వస్తున్న తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల ఈ సారి సగటు ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగాయి. ఈ రుతుపవన సీజన్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఈ ఏడాది శీతాకాలంలో తీవ్రమైన చలి ఉండవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
లా-నినా ప్రభావం కారణంగా ఈసారి ఎముకలు కొరికేంత చలి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్, డిసెంబర్ మధ్య 71శాతం వరకు చలితీవ్రత ఎకువగా ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఈ ఏడు శీతాకాలం ఇబ్బందికరంగా ఉంటుందని యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ ైక్లెమెట్ ప్రిడిక్షన్ సెంటర్ (సీపీపీ) వెల్లడించింది.
లా-నినా అనేది ఎల్నినో-దక్షిణ ఆసిలేషన్ (ఈఎన్ఎస్వో) చల్లని దశ. దీనిలో, పసిఫిక్ మహాసముద్రం, భూమధ్యరేఖ ప్రాంతం ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే తకువగా ఉంటుంది. దీని ప్రభావం పసిఫిక్ మహా సముద్రానికే పరిమితం కాదు. కానీ, మొత్తం ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సంవత్సరం స్వల్పకాలిక లా-నినా వచ్చే అవకాశం ఉన్నదని, పసిఫిక్ మహా సముద్రం సాధారణం కంటే చల్లగా ఉన్నదని సైమెట్ వెదర్ అధ్యక్షుడు శర్మ వెల్లడించారు.