జగిత్యాల, జూలై 30 (నమస్తే తెలంగాణ): ప్రపంచాన్ని గడగడలాడించిన నియంతలను సైతం బయపెట్టిన సబ్జెక్ చరిత్ర (హిస్టరీ). సరిగ్గా 25 ఏండ్ల క్రితం తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూనియర్ కాలేజీల్లో చరిత్ర సబ్జెక్ట్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణను 60 ఏండ్లు పాలించిన సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం మూలంగా చరిత్ర సబ్జెక్ట్ మూలపడింది. ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్రంలో ఒక విభాగంగా బోధిస్తున్న చరిత్ర సబ్జెక్ట్ ఇంటర్, డిగ్రీ స్థాయికి వచ్చేసరికి మాయం అయిపోతున్నది.
ఇంటర్లో హెచ్ఈసీ గ్రూప్ ఆదరణ కోల్పోతున్నది. చాలా కాలేజీల్లో చరిత్ర లెక్చరర్ పోస్టును మంజూరు చేయకుండా, చరిత్ర/ పౌరశాస్త్రం పోస్టులను ఏర్పాటు చేశాయి. దీంతో ఆయా కాలేజీల్లోనూ చరిత్ర సబ్జెక్టును పౌరశాస్త్రం లెక్చరర్లు బోధిస్తున్నారు. యాభై సంవత్సరాలుగా ఆ పోస్టులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూల్స్‌లో సైతం చరిత్ర సబ్జెక్టుకు సంబంధించిన పీజీటీని మంజూరు చేయడంలేదు.
పదిహేనేండ్లుగా మోడల్ స్కూల్స్‌లో నిర్వహిస్తున్న ప్లస్ టూ కాలేజీల్లో చరిత్ర పోస్టులు లేకుండాపోయాయి. గురుకులాల్లోను చరిత్ర బోధన ఊసేలేదు. చరిత్ర బోధనపై ప్రభుత్వం శీతకన్ను వేయడంతో తెలంగాణ అస్తిత్వంతోపాటు ఉద్యమాల ఊసులు, ఫలితాలు తెలియని దౌర్భాగ్యస్థితి నెలకొంది. ప్రైవేట్ కాలేజీలు ఫీజులు దండుకోవడమే లక్ష్యంగా సాగుతూ చరిత్ర సబ్జెకును తీసిపారేశాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 29 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే చరిత్రను అధ్యయనం చేస్తున్న విద్యార్థులు 20 వేలకు లోపుగా ఉండడం గమనార్హం. ఇది ఒక వంతు కంటే తక్కువ. ఉద్యమం ద్వారా ఏర్పడిన తెలంగాణలో చరిత్ర సబ్జెక్టు కీలకమైనదిగా మారింది. తెలంగాణ ఉనికినే లేకుండా చేసిన సీమాంధ్రులను మన చరిత్రకారులు తుత్తినియలు చేశారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర తెలంగాణ ఉద్యమం, చరిత్రనే పోటీ పరీక్షల్లో ప్రధాన సబ్జెక్టుగా ఉంటుందని ప్రకటించారు. దానికి అనుగుణంగా పోటీ పరీక్షల సిలబస్‌లో చరిత్రకు పెద్దపీట వేశారు. గ్రూప్-1, గ్రూప్-2ల్లో తెలంగాణ చరిత్రకు, ఉద్యమ చరిత్రకు ప్రత్యేక పేపర్లను ఏర్పాటు చేశారు.
ఒకప్పుడు మహామహులను తయారు చేసిన చరిత్ర సబ్జెక్టుకు పూర్వ వైభవం రావాలంటే ఇంటర్ స్థాయిలో కామన్ సబ్జెక్టుగా మార్చాల్సిందేనంటున్నారు మేధావులు. 15 సంవత్సరాలవరకు ప్రభుత్వ సెక్టార్లో ఉద్యోగాల భర్తీ ఉంటుందని, అందులో చరిత్ర సబ్జెక్టు కీలక పాత్ర పోషిస్తుందని, చరిత్ర అధ్యయనంతో ఉపాధికి మార్గం ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు. చరిత్ర కామన్ సబ్జెక్టు చేయడంతో ప్రతి విద్యార్థికీ చరిత్ర, సంస్కృతి, నాగరికత, ఉద్యమాలపై అవగాహన ఏర్పడుతుందని, ఇది మానవ వికాసానికి తోడ్పడుతుందని సూచిస్తున్నారు. చరిత్ర అధ్యయనం చేసిన పలువురు నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయంటున్నారు.