ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంటిల్లిపాది కోసం కష్టపడుతూనే ఉంటుంది అమ్మ. అలాంటి అమ్మ రోజువారీ పనుల్లో కష్టాన్ని చూసి చలించిపోయాడు ఆ కుర్రాడు. అమ్మకోసం టెక్నాలజీ సాయంతో ఆమెకు ఇంటిపనుల్లో సహకరించే ఆవిష్కరణలు చేసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు కేరళకు చెందిన 12 ఏళ్ల లెవిన్ పాలోస్. అందుకోసం ఖరీదైన పెద్ద పెద్ద పరికరాలను కూడా ఉపయోగించలేదు. తన చుట్టూ ఉండే వస్తువులు, పనికిరాని కార్డుబోర్డులాంటి వాటితోనే ఈ అద్భుత ఆవిష్కరణలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
రోజువారీ సమస్యలను పరిష్కరించడానికి రూపొందించిన ఈ ఆవిష్కరణలు చూసి ఆశ్చర్యపోవాల్సిందే. వాటిలో కొన్ని.. వాక్యూమ్ క్లీనర్, ఒక బటన్ నొక్కగానే కర్టెన్లను తెరిచి మూసేందుకు మోటర్తో నడిచే ఆటోమేటెడ్ కర్టెన్ సిస్టమ్, స్టవ్ నుంచి దూరంగా వెళ్లినా ఆటోమేటిక్గా గరిట పట్టుకొని తిప్పే ఫుడ్ స్టిరర్ లాంటివి ఉన్నాయి. వీటితోపాటు కార్డ్బోర్డ్తో నిర్మించిన ఒక రోబోట్ ఆ కుర్రాడి క్రియేటివిటీకి, ఇంజినీరింగ్ నైపుణ్యాలకు నిదర్శనంగా నిలుస్తున్నది. తాను రూపొందించిన ఈ రోబోట్ తన తల్లికి రోజువారీ పనులలో ఉపయోగపడుతుంది. తాను చేసిన ఆవిష్కరణలు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతుండటంతో ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం లెవిన్పై ప్రశంసల వర్షం కురిపించారు.