హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మకజొన్నల విక్రయానికి నిర్వహించిన టెండర్లలో అక్రమాలకు చోటు ఇవ్వవద్దంటూ రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మార్క్‌ఫెడ్ ఎండీకి రాసిన లేఖాస్త్రం ఫలించింది. గతంలో అక్రమాలకు పాల్పడి, ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన సంస్థలను టెండర్ల నుంచి దూరం పెట్టాలని ఆయన రాసిన లేఖతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 2025-26 వానకాలంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన 3.8 లక్షల టన్నుల మక్కలను వేలంలో విక్రయించడానికి మార్క్‌ఫెడ్ టెండర్లు ఆహ్వానించింది. గోదాములవారీగా టెండర్లు పిలిస్తే స్పందన రాకపోవడంతో లాట్లుగా విభజించి మళ్లీ టెండర్లు పిలిచారు.
గత నెల 23వ తేదీ వరకు టెండర్లు స్వీకరించారు. ఐదు ఏజెన్సీలు సిండికేట్‌గా మారి ఒక్కో లాటుకు రెండు చొప్పున 10 టెండర్ బిడ్లు దాఖలు చేశాయి. సగటున క్వింటాల్‌కు రూ.1,400 నుంచి రూ.1,500 వరకు కోట్ చేసినట్టు సమాచారం. టెండర్లు దాఖలు చేసిన మొత్తం ఐదు ఏజెన్సీల్లో రెండు వివాదాస్పద సంస్థలు (కేంద్రీయ భండార్, న్యాకాఫ్) ఉన్నాయని గుర్తించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి.. గత నెల 24న మార్ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డికి లేఖ రాశారు.
ధాన్యం సేకరణలో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ సంస్థలకు చెందిన రూ.65.9 కోట్ల డిపాజిట్లను ప్రభుత్వం గతంలోనే జప్తు చేసిందని గుర్తుచేశారు. పెద్ది ఫిర్యాదుపై మార్ఫెడ్ ఎండీ శ్రీనివాసరెడ్డి స్పందించారు. కేంద్రీయ భండార్, న్యాకాఫ్ సంస్థల టెక్నికల్ బిడ్లను రద్దు చేశారు. మార్ఫెడ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు సంస్థ లు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఈ నెల 6న కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉన్నది. అప్పటివరకు వాణిజ్య బిడ్లను తెరువకుండా మార్ఫెడ్ వేచి చూస్తున్నది. ప్రస్తుత టెండర్ ప్రక్రియలో పారదర్శకత, రాష్ట్ర ఖజానాకు, రైతులకు మేలు చేకూరింది.