హైదరాబాద్, ఏప్రిల్29 (నమస్తే తెలంగాణ) : తాగు, సాగు, పారిశ్రామిక, ఇతర అవసరాల కోసం కృష్ణా జలాల్లో 1,144 టీఎంసీలు కావాలని ఏపీ సర్కారు వాదిస్తున్నది. ఈ మేరకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ)ను దాఖలు చేసింది. వరద జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులకు కూడా నికర జలాలను కేటాయించాలనే డిమాండ్‌ను ముందు పెట్టడం చర్చనీయాంశమైంది.
ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1005, గోదావరి మళ్లింపు ద్వారా వచ్చే 45 మొత్తంగా 1,050 టీఎంసీల కృష్ణాజలాలను తెలంగాణ, ఏపీ మధ్య పునఃపంపిణీ చేయాలని, ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని అంతర్రాష్ట్ర నదీవివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం గత అక్టోబర్‌లో మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ఇప్పటికే ఎస్వోసీ సమర్పించింది. ఏపీ మాత్రం జాప్యం చేస్తూ వచ్చింది. ఏకంగా విచారణనే నిలిపివేయాలనే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నది.
ఈ నెల 8న విచారణ ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లోనూ 28లోగా ఎస్వోసీ దాఖలు చేయాలని ఏపీ సర్కారుకు ట్రిబ్యునల్ చైర్మన్, జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏపీ సర్కారు సోమవారం ఎస్వోసీ దాఖలు చేసింది. 179 పేజీలతో విచారణ అంశాలను నివేదించింది. కొత్త మార్గదర్శకాల జారీ తర్వాత ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89కి ఉన్న ప్రాధాన్యత, రివర్ బేసిన్ అవతలికి కృష్ణా జలాల తరలింపు, ఇందుకోసం ట్రిబ్యునల్ 1, 2 ఇచ్చిన హక్కులు, తెలంగాణ ప్రాజెక్టులు, గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి మళ్లింపు, తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలు, బేసిన్లో నీటి సమృద్ధి, కొరత సందర్భాల్లో పాటించాల్సిన ప్రాజెక్టుల ప్రోటోకాల్, గోదావరి నీటి మళ్లింపు అంశంపై బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు ఉన్న విచారణార్హత అంశాలపై తన వాదనలను సమర్పించింది.
వాటాకు మించి డిమాండ్..
ఇప్పటికే వినియోగించుకుంటున్న 512.04టీఎంసీలతోపాటు, అదనంగా వరద జలాల ఆధారంగా నిర్మించిన తెలుగు గంగా, హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్, వెలిగొండ ప్రాజెక్టులకు 150.50టీఎంసీలు, ఆయా ప్రాజెక్టుల కింద పెరిగిన ఆయకట్టుకు అదనంగా 114.75, భవిష్యత్‌లో చేపట్టే ప్రాజెక్టుల కోసం 176.45 మొత్తంగా 957.71టీఎంసీలు కావాలని వెల్లడించింది.
తాగునీటి అవసరాలకు 140.62, జలవిద్యుత్ ఉత్పత్తి కోసం 2, పారిశ్రామిక అవసరాలకు 29.23, జలరవాణా ఇతర అవసరాలకు 14 కలిపి మొత్తం నికరంగా 1143.56 టీఎంసీలు కావాలని నివేదించింది. వాస్తవానికి కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ట్రిబ్యునల్ 1, 2 కేటాయించిన నికర జలాలు 1005 టీఎంసీలే కాగా వాటాకు మించి కావాలని ఏపీ నివేదించడం గమనార్హం. ఇక గోదావరి మళ్లింపు ద్వారా వచ్చే 45టీఎంసీలపై విచారించే అర్హత ట్రిబ్యునల్‌కు లేదని ఏపీ పేర్కొన్నది.
291టీఎంసీలు ఆదా చేయొచ్చు
ఉమ్మడి ఏపీకి ఉన్న 1050 టీఎంసీల కృష్ణా జలాల వాటాలో 789 టీఎంసీలు తమకు కేటాయించాలని తెలంగాణ ఇప్పటికే ఎస్వోసీలో నివేదించింది. వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299, నిర్మాణంలో ఉన్నవాటికి 238, భవిష్యత్‌లో నిర్మించే ప్రాజెక్టులకు 216, తాగునీటి కోసం 36 కలిపి మొత్తం 789 టీఎంసీలు కేటాయించాలని కోరింది. 75 శాతం లభ్యత ఆధారంగా 555టీఎంసీలు, 65 శాతం లభ్యత ఆధారంగా 575 టీఎంసీలివ్వాలని ప్రతిపాదించిన తెలంగాణ, తాజాగా మరో వాదన ముందుకు తెచ్చింది.
ఏపీకి కేటాయించిన 512టీఎంసీల్లో నీటియాజమాన్య, వ్యవసాయ పద్ధతులు, టెక్నాలజీ, కొత్త వంగడాల వినియోగంతో ఏకంగా 291టీఎంసీలు ఆదా చేయవచ్చని పేర్కొన్నది. కృష్ణా డెల్టాకు 53 టీఎంసీలు, సాగర్ కుడికాలువకు 65.96, తుంగభద్ర కుడికాలువకు 17.41, కేసీ కెనాల్‌కు 4.66టీఎంసీలు సరిపోతాయని, ఆ ప్రకారం ఆయా ప్రాజెక్టులకు సహేతుకమైన కేటాయింపులు చేస్తే మొత్తం 204 టీఎంసీలు సరిపోతాయని, 512టీఎంసీల్లో దాదాపు 291టీఎంసీలు ఆదా చేసే అవకాశముందని ప్రతిపాదించింది. రెండు రాష్ర్టాల వాదనలపై మే15,16, 17 తేదీల్లో ట్రిబ్యునల్ విచారణ కొనసాగనున్నది.
నీళ్లను ఎందుకు మళ్లించారు?
సాగర్ టెయిల్‌పాండ్ నుంచి నీటి మళ్లింపు అంశంపై వివరణ ఇవ్వాలని ఏపీ సర్కారుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) లేఖ రాసింది. బోర్డు అనుమతుల్లేకుండా సాగర్ టెయింట్పాండ్ నుంచి మూడు టీఎంసీలను ఈ నెల 13న పులిచింతలకు ఏపీ సర్కారు తరలించింది. టెయిల్‌పాండ్ స్లూయిజ్‌లను తెరిచి నీటిని మళ్లించింది. దీనిపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఏపీ చర్యను ఖండిస్తూ ఫిర్యాదు చేయగా బోర్డు ఏపీ సర్కారుకు లేఖ రాసింది.